Share News

మెనూ అమలేదీ..?

ABN , Publish Date - Jul 27 , 2026 | 12:52 AM

గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్‌గాంధీ యూని వర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో గల నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థులకు మెనూ అమలు కావ డం లేదు.

మెనూ అమలేదీ..?
ఓ విద్యార్థిని కంచంలో పచ్చడి అన్నం

గత ఏడాది హెల్పింగ్‌ హ్యాండ్స్‌తో అరకొరగా సరఫరా

తరగతులు ప్రారంభమై నెల కావస్తున్నా అమలు కాని మెనూ

వీసీనే డైరెక్టర్‌గా ఉన్నా అందని పౌష్టికాహారం

(నూజివీడు టౌన్‌ – ఆంధ్రజ్యోతి)

గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విద్యను అందించే లక్ష్యంతో ఏర్పాటైన రాజీవ్‌గాంధీ యూని వర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలో గల నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థులకు మెనూ అమలు కావ డం లేదు. నిబంధనల ప్రకారం వారానికి ఐదు రోజులు గుడ్లు, రెండు రోజులు మాంసాహారం అందించాల్సి వుంది. అయితే జూలై 1వ తేదీ నుంచి రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ పరిధిలోగల ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్లు తిరిగి తెరుచుకున్నా మెనూ అమలు మాత్రం గాడిలో పడ లేదు. అక్షయ పాత్ర అనుబంధ సంస్థ ద్వారా దాని నిబంధన లకు అనుగుణంగా శాఖాహార భోజనం మాత్రమే విద్యార్థు లకు అందిస్తున్నారు. మరి కోడిగుడ్ల, మాంసాహారం మరేదైనా సంస్థకు కాంట్రాక్ట్‌ ఇస్తారా ఇస్తే ఎప్పటి నుంచి విద్యార్ళులకు మాంసాహారం సరఫరా అవు తుందనే అంశాలపై నేటికీ ట్రిపుల్‌ ఐటీ ఉన్నతాధికారులు స్పష్టమైన విధానాన్ని ఎంచు కోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గత ఏడాది అరకొరే..

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో మాంసాహారం కోడిగుడ్ల సరఫరా గతేడాది అరకొరగానే సరఫరా అయింది. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో నడుస్తున్న మెస్‌లు నాసిరకపు భోజనాలు అందిస్తున్నాయంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టి న నేపథ్యంలో మెస్‌ నిర్వహణ కాంట్రాక్టులు ముగియగానే గత దసరా సెలవులు అనంతరం ట్రిపుల్‌ ఐటీ మెస్‌ల నిర్వహణ బాధ్యత అక్షయపాత్ర అనుబంధ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. అయితే సదరు సంస్థ మాంసాహార భోజనం సరఫరా చేసేందుకు నిరాకరిస్తూ తమ విధివిధానా లకు అనుగుణంగా శాకాహార భోజనం.. అదీ అల్లం, వెల్లుల్లి, ఉల్లి తదితర మసాలాలు లేకుండా ఆహారం సరఫరా చేసేందుకు మాత్రమే ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యనభ్యసిస్తున్న 6000 మంది, అనుబంధంగా ఇదే క్యాంపస్‌లో నడుస్తున్న ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ పీయూసీ విద్యార్థులు మరో 2000 మందికి కోడిగుడ్లు, మాంసాహారం సరఫరా ప్రశ్నా ర్థకంగా మారింది. అయితే నాడు మాంసాహార సరఫరా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ లేదా వేరేదైనా స్వచ్ఛంద సేవా సంస్థలకు అప్పగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సూచించడంతో నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులతో నడుస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ హెల్పింగ్‌ హ్యాండ్స్‌కు మాంసాహారం, కోడిగుడ్ల సరఫరా బాధ్యతను అప్పగించారు.

దృష్టి సారిస్తారా..?

ఆర్జీయూకేటీ పరిధిలో మిగిలిన క్యాంపస్‌లలో మెనూ పూర్తిస్థాయిలో అమలు అవుతున్నా కేవలం ఇక్కడ మాత్రమే అమలు అవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఆర్జీయూకేటీ వీసీకి హెడ్‌ క్వార్టర్‌గా ఉన్న నూజివీడు ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో వీసీనే ఇన్‌చార్జి డైరెక్టర్‌గాను వ్యవహరిస్తున్న నేపథ్యంలో మెనూ సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఇప్పటికైనా మెనూ ప్రకారం భోజన సదు పాయాలు అందేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.

మెస్‌ బిల్లులు చెల్లిస్తున్నా పచ్చడి మెతుకులే గతి..

గతంలో మెస్‌ టెండర్లు జరిగిన సందర్భంలో ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.88 ఖర్చు చేయగా ప్రస్తుతం రూ.116 వరకు ఖర్చు చేస్తున్నారు. దీనిలో ప్రభుత్వం ఇచ్చే మెస్‌ చార్జీలు పోను మిగిలినవి విద్యార్థులే చెల్లించాల్సి వుంటుంది. మొత్తం నెలకు మూడున్నర వేలు మెస్‌ చార్జీలుగా చెల్లిస్తున్న విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీలో నాణ్యమైన భోజనానికి బదులు పచ్చడి మెతుకులే గతవుతున్నాయి. ఆదివారం నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో మాంసాహారం అందిస్తున్నారో లేదో పరిశీలించేందుకు విలేకరుల బృందం వెళ్లగా ఆదివారం పనీర్‌తో కుర్మా పలావ్‌ను అందిస్తుండగా అక్కడ విద్యార్థుల్లో అగ్రభాగం ఇంటి వద్ద నుంచి తెచ్చుకున్న పచ్చడితో భోజనం చేయడం కనిపించింది. క్యాంపస్‌ ఓపెన్‌ అయిన తర్వాత ఒక్కసారి కూడా మాంసాహారం గానీ, గుడ్డు గానీ పెట్టలేదని, రెండు రోజుల క్రితం వరకు వండి వార్చిన అన్నం ముక్క వాసన వచ్చిందని, అల్పాహారం నాణ్యతగా ఉండడం లేదని విద్యార్థులు వాపోయారు. అల్పాహారంలో ఇడ్లీ మినహా మిగిలినవేవీ రుచించడం లేదని అందుకే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పచ్చడితోనే తాము అన్నం తింటున్నామంటూ తెలిపారు.

Updated Date - Jul 27 , 2026 | 12:52 AM