Share News

అన్నదానం భూములు మింగేశారు..!

ABN , Publish Date - Apr 28 , 2026 | 01:06 AM

ఎంతో మంచి సదుద్దేశంతో దాతలు ఇచ్చిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఏలూరు నగరంలోని అన్నదాన సమాజం ట్రస్టుకు చెందిన భూములు ఇందుకు మినహాయింపేమీ కాదు.

అన్నదానం భూములు మింగేశారు..!

బీసెంట్‌ రోడ్డులోని అన్నదానం సమాజం ట్రస్ట్‌ భూములు అన్యాక్రాంతం

1967కు పూర్వం బాటసారులు, విద్యార్థుల ఆకలి తీర్చేందుకు కేటాయింపు

అప్పటి నగరంలోని వ్యాపారులు, ప్రముఖులు కలిసి ఏర్పాటు

ఈనాం భూములుగా ఉన్నా రెండు దశాబ్దాలుగా ఆగని ఆక్రమణలు

వైసీపీ హయాంలో మరి కొంతమేర భూములు హాంఫట్‌

దేవదాయ కమిషనర్‌ సమగ్ర విచారణ జరపాల్సిన ఆవశ్యకత

ఎంతో మంచి సదుద్దేశంతో దాతలు ఇచ్చిన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఏలూరు నగరంలోని అన్నదాన సమాజం ట్రస్టుకు చెందిన భూములు ఇందుకు మినహాయింపేమీ కాదు. దేవదాయ శాఖ పరిధిలోని అన్నదాన సమాజం సత్రానికి దాతలు సమకూర్చిన మొత్తం 146.68 ఎకరాలు చేతులు మారాయి. ఆ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.100 కోట్ల విలువచేసే భూములు పరాయి వ్యక్తుల చేతుల్లోకి చేరిపోయాయి. ఈ భూములు ఎప్పుడు.. ఎవరు.. అన్యాక్రాంతం చేశారో కూడా ఇప్పటికీ దేవదాయ శాఖ అధికారులకు తెలియకపోవటం విడ్డూరం.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

బీసెంట్‌ రోడ్డు, వన్‌టౌన్‌లో విజయవాడ అన్నదాన సమాజం ట్రస్టు ఉంది. బాటసారులు, విద్యార్థులకు అన్నదానం చేయాలన్న మహా సంకల్పంతో అప్పటి వ్యాపార ప్రముఖులతో పాటు సామాజిక వర్గాలకు చెందిన వారు దీని ఏర్పాటుకు సహకరించారు. నిర్వహణ కోసం అప్పట్లో ట్రస్టుకు భూములు దానం చేశారు. ఇలా దాతలు ఇచ్చిన భూముల్లో కైకలూరు తాలూకా మండవల్లి శివారు పెరికిగూడెంలో ఇచ్చిన 146.68 ఎకరాలు ఉన్నాయి. అన్నదాన కార్యక్రమాలకు అవాంతరాలు లేకుండా ఉండ టానికి ఈ భూములను అప్పట్లో కేటాయించా రు. కైకలూరు నియోజకవర్గ పరిధిలోని పెరికి గూడెంలో 445, 448, 621, 626, 627, 628, 630, 631, 633, 636, 639, 640, 641, 643, 644, 645, 646, 647, 648, 649, 650, 651, 652, 658, 659 సర్వే నెంబర్లలో మొత్తం 146.68 ఎకరాలు ఉన్నాయి. ఈ భూములన్నీ పల్లం, ఈనాం భూములుగా రికార్డుల్లో నమో దయ్యాయి. టైటిల్‌ డీడ్‌ పట్టా నెంబర్‌ 1297ను కలిగి ఉన్నాయి. దేవస్థాన రికార్డుల్లో నమోదు చేసిన ప్రకారం.. ఈ భూములపై వచ్చే ఆదా యం అన్నదానం చేయటం కోసం ధర్మం చేయ బడింది అని పేర్కొన్నారు.

ఆనాటి పాలకవర్గం కృషితో..

ఈ అన్నదాన సమాజం 1967కు పూర్వమే ఆవిర్భవించింది. అందుబాటులో వున్న రికార్డుల మేరకు 1967 జనవరి 15న పదవీ బాధ్యతలు నిర్వహించిన కమిటీ వివరాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. నగరానికి చెందిన హోల్‌సేల్‌ క్లాత్‌ మర్చంట్‌ అయిన తేలప్రోలు వెంకటేశ్వర్లు ఈ ట్రస్ట్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఉపాధ్యక్షులుగా సామారంగం చౌక్‌లో ఖద్దరు వ్యాపారం నిర్వ హించే గార్లపాటి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా హోల్‌సేల్‌ క్లాత్‌ మర్చంట్‌ కాజ అయోధ్య రామ య్య, ఉప కార్యదర్శిగా విజయవాణి ఎడిటర్‌ మల్లెల శ్రీరామమూర్తి, కార్యవర్గ సభ్యులుగా గన్నీ మర్చంట్‌ బయ్యన భీమయ్య, హోల్‌సేల్‌ క్లాత్‌ మర్జంట్స్‌ అయిన తేలప్రోలు బాపనయ్మ, తుమ్మలగంట మల్లికార్జునరావు, పోకూరి వెంక టేశ్వర్లు, మిషనరీ మర్చంట్‌గా వున్న తటవర్తి నరసింహమూర్తి ఉన్నారు. 1970 వరకు ఈ పాలకవర్గం పనిచేసింది. వీరి హయాంలోనే అన్నదానం సమాజానికి సంబంధించిన ట్రస్టుకు గుర్తింపును తీసుకొచ్చారు. ట్రస్టు తరఫున రికార్డుల నిర్వహణ ప్రారంభమైంది. ట్రస్టుకు దానం చేసిన స్థిర, చరాస్తుల రిజిస్టర్లను నిర్వహించారు. నాడు వారు చేసిన కృషి కారణంగా 146.68 ఎకరాలు ఉన్నాయనడానికి ఇప్పటికీ తగిన డాక్యుమెంట్లు ఉన్నాయి.

ఆ భూములు చేతులెలా మారాయి?

ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.100 కోట్ల విలువచేసే భూములు చేతులెలా మారా యన్నది అంతు చిక్కకుండా ఉంది. రెండు దశాబ్దాల కిందటి నుంచి క్రమేణా ఈ భూము లు చేతులు మారుతూ వస్తున్నట్టు సమాచారం. కిందటి వైసీపీ హయాంలోను కొంతమేర భూములు చేతులు మారాయని తెలుస్తోంది. అన్యాక్రాంతమైన భూముల లెక్కలను బయట కు తీయాల్సిన అవసరం ఉంది. దేవదాయ శాఖ కమిషనర్‌ తక్షణం కలగజేసుకుని అన్నదాన సమాజం ట్రస్టుకు సంబంధించిన భూములపై విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Apr 28 , 2026 | 01:06 AM