ఎత్తిపోతలకు మోక్షం ఎన్నడో?
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:33 AM
జిల్లాలో చిన్న సాగునీటి పథకాలపై చిన్న చూపే ఎదురవుతోంది. వైసీపీ పాలనలో ఐదేళ్లు.. ఇప్పుడు కూటమి కొలువుతీరి రెండేళ్లు కలిపి ఏడేళ్లుగా ఎత్తిపోతలు.. కేవలం ఉత్తిపోతలు పథ కాలుగా మారాయన్న విమర్శలు వ్యక్త మవుతున్నాయి.
రూ.31.61 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు.. ఏడేళ్ల నుంచి కాగితాలకే పరిమితం
సాగునీటి సౌకర్యానికి నోచుకోని రైతాంగం
జిల్లాలో చిన్న సాగునీటి పథకాలపై చిన్న చూపే ఎదురవుతోంది. వైసీపీ పాలనలో ఐదేళ్లు.. ఇప్పుడు కూటమి కొలువుతీరి రెండేళ్లు కలిపి ఏడేళ్లుగా ఎత్తిపోతలు.. కేవలం ఉత్తిపోతలు పథ కాలుగా మారాయన్న విమర్శలు వ్యక్త మవుతున్నాయి. జిల్లాలో 14 చోట్ల ఎత్తిపోతల పథకాలకు గ్రహణం పట్టు కుంది. వీటి అభివృద్ధికి రూ.31.61 కోట్ల ప్రతిపాదనలు చేపట్టినా అవి కాగితాలకే పరిమితం కావడంపై రైతులు గుర్రుగా ఉన్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
దశాబ్దాలుగా మెట్టప్రాంత రైతులకు కాస్తో కూస్తో ఎత్తిపోతల పథకాలు నీటి కొరతను తీర్చేవి. వీటిని ఆలనాపాలనా కరవు కావడంతో అవి వట్టిపోతున్నాయి. జిల్లాలో చిన్ననీటి పారుదల అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఐడీసీ) కార్పొరేషన్ ఇంజనీరింగ్‌శాఖకు ఏడేళ్లుగా ఒక్క పనీ కేటాయింపు జరగలేదు. ఈ శాఖాపరంగా అధికారులు..సిబ్బంది అంతంత మాత్రంగానే ఉన్నారు. ఉన్న ఒక్క ఈఈ దుర్గా గురవయ్య ఉమ్మడి జిల్లాలను పర్యవేక్షిస్తుండగా అవుట్ సోర్సింగ్ జేఈలు అతి కొద్దిమంది మాత్రమే విధులు నిర్వహణ చేస్తున్నారు. వీరికి పర్య వేక్షణ చేయడానికి నిధులు ఆటంకంగా మార డంతో మరమ్మతులు, ఇతర పనులు చేయలేక నీళ్లు నములుతున్నారు. మొత్తం 14 ఎత్తిపోత ల పథకాల కింద 13,912 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటి పరిధిలో రెండు పంటలకు నీరం దించే గ్యారంటీ లేదు. అయినా రైతులు అష్ట కష్టాలు పడి పంటలను సాగు చేసుకుంటు న్నారు. చింతలపూడి నియోజకవర్గంలో ఎర్ర కాల్వ 1,2 ఎత్తిపోతల పథకం కింద 5,900 ఎకరాలు, ఉంగుటూరు నియోజకవర్గంలో పిప్పరలో 419, కేసవరంలో 1,200, పోలవరం నియోజకవర్గం కొవ్వాడ కింద 100, పోలవరం లిఫ్ట్ కింద 750, గూటాలలో 2,400, గాడిదబోర్–1,2 పథకాల కింద 275 ఎకరాలు, దెందులూరులో మాగంటి వరలక్ష్మి రవీంద్ర నాథ్‌చౌదరి స్కీమ్ కింద 1,448, ముత్తన వీడులో 130, కైకలూరు నియోజకవర్గం గొల్ల గూడెంలో 520 ఎకరాలు, నూజివీడు నియో జకవర్గంలో నూజివీడులో 290, సుంకొల్లు– యనమదల కింద 880 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టు ఉంది.
నిధులపై మాటామంతీ లేదాయే?
ఈ ఎత్తిపోతల పథకాలు చాలావరకు వట్టిపోయాయి. మోటార్లు, పంపులు, పంపుహౌస్‌ల అభివృద్ధితో పాటు పైప్‌లైన్ లీకేజీల నివారణ చేపట్టాలి. అవసరమైన చోట్ల కొత్త పైపులైన్లు వేయాలి. చాలాచోట్ల వి ద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు బిగింపు చేయాల్సి ఉంది. దాదాపుగా ఎనిమిది నెలల క్రితం వీటి అభివృద్ధికి చేపట్టిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. దశలవారీగానైనా నిధులు విడుదలవుతాయని అధికారులు ఆశించారు. తీరా ఒక్క పథకానికీ నిధులు మంజూరు కాలేదు. రెండేళ్ల కాలం చూస్తూనే గడిచిపోయింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మోక్షం కల్పిస్తారా? అన్న ఆసక్తి నెలకొంది. ఏపీఐడీసీ ఈఈ దుర్గాగురవయ్యను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. ‘అన్ని పథకాల అభివృద్ధికి ప్రతిపాదించాం. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. జలవనరులశాఖ ఉన్నతా ధికారులు స్పందిస్తారని ఆశిస్తున్నా’మన్నారు.