తెల్లబోతోంది!
ABN , Publish Date - Apr 27 , 2026 | 12:36 AM
ఒకప్పుడు తీర ప్రాంతంలో పండే ఉప్పు పంటకు ఎంతో డిమాండ్ ఉండేది. పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఈసాగు చేసేందుకు రైతులు మక్కువ చూపేవారు.
క్రమంగా తగ్గిపోతున్న ఉప్పు మడులు
కలిసిరాకపోవడంతో ఆక్వా వైపు రైతుల మొగ్గు
నరసాపురం రూరల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు తీర ప్రాంతంలో పండే ఉప్పు పంటకు ఎంతో డిమాండ్ ఉండేది. పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఈసాగు చేసేందుకు రైతులు మక్కువ చూపేవారు. అనాదిగా తీర ప్రాంతవాసులు ఈ పంటపైనే ఆధారపడి జీవించేవారు. పంటకు అయ్యే ఖర్చు తక్కువుగా ఉండటం, దిగుబడి ఆధికంగా ఉండటంతో తీరంలో ఎక్కడ చూసినా తెల్ల పంటే దర్శనమిచ్చేది. కానీ నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రకృతి వైపరీత్యాలు రావడం, పండించిన పంటకు సరైన గిట్టుబాటు లేకపోవడం, ఖర్చు పెరగడంతో కాలక్రమేనా చాలామంది రైతులు ఆక్వా వైపు అడుగులు వేస్తున్నారు.
నష్టాలతో తగ్గుతున్న సాగు
నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సుమారు రెండు వేల ఎకరాలపైనే ఉప్పు సాగు జరుగుతుండేది. డిసెంబర్ నెల నుంచి ప్రారంభమయ్యే ఈ పంట జూన్ నెలాఖరు వరకు సాగుతుండేది. పూర్తిగా ఎండలపైనే ఆధారపడే ఈ పంట బియ్యపుతిప్ప, చినలంక, పీఎంలంక, తూర్పుతాళ్ళు, కేపీపాలెం, పేరు పాలెం, మోళ్లపర్రు గ్రామాల్లో సాగు చేసేవారు. ఒకే కుటుంబంలో అందరూ కలిసి సాగు చేయడంతో పెద్దగా ఖర్చయ్యేది కాదు. ఇక్కడ పండించిన ఉప్పుకు జిల్లా వ్యాప్తంగా మంచి గిరాకీ ఉండేది. డిమాండ్‌కు అనుగుణంగా సాగు చేసేవారు. అయితే గత పదేళ్ల నుంచి ఈ సాగు క్రమంగా తగ్గుతూ వస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రకృతి వైపరీ త్యాల సమయాల్లో ఉప్పు రాశుల్ని భధ్రపర్చుకు నేందుకు గిడ్డంగులు ఉండక పోవడంతో చాలామంది రైతులు ఈ పంటకు స్వప్తి పలుకుతున్నారు ఈ కారణంగా రెండు వేల ఏకరాల్లో సాగు ఉప్పు పంట నేడు 50 ఎకరాల్లోపే పండిస్తున్నారు.
ఆక్వా వైపు రైతుల చూపు
ఉప్పు పంటకు పెట్టిన పెట్టుబడులు, ఖర్చులు రాకపోవడంతో చాలామంది రైతులు ఈ సాగుకు స్వప్తి చెప్పి ఆక్వా సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఉన్న ఉప్పు మడులను చెరువులుగా మారుస్తున్నారు. ఈ కారణంగా తీర ప్రాంతంలో వేల ఎకరాలు ఆక్వా చెరువులుగా మారాయి. పంట దిగుబడి బాగా వస్తే ఒకేసారి లాభాలు వస్తుండటంతో చేప, రొయ్యల సాగు చేసేందుకు రైతులు మక్కువ చూపుతున్నారు. గతంలో ఆయిల్ ఇంజన్ల సాయంతో చెరువుల సాగే చేసేవారు. ప్రభుత్వం ఆక్వా జోన్‌లుగా విభజించి తీర ప్రాంత వెంబడి కరెంట్ అందించింది. సబ్సిడీ కూడా ఇవ్వడంతో చాలామంది రైతులు ఉప్పు సాగు విడిచి ఆక్వా పంటలను సాగు చేస్తున్నారు.