అక్కడే..ఆగిన ఆక్వా యూనివర్సిటీ
ABN , Publish Date - Aug 19 , 2026 | 01:08 AM
జిల్లాలో ప్రతిష్మాతకంగా చేపడుతున్న ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు నిధులున్నా ముందుకు సాగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేదు.
బడ్జెట్‌లో రూ.20 కోట్ల కేటాయింపు
పిల్లర్ల వద్ద నిలిచిన భవనాలు
స్లాబ్ డిజైన్ కోసం ఎదురుచూపు
మూడేళ్ల క్రితం శంకుస్థాపన
రూ.100 కోట్లతో పనులు
వైసీపీ హయాంలో నిధులు పెండింగ్
నరసాపురం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రతిష్మాతకంగా చేపడుతున్న ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు నిధులున్నా ముందుకు సాగడం లేదు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపు రూ.10 కోట్లు పెండింగ్ బిల్లులు క్లియర్ చేసింది. ఈఏడాది బడ్జెట్‌లో రూ.20 కోట్లు కేటాయించింది. పనులు వేగవంతం చేద్దామంటే డిజైన్ సమస్య తలెత్తింది. దీంతో రెండు నెలలుగా పనులు నిలిచిపోయాయి
రాష్ట్ర విభజన తరువాత కేంద్రం ఏపీకి కేటాయించిన వాటిల్లో ఆక్వా యూనివర్సిటీ ఒకటి. 2016లో మంజూరైన ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు పలు జిల్లాలు పోటీపడ్డాయి. అయితే రాష్ట్రంలోనే పశ్చిమ ఆక్వాలో ముందంజలో ఉంది. దీన్ని పరిగణలోని తీసుకుని ఆప్పటి కూటమి ప్రభుత్వం ఈ యూనివర్సిటీని జిల్లాకు కేటాయించింది. 2023లో అప్పటి సీఎం జగన్ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. 40 ఎకరాల్లో నిర్మించే ఈ యూనివర్సిటీ భవనాలకు ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలో పనులు మొదలైనా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దఫాదఫాలుగా రూ.10 కోట్లు వరకు నిధులు మంజూరు చేసింది. దీంతో నిర్మాణ పనులు శ్లాబ్ వరకు వచ్చాయి. ప్రాంగణంలో నిర్మించే యూనివర్సిటీ, వీసీ భవనం, హాస్టళ్లు, ఉద్యోగులు భవనాలు, రైతుల ఇళ్లు వంటి నిర్మాణాలు ఈ స్థలంలో చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే అన్ని భవనాల నిర్మాణ పనులు ప్రారంభించారు. కొన్ని పిల్లర్ల వరకు వచ్చాక నిలిచిపోయాయి.
డిజైన్ జాప్యంతో పెండింగ్
ఈ భవనాలకు ఏపీ ఈడబ్ల్యూఐడీసీ వెల్ఫేర్ సంస్థ డిజైన్ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు అన్ని డిజైన్లను ఇచ్చిన సంస్థ ఇటీవల మిగిలిన డిజైన్లను పెండింగ్‌లో పెట్టింది. దీంతో భవనాలు శ్లాబ్‌లు ఏ విధంగా నిర్మించాలన్న ప్లానింగ్ లేకపోవడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం నిధులున్నా పనులు ముందుకు వెళ్లలేని పరిస్థితి. ప్రారంభంలో కళాశాల నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం తుఫాన్ భవనంలో నిర్వహించారు. విద్యార్ధులు ఆనేక ఇబ్బందులు పడుతుండడంతో ఈ ఏడాది మండలంలోని సీతారాంపురం ఇంజనీరింగ్ కళాశాలకు మార్చారు. భవనాలను వచ్చే ఏడాది పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం నిధులు కూడా ఉండటంతో డిజైన్ రాగానే పనులను వేగవంతం చేయాలన్న యోచనలో ఆధికారులు ఉన్నారు.