వంతుల వారీగా..
ABN , Publish Date - Jan 27 , 2026 | 01:19 AM
పశ్చిమ డెల్టాకు వచ్చే నెల మొదటి వారం నుంచి సాగు నీటి సరఫరాలో వంతుల వారీ విధానాన్ని అమలు చేయనున్నారు.
ఫిబ్రవరి మొదటి వారం నుంచే..
రోజుకు 5,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న నీటిపారుదల శాఖ
వంతులపై ఇస్తేనే అధిక దిగుబడి
వ్యవసాయ అధికారుల ప్రతిపాదనకు జలవనరుల శాఖ అంగీకారం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పశ్చిమ డెల్టాకు వచ్చే నెల మొదటి వారం నుంచి సాగు నీటి సరఫరాలో వంతుల వారీ విధానాన్ని అమలు చేయనున్నారు. కొన్నేళ్లుగా జిల్లాలో ఇదే పద్ధతిని అనుసరించి ఫలితాలు సాధిస్తున్నారు. దిగుబడులు పెరిగాయి. వ్యాధు లు తగ్గాయి. పురుగు మందుల వినియోగమూ తగ్గింది. ఈ ఏడాది గోదావరి జలాలు పుష్కలం గా ఉన్నప్పటికి వంతులతోనే నీరు ఇవ్వాలంటూ వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఆ మేరకు జలవనరుల శాఖ ప్రణాళిక చేసింది.
ప్రధాన కాలువలకు వంతులు
పశ్చిమ డెల్టా పరిధిలో కాకరపర్రు, బ్యాంక్ కెనాల్, అత్తిలి కాలువ, జీఅండ్‌వీ కెనాల్, వెంకయ్య–వయ్యేరు, ఉండి, ఏలేరు కాలువల నుంచి వరికి సాగు నీరందిస్తున్నారు. ఉభయ గోదావరి డెల్టాలకు 10 వేల క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. అందులో పశ్చిమ డెల్టాకు 5,500, తూర్పు డెల్టాకు 3,500, మధ్య డెల్టాకు 2,000 క్యూసెక్కులు. పశ్చిమ డెల్టాకు ఇప్పటి లాగే నీటిని సరఫరా చేసినా ఇబ్బంది ఉండదు. సీలేరు నుంచి 60 టీఎంసీల నీరు అందుబాటు లో ఉంది. ప్రస్తుతం అక్కడి నుంచే నీటిని తీసుకువస్తున్నారు. పోలవరం వద్ద మరో 25 టీఎంసీలు నిల్వ ఉందని అంచనా. గోదావరిలో 10 టీఎంసీల నీరు సహజ సిద్ధంగా ఉంటుందని లెక్క కట్టారు. మొత్తంగా రబీ సీజన్‌కు 95 నుంచి 100 టీఎంసీల నీటి లభ్యత ఉంది. గతం లో 70 టీఎంసీలు ఉన్నా వంతుల వారీ విధా నంతో ఉభయ గోదావరి జిల్లాల సాగును గట్టెక్కించారు. ఈ సారి రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అధికారులు ఇటువంటి నిర్ణ యం తీసుకున్నారు. వారం రోజులకు ఒకసారి పశ్చిమ డెల్టాలోని ఒకవైపు కాలువలకు నీటిని సరఫరా చేయనున్నారు. మరో వారం రోజులు ఇంకోవైపు కాలువలకు నీరందించేలా కసరత్తు చేస్తున్నారు.