ఉక్కరిబిక్కిరి
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:53 AM
జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వారం రోజులుగా ఏలూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో జనం ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రోజురోజుకు మండుతున్న ఎండలు
ఏసీ, కూలర్ల వాడకం పెరిగింది
ఇళ్లల్లో రోజంతా తిరుగుతున్న ఫ్యాన్లు
ఏలూరు సిటీ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. వారం రోజులుగా ఏలూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో జనం ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి భగభగలతో చల్లదనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగంతో విద్యుత్ రోజువారీ వినియోగం విపరీతంగా పెరుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫ్రిజ్‌ల వినియోగం కూడా పెరగడంతో అదే స్థాయిలో విద్యుత్ వాడుతున్నారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా కోటా వస్తోందని, ఎండ తీవ్రతకు ట్రాన్స్‌ఫార్మర్లు మొరాయించడంతో తరచూ సరఫరాలో అంతరాయం కలుగుతోందని అధి కారులు చెబుతున్నారు. బోర్ల కింద సాగులో వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కూడా రైతులు ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో విద్యుత్ వినియోగం ఎంత వరకు పెరిగే అవకాశం ఉందనేది అంచనా వేయలేక పోతున్నారు.
ఎండల తీవ్రత
జిల్లాలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగి పోతోంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరడంతో పాటు మున్ముందు వేడిగాలులు, వడగాడ్పుల తీవ్రత పెరిగే అవకా శం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వేడిగాలులు, వడగాడ్పులతో వృద్ధులు, పిల్లలు నానా అవస్థలు పడుతు న్నారు. ఉదయం 8గంటల నుంచే వేడిగాలుల ప్రభావం కనిపిస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు భానుడి ఉగ్రరూపంతో ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. మే నెలలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఇప్పుడు నమోదు కావడం ఎండ తీవ్రతను తెలియ జేస్తుంది. వారం రోజులుగా ఏలూరు, జంగా రెడ్డిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, బుట్టా యగూడెం, పోలవరం తదితర ప్రాంతా ల్లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదు కావ డంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రయా ణంలో నానా అవస్థలు పడుతున్నారు. ఏలూరు నగరంతో పాటు వివిధ పట్టణాల్లో ప్రధాన రహ దారులపై జన సంచారం అంతంత మా త్రంగానే కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర ప్రైవేటు వాహనాలు, ఆటోలు, టాక్సీలలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
జిల్లాలో విద్యుత్ వాడకం ఇలా..
తేదీ విద్యుత్ కోటా వినియోగం
(మిలియన్ యూనిట్లు)
15–4 10.783 9.590
16–4 10.967 9.556
17–4 11.091 9.703
18–4 10.943 9.822
19–4 10.959 9.869