రొయ్య లాభం.. మేతకే సరి !
ABN , Publish Date - May 13 , 2026 | 12:29 AM
ఆక్వా రైతులపై ఒక్కసారిగా మేత భారం పడింది. ఒక పక్క రొయ్య ధర తగ్గిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటే మరోవైపు మేత కంపెనీలు ఒక్కసారిగా ధర పెంచేశాయి.
టన్నుకు రూ.8 వేలు పెరుగుదల
మూడు నెలల్లో రెండోసారి పెంపు
అప్సడా అనుమతి లేకుండా ఏకపక్ష నిర్ణయం
రైతుల ఆందోళన బాట
వీరవాసరంలో మేత బస్తాలకు నిప్పు
ఆక్వా రైతులపై ఒక్కసారిగా మేత భారం పడింది. ఒక పక్క రొయ్య ధర తగ్గిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటే మరోవైపు మేత కంపెనీలు ఒక్కసారిగా ధర పెంచేశాయి. అప్సడా అనుమతి లేకుండా ఏకపక్ష నిర్ణయంపై రైతులు మండిపడుతున్నారు. గడిచిన మూడు నెలలుగా రెండుసార్లు మేత ధరలు పెంచుకొంటూ పోతే రైతుల పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేత టన్నుకు ఒక్కసారిగా రూ.8 వేల నుంచి రూ. 10 వేలకు పెంచడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మేతల ధర తగ్గించాలని ఆక్వా రైతులు ఆందోళన బాట పట్టనున్నారు.
నిడమర్రు/ఆకివీడు రూరల్/వీరవాసరం, మే 12 (ఆంధ్రజ్యోతి): విదేశీ మారకద్రవ్యం ఆర్జనలో అగ్రగామిగా నిలిచిన ఆక్వా రంగం నేడు సంక్షోభంలో కూరుకుపోతోంది. ఆక్వా రంగంలో ప్రధాన పెట్టుబడి అయిన రొయ్యల మేత రైతులకు భారమైంది. మేత కంపెనీలు ఒక్కసారిగా ధర పెంచడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కేజీ మేత ధర రూ.8 పెంచేశారు. మేత తయారీకి ప్రధాన ముడిసరుకు సోయా, మొక్కజొన్న ధరలు పెరిగాయని గత ఫిబ్రవరిలో మేత కంపెనీలు టన్నుకు రూ.4 వేల ధర పెంచాయి. రొయ్య రైతుల సంఘం ఆందోళనతో ప్రభుత్వంతో చర్చలు జరిపింది. ఇక నుంచి ధర పెంచాల్సి వస్తే అప్సడా, ఫీడ్ కంపెనీలు, రొయ్యల రైతుల సంఘ చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని తేల్చారు. ప్రస్తుతం ఫీడ్ కంపెనీలు అప్సడా, రొయ్య రైతుల సంక్షేమ సంఘంతో కనీసం సంప్రదించ కుండా ఏకపక్షంగా ధర పెంచడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. వివిధ కంపెనీలకు చెందిన మేత బస్తాలను దగ్ధం చేశారు.
ఉమ్మడి పశ్చిమలో రొయ్యల సాగు
రొయ్య చెరువుల విస్తీర్ణం : 2.60 లక్షల ఎకరాల వరకు
ఏటా ఉత్పత్తి : 4 లక్షల టన్నులు
ఆక్వా టర్నోవర్ : రూ.17వేల కోట్లు
రైతులపై అదనపు భారం : రూ.32 లక్షలు
(టన్నుకు రూ.8 వేల చొప్పున)
రొయ్య ధర తగ్గింది
మేత ధర పెరిగిన ఆందో ళనలో ఉన్న రైతులపై రొయ్య ధర తగ్గింపుతో వ్యాపారులు మరో షాక్ ఇచ్చారు. 100 కౌంట్ రొయ్య ప్రస్తుత మార్కెట్ ధర టన్ను రూ.2.60 లక్షలు. ఇటీవలి వరకు టన్ను ధర రూ. 2.70 లక్షల నుంచి రూ.2.80 లక్షలు ఉండగా నేడు యుద్ధ ప్రభావంతో మార్కెట్ లేదనే సాకుతో ధర తగ్గించేశారు. నష్టాలతో సాగు చేస్తున్న రైతుపై మళ్లీ ధరా భారం పడింది. రొయ్య ధర, పెట్టుబ డి దాదాపు సమానం కావడంతో పెట్టుబడిపై సుమారు రూ.15 వేలు వడ్డీ భారం మోయాల్సి వస్తోంది.
టన్ను రొయ్య (100 కౌంట్) ఉత్పత్తికయ్యే ఖర్చు
రొయ్య సీడ్, రవాణా రూ.40 వేలు
మేత ఖర్చు రూ. 1.30 లక్షలు
చెరువు లీజు (ఎకరం) రూ.30 వేలు
విద్యుత్ ఖర్చు రూ.15 వేలు
కూలీల ఖర్చు రూ.15 వేలు
ఆక్వా మెడిసిన్స్ రూ.15 వేలు
ఇతర ఖర్చులు రూ.10 వేలు
క్రాప్ హాలిడే ఇస్తాం
ఆక్వా రంగం తీవ్ర సంక్షోభవంలో కొట్టుమిట్టాడుతోంది. రొయ్య ధర లేక ఖర్చులు రావట్లేదని గగ్గోలు పెడుతుంటు మేత ధర ఒక్కసారిగా పెంచడం దారుణం. రైతు కష్టం అంతా మేత కంపెనీలకే సరిపోతుంది. రైతుల క్షేమం దృష్టిలో పెట్టుకొని ఫీడ్ కంపెనీలు మేత ధరలు తగ్గించాలి. ఫీడ్ కంపెనీల తీరుమారకపోతే క్రాప్ హలిడే ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
– అడబాల పాండురంగారావు, ఆక్వా రైతు, గణపవరం
పెట్టుబడి కూడా రావడం లేదు
రొయ్య మేత ధర పెంపుతో రైతుకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. 100 కౌంట్ రొయ్యలు అమ్మితే రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. ఇంకా రైతులు పంట పండించేదెలా. రైతులు కొంత కోలుకున్నారనుకొంటే మూడు నెలల్లో రెండు సార్లు మేత ధర పెంచడం దారుణం. ఫీడ్ కంపెనీల ధోరణిపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి.
– మహమ్మద్ గఫార్‌ఖాన్, ఆక్వా రైతు, క్రొవ్విడి
రొయ్యల మేత బస్తాల దహనం
వీరవాసరంలో ఆక్వా రైతుల ఆందోళన
వీరవాసరం, మే 12 (ఆంధ్రజ్యోతి): రొయ్యల మేత ధర ఒక్కసారిగా పెంచడంతో ఆక్వా రైతులు భగ్గుమన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా లెక్క చేయకుండా రొయ్యల కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచడాన్ని నిరసిస్తూ వీరవాసరంలో మంగళవారం రైతులు ఆందోళన నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్‌లో రొయ్యల మేతల బస్తాలను దహనం చేశారు. రైతులు మాట్లాడుతూ మేత కంపెనీలు సిండికేట్‌గా మారడం వల్ల మేత ధరలను పెంచివేస్తున్నారని, కేజీకి రూ.8 అంటే టన్నుకు 8 వేలు ధర పెంచేశారన్నారు. సాగు నష్టాలతో ఆక్వా రంగం సంక్షోభంలోకి కూరుకుపోతుందని, రైతులు ఆర్థికంగా నష్టపోతుంటే మేత ధర పెంచడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కార్యక్రమంలో మళ్ళ రాంబాబు, యరకరాజు హరిహరరాజు, యరకరాజు గోపాలకృష్ణంరాజు, తోట విజయకుమార్, కోటిపల్లి బాబు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ధర పెంచితే కొనుగోలు చేయం
ఆక్వా రైతు సంఘం తీర్మానం
పాలకొల్లు అర్బన్, మే 12(ఆంధ్రజ్యోతి): మేత ధర పెంచితే సహించేది లేదని, ఇష్టారీతిన ధరలు పెంచిన కంపెనీల మేత కొనుగోలు బహిష్కరిస్తామని మంగళ వారం పాలకొల్లులో నిర్వహించిన అత్యవసర సమా వేశంలో తీర్మానం చేసినట్టు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలిపారు.రొయ్యల మేత ధరలు పెంచుకుంటామని అప్సడా, ప్రభుత్వానికి దరఖాస్తు చేసిందని, అనుమతి రాకుండానే దొడ్డిదారిన కిలో మేతకు రూ.8 నుంచి రూ.10 పెంచడం దారుణమన్నారు.ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 30వరకూ క్రాప్ హాలిడే తీసుకు నేందుకు వెను కాడబోమని ఆయన తెలిపారు. ఈనెల 13న పాలకొల్లులో జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆక్వా రైతులు పాల్గొనాలని పిలు పునిచ్చారు. సమావేశంలో బోణం వెంకట నరసయ్య, చినబాబు, చిలుకూరిబాలాజీ, బొణం వెంకట రంగయ్య నాయుడు, మేడిది జాన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.