Share News

సెకండ్‌.. చిక్కులు

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:36 AM

సెల్‌ఫోన్‌ తక్కువ ధరకు వస్తుందని పాత ఫోన్‌ కొంటున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. ఇలాంటి ఫోన్లు కొంటే చిక్కుల్లో పడే ప్రమాదం ఎక్కువగా వుంది.

సెకండ్‌.. చిక్కులు
రికవరీ చేసిన సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత (ఫైల్‌)

తక్కువ ధరకు వస్తున్నాయంటే.. దొంగిలించిన, నేరాలకు ఉపయోగించిన ఫోన్లు కావచ్చు !

భీమవరం ప్రాంతానికి చెందిన

ఒక వ్యక్తి తక్కువ ధరకు వస్తుందని సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ గుర్తు తెలియని వ్యక్తి వద్ద కొనుగోలు చేశాడు. కొంత కాలం తర్వాత జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది ఫోన్‌ చేసి ‘నీ దగ్గర వున్న ఫోన్‌ దొంగిలించిన ఫోన్‌. వెంటనే దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫోన్‌ అప్పగించాలి. లేని పక్షంలో క్రిమినల్‌ కేసు నమోదు అవుతుంది’ అని చెప్పడంతో బాధితుడు ఖంగుతిని పోలీసులకు ఫోన్‌ అప్పగించాడు.

నరసాపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఒక సెల్‌ఫోన్‌ దుకాణం లో సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్‌ కొనుగోలు చేశాడు. కొద్ది రోజుల తర్వాత పోలీసులు ఫోన్‌ చేసి ఆ ఫోన్‌ గల వ్యక్తి పోగొట్టుకున్నారని, వెంటనే సెల్‌ఫోన్‌ అప్పగించాలని ఆదేశించారు.

ఆకివీడు ప్రాంతానికి చెందిన వ్యక్తి తెలియని వ్యక్తి వద్ద సెల్‌ఫోన్‌ సెకండ్‌ హ్యాండ్‌లో కొనుగోలు చేశాడు. కొద్దిరోజులకు ఆ వ్యక్తి నివాసానికి పోలీసులు చేరుకుని ఆరా తీశారు. అతను కొనుగోలు చేసిన సెల్‌ఫోన్‌ కొందరు నిందితులు సైబర్‌ క్రైమ్‌కు వినియోగించి బాధితుల వద్ద డబ్బు దోచుకున్నారని, వారు వినియోగించిన ఫోన్‌ ఐఎంఈఐ నంబరును బట్టి ఫోన్‌

ఇక్కడ ఉందని చెప్పడంతో ఆ వ్యక్తి ఖంగుతిన్నాడు.

భీమవరం క్రైం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): సెల్‌ఫోన్‌ తక్కువ ధరకు వస్తుందని పాత ఫోన్‌ కొంటున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త. ఇలాంటి ఫోన్లు కొంటే చిక్కుల్లో పడే ప్రమాదం ఎక్కువగా వుంది. ఎంత తెలిసిన వారైనా ఇలాంటి ఫోన్‌ తీసుకోకపోవడం ఉత్తమం. కొంత మంది దళారులు దొంగిలించిన సెల్‌ఫోన్లను తీసుకువచ్చి అందినకాడికి దోచుకుంటున్నారు. అది తెలియని అమాయకులు వారి వలలో పడి వేలల్లో వారికి ముట్టచెబుతున్నారు. కొంత కాలానికి అవి దొంగిలించిన ఫోన్లని తేలడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే కొన్ని సైబర్‌ నేరాలకు వినియోగించిన ఫోన్లను తమ పని ముగియగానే తక్కువ ధరకు అంటగడుతున్నారు. తర్వాత ఆయా కేసుల్లో పోలీసులు అంతర్జాతీయ మొబైల్‌ పరికర గుర్తింపు (ఐఎంఈఐ) నెంబర్‌ను బట్టి ఆ ఫోన్‌లు ఎక్కడున్నాయో తెలుసుకుని వచ్చి కేసుల్లో లాగుతున్నారు. అలా సెకండ్‌ హ్యాండ్‌ సెల్‌ఫోన్ల వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దొంగిలించిన, దొరికిన సెల్‌ఫోన్లకు సంబంధించిన వివరాలను పోలీసు సిబ్బంది ప్రత్యేక టీమ్‌ల ద్వారా గుర్తించి ఆ ఫోన్లు ఎక్కడున్నాయో తెలుసుకుని రికవరీ చేస్తున్నారు. దీనివల్ల వేలల్లో కొన్న ఫోన్లను నష్టపో వడమే కాదు.. కేసులు కూడా ఎదుర్కోవడం మన వంతవుతుంది.

రూ.3 కోట్ల విలువైన ఫోన్లు రికవరీ

భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడినప్పుడు సెల్‌ఫోన్ల రికవరీల కోసం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలోను సెల్‌ఫోన్ల రికవరీపై ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటుచేశారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు సుమారు రెండు వేల ఫోన్లు (సుమారు రూ.3 కోట్లు) రికవరీ చేశారు. తద్వారా దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్లు రికవరీలో పోలీసులు ముందున్నారు. పోగొ ట్టుకున్న బాధితులు ఆనందం వ్యక్తం చేసినా సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లు కొన్న వారు లబోదిబోమన్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫోన్లు కొనుగోలు చేసి, చివరకు ఇలా జరిగిందని తలలు పట్టుకుంటున్నారు. పోలీసులు పదేపదే సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లు తెలిసిన వారి వద్ద మాత్రమే కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు.

సైబర్‌ క్రైం నేరస్థుల తెలివితేటలు

కొందరు సైబర్‌ క్రైమ్‌ నేరస్థులు ఏదైనా నేరానికి ఉపయోగించిన ఫోన్లను తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అది తెలియక కొంద రు అమాయకులు తక్కువ ధరకు కొని ఇరుక్కుపోతున్నారు. నేరస్థులు ఉపయోగించిన ఫోన్ల ఐఎంఈఐ నంబర్లను బట్టి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కనుగొని అమాయకులపై చర్యలు తీసుకుంటున్నారు. అలా చాలా మంది సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్ల వల్ల అనేక రకాల చిక్కుల్లో పడుతున్నారు. కాబట్టి తస్మాత్‌ జాగ్రత్త.

బిల్లు వుంటేనే పాత ఫోన్‌ కొనాలి

జూ కొందరు దొంగతనం చేసిన ఫోన్లను తక్కువ ధరకు విక్రయించడంతో అది తెలియని అమాయకులు కొనుగోలు చేస్తారు. ఆ ఫోన్లు పోగొట్టు కున్న వారు ఫిర్యాదు చేస్తే.. పోలీసు పరిశోధనలో కొన్నవాళ్లు దొరికిపో తుంటారు. కాబట్టి దుకాణాల్లో సెకండ్‌ హ్యాండ్‌ ఫోన్లు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. సైబర్‌ నేరస్తులు వినియోగించిన ఫోన్లు అందుబాటులో పెడుతున్నారు. కాబట్టి తక్కువ ధరకు ఫోన్‌ కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి.

– రఘువీర్‌విష్ణు, భీమవరం డీఎస్పీ

Updated Date - Aug 09 , 2026 | 12:36 AM