Share News

గ్యాస్‌ మంట!

ABN , Publish Date - Mar 08 , 2026 | 02:21 AM

సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారికి కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వంటగ్యాస్‌ సిలిండర్‌ (ఎల్‌పీజీ) ధర పెంచుతూ తాజాగా నిర్ణయిం తీసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలను పెంచేశారు.

గ్యాస్‌ మంట!

వినియోగదారులపై అదనపు భారం

తాజా పెంపుతో రూ.944లకు చేరిన ధర

ఇరాన్‌– ఇజ్రాయెల్‌ యుద్ధం ఎఫెక్ట్‌

ఏలూరుసిటీ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారికి కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వంటగ్యాస్‌ సిలిండర్‌ (ఎల్‌పీజీ) ధర పెంచుతూ తాజాగా నిర్ణయిం తీసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ ధరలను పెంచేశారు. వంటగ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.60, వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌కు రూ.114 పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇరాన్‌– ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా ఈ ధరలు పెరిగాయని చెబుతున్నారు. అంతర్జాతీ యంగా పెరిగిన ముడి చమురు ధరల ఆధారంగా గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచారని తెలుస్తోంది. తాజాగా రూ.60 ధర పెంచడం వల్ల 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ రూ.944 కు చేరింది. ఇప్పటి వరకు రూ.884 ఉన్న ధరను ఒకేసారి రూ.60 పెంచడంతో వినియోగ దారులు గగ్గోలు పెడుతున్నారు. ఇరాన్‌ యుద్ధం ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండడంతో పెట్రో, డీజిల్‌ ధరలు పెరుగుతాయనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

రాష్ట్రంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకం అమలులో ఉన్నా నాలుగు నెలల కొకసారి మాత్రమే ఒక గ్యాస్‌ సిలిండర్‌ చొప్పున ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్‌లు ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరగలేదు. 2023, మార్చిలో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం 2024 ఏప్రిల్‌లో ధరలను తగ్గించింది. అప్పటి నుంచి ధరలు పెరిగిన దాఖలాలు లేవు.

జిల్లాలో 6.19 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు

జిల్లాలో 6లక్షల 19వేల 907 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో 55 గ్యాస్‌ ఏజన్సీలు ఉన్నాయి. సాధారణ గ్యాస్‌ కనెక్షన్లు 4,19,479, దీపం గ్యాస్‌ కనెక్షన్లు 1,51,508, సీఎస్‌ గ్యాస్‌ కనెక్షన్లు 15,289, ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లు 22,597 , ఉజ్వల 3.0 గ్యాస్‌ కనెక్షన్లు 11,034 వరకు ఉన్నాయి. జిల్లాలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని వినియోగించుకునే గ్యాస్‌ వినియోగదారులు 4,02,000 మంది వరకు ఉన్నారు. మిగిలిన వారిలో ఉజ్వల పథకం మినహాయిస్తే మిగిలిన వారు పూర్తి ధర చెల్లించి గ్యాస్‌ కొనుగోలు చేయాల్సిందే. జిల్లాలో రోజువారీ తొమ్మిది వేలు వరకు గ్యాస్‌ సిలిండర్లు వినియోగిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని, ఇప్పుడు గ్యాస్‌ ధర పెరగడంతో నెలవారీ బడ్జెట్‌ తారుమారవుతుందని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 08 , 2026 | 02:24 AM