Share News

అదిరింది

ABN , Publish Date - May 11 , 2026 | 12:41 AM

దాళ్వా సాగులో రైతన్నలకు లాభాల పంట పండింది. పెట్టుబడి తక్కువతో అధిక దిగుబడులు సాధించారు. ధాన్యం విక్రయ సమయంలో రైతన్నల కళ్ళల్లో ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి.

అదిరింది

భీమవరం రూరల్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): దాళ్వా సాగులో రైతన్నలకు లాభాల పంట పండింది. పెట్టుబడి తక్కువతో అధిక దిగుబడులు సాధించారు. ధాన్యం విక్రయ సమయంలో రైతన్నల కళ్ళల్లో ఆనందాలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వ ప్రోత్సాహం, వాతావరణం అనుకూలం దాళ్వా సాగులో రైతులు ఎన్నడూ లేని ఆదాయం చవిచూస్తున్నారు. దాళ్వా పంట దిగుబడులలో సరాసరి దిగుబడి ఎకరానికి 55 బస్తాల నుంచి 60 బస్తాలు ఉండటం వరిసాగుకు మంచి రోజులుగా మారాయి. ఈ దాళ్వా పంటలో 15 వేల ఎకరాల వరకు సాగు భూమి పెరిగింది. 2 లక్షల 17 వేల సాగు కాస్తా 2 లక్షల 31 వేల సాగు జరిగింది. ప్రస్తుత పంట దిగుబడులను బట్టి వచ్చే పంటలలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

70 బస్తాల మైలురాయిని చేరారు

ఈ ఏడాది దాళ్వా పంటలో రైతన్నలు రికార్డులు సృష్టించారు. ఎన్నడూ చూడని దిగుబడులు సాధించారు. వీరవాసరం మండలంలో ఎకరానికి 60 బస్తాలు పైబడి దిగుబడులు సాధించిన రైతులు ఉన్నారు. ఒక్కోచోట కొట్టు పొట్టుగా అమ్మిన ధాన్యం 70 బస్తాలు దిగుబడిగా వచ్చింది. మిగిలిన మండలాల్లోను 60 బస్తాలు చేరువలో పంట పండింది.

8.50 లక్షల టన్నుల పైబడి దిగుబడి..

వరిసాగులో గడిచిన నాలుగు పంటలుగా ధాన్యం దిగుబడి అంచనాలలో అధికారులు లెక్కకన్నా ఎక్కువ ధాన్యం పండుతోంది. ఈ దాళ్వా పంటలోను అదే తరహాలో అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 2 లక్షల 10 వేల ఎకరాల్లో పంట మాసూళ్ళు అయ్యింది. 6 లక్షల టన్నులు కొనుగోలు జరిగింది. 2 లక్షలు పైగా టన్నుల ధాన్యం రైతుల వద్ద ఉంది. ఇంకా 21 వేల ఎకరాల మాసూళ్ళు చేయాల్సి ఉంది. దాని లెక్కన 8 లక్షల 50 వేల టన్నుల కంటే దిగుబడి పెరగనుంది. అధికారుల అంచనా 8 లక్షల 50 వేల టన్నులుగా వేసుకున్నారు.

కౌలు రైతుల్లో ఆనందం

దాళ్వా పంటలో అధిక దిగుబడులు కౌలు రైతుల్లో ఆనందాలను మిగిల్చాయి. ఈ మధ్యన కౌలు రైతులు భయపడుతూ సాగు చేస్తున్నారు. లాభం ఎలా ఉన్నా నష్టాలు వస్తాయన్న భయం వారిలో నెలకొంది. రెండేళ్ళ క్రితం వరి భూమి లీజు బాగా పడిపోయింది. దాళ్వా పంటలో ఎకరానికి 15 బస్తాలు పైబడి ఉండేది. ఇప్పుడు 10 బస్తాల నుంచి 12 బస్తాల లోపు ఉంది. దీనికి కారణం.. కౌలు చేసేవారు ముందుకు రాకపోవడమే. అలాంటిది దాళ్వా పంట కౌలు రైతులకు భరోసాగా నిలిచింది. ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టింది.

పెట్టుబడి తగ్గింది.. లాభం పెరిగింది

ఈ ఏడాది దాళ్వా పంటలో వాతావరణం అనుకూలించడం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గింది. ఎకరానికి రూ. 5 వేలు వరకు పెట్టుబడి తక్కువ అయ్యింది. అదే అనుకూల వాతావరణం వల్ల దిగుబడులు బాగా పెరిగాయి. దీంతో పెట్టుబడి తక్కువ... లాభం ఎక్కువ సాగుగా దాళ్వా పంట మారింది. ఎకరానికి 55 బస్తాలు దిగుబడిగా లెక్కవేస్తే రూ. 98 వేలు రాబడి వస్తుంది. పెట్టుబడి ఎకరానికి రూ. 35 వేలు వరకు అయ్యింది. అంటే రూ. 63 వేలు లాభం వచ్చింది. కౌలు రైతుకు రూ. 22 వేలు లీజు తీసివేయగా రూ.46 వేలు మిగులుతుంది. ఈ లాభాలు వచ్చే సాగు చేయడానికి భరోసాగా ఉంటామని రైతులు అంటున్నారు.

పెట్టుబడి (ఎకరానికి..రూ..)

నారుమడికి 2,500

దమ్ముకి 3,500

నాట్లు వేయడానికి 5,000

గట్టు లంకలకి 1,200

కలుపుతీతకు 1,000

ఎరువులకు 6,200

పురుగు మందులకు 6,000

కూలీలకు 3,000

వరికోత మిషన్‌కు 3,000

ధాన్యం ఆరబెట్టడం,

కూలీలు,బరకాలకు 3,600

మొత్తం 35,000

Updated Date - May 11 , 2026 | 12:41 AM