Share News

మామిడీలా..

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:44 AM

ఈ ఏడాది మామిడి ధరలు నిలకడగా ఉండి లాభాలు వస్తాయని రైతులు ఆశించారు.

మామిడీలా..

టన్ను రూ.40 వేల నుంచి రూ.50 వేల మధ్య విక్రయాలు

నేరుగా ఒడిశా, కోల్‌కతాలకు ఎగుమతి

తాడేపల్లిగూడెం మార్కెట్‌కు తగ్గిన డిమాండ్‌

రెండు, మూడు రోజుల్లో పచ్చడి మామిడి రాక

ఈ ఏడాది మామిడి ధరలు నిలకడగా ఉండి లాభాలు వస్తాయని రైతులు ఆశించారు. అనుకున్నట్టే వారం క్రితం వరకు మంచి రేటే పలికింది. కాని క్రమేపీ ధరలు తగ్గుముఖం పడుతుండడంతో రైతులకు చేదును మిగులుస్తుండగా.. సామాన్యులకు మేలు చేస్తోంది. కాయ నాణ్యతను బట్టి టన్ను లక్షకు పైగా పలికిన బంగినపల్లి.. నేడు రూ.40 వేల నుంచి రూ.50 వేలు పలుకుతోంది. రాబోయే రోజుల్లో మరింత తగ్గే అవకాశం వుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

తాడేపల్లిగూడెం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): వాస్తవానికి తొలుత వాతావరణం అనుకూలించక పోవడం, తామర పురుగు పట్టడం, తేనె మంచు కారణంగా ఈ ఏడాది మామిడి పూత పూర్తిగా రాలిపోయింది. పురుగుల నివారణకు లక్షలు వెచ్చించి మందులు చల్లినా ఉపయోగం లేకపోయింది. బంగినపల్లికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆశించిన మేర లాభాలు రాకపోవడంతో గతేడాది ఈ తోటలను తొలగించి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు. ఇన్ని ఆటు పోట్లను తట్టుకుని రాలిపోగా చెట్లకు వున్న కాయలకు తొలుత మంచి డిమాండ్‌ వచ్చింది.

ఒడిశా, కోల్‌కతాలకు ఎగుమతి

మామిడి కాయల్లో రారాజుగా ఉన్న బంగినపల్లి ఇప్పుడు టన్ను మొదటిలో లక్ష వరకు పలికింది. తర్వాత క్రమేపీ తగ్గుతూ ప్రస్తుతం రూ.40 వేల నుంచి రూ.50 వేల మఽధ్య నడుస్తోంది. పేపరులో కట్టిన, నాణ్యమైన కాయకే ఉన్నంతలో మంచి ధర లభిస్తోంది. నాశిరకానికి అసలు గిట్టుబాటు కష్టమే. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు, విస్నన్నపేట, చాట్రాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, వినాయకరావు పేట తదితర ప్రాంతాల్లో తోటలను తాడేపల్లి గూడెం వ్యాపారులు లీజుకు తీసుకుని సాగు చేస్తున్నారు. అక్కడి తోటల్లోను తెగుళ్లు ఆశించాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రెండో కాపు బాగా కాయడంతో మంగు లేకుండా పోయింది. ఒడిశా, కోల్‌కతా మార్కెట్‌లలో ఆశించిన ధర రావడంతో తోతాపురి (కలెక్టర్‌), బంగినపల్లి వంటి రకాలను తాడేపల్లిగూడెం మార్కెట్‌కు తీసుకురాకుండా నేరుగా అక్కడకు తరలిస్తున్నారు.

తగ్గిన మామిడి సాగు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, గోపాల పురం, పోలవరం, ద్వారకాతిరుమల, పెదవేగి, చింతల పూడి, మొగల్తూరు మండ లాల్లో మామిడి తోటలు విస్తారంగా ఉండేవి. జిల్లావ్యాప్తంగా మామిడి కాయలు ఇక్కడ నుంచే ఎగుమతయ్యేవి. చాలా వరకు తోటల ను తొలగించడంతో ఇప్పుడు ఇతర జిల్లాలపై వ్యాపారులు ఆఽధారపడాల్సి వస్తోంది.

గూడెం మార్కెట్లో తగ్గిన డిమాండ్‌

తాడేపల్లిగూడెం మార్కెట్‌లో పండ్లకు డిమాండ్‌ తగ్గింది. ఇక్కడ మార్కెట్‌కు వ్యాపారులు తీసుకురావడానికి విముఖత చూపుతున్నారు. గతంలో రోజుకు 50 లారీల వరకు మార్కెట్‌కు వచ్చేవి. వీటి వినియోగం అదేస్థాయిలో ఉండేది. చిల్లర వర్తకులు కొనుగోలు చేసి అమ్మకాలు చేసేవారు. కాని ఇప్పుడు ఈ మార్కెట్‌లో గిట్టుబాటు కాదని ఇక్కడకు తీసుకుని రావడానికి వ్యాపారులు ఇష్టపడటం లేదు. మరోవారం పది రోజుల్లో మామిడి దిగుబడి పెరుగుతుంది. ఆ సమయంలో ధరలు మరింత తగ్గుతాయని, అప్పుడు మార్కెట్‌కు ఎక్కువగా వస్తాయని వ్యాపారులు చెబుతున్నారు.

తగ్గిన పచ్చడి మామిడి వినియోగం

రెండు మూడు రోజుల్లో పచ్చడి మామిడి కాయలు మార్కెట్‌కు వస్తాయి. పచ్చడికి ఎక్కువగా చిన్న రసాలు, పెద్ద రసాలు, కొత్తపల్లి కొబ్బరి, ఐజర్లు, సువర్ణ రేఖ వంటి రకాలను వినియోగిస్తుంటారు. గతంలో మాదిరిగా పచ్చడి వినియోగం తగ్గింది. గతంలో ప్రతి కుటుంబం లోను తక్కువంటే 50 కాయలతో ఆవకాయ పచ్చడి పట్టేవారు. పెద్ద కుటుంబమైతే 100 నుంచి 200 కాయల వరకు పట్టేవారు. ఇప్పుడు 10 నుంచి 50 కాయల మధ్యనే పడుతున్నారు.

Updated Date - Apr 23 , 2026 | 12:44 AM