ట్రిపుల్ ఐటీ.. పోటాపోటీ
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:50 AM
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఈ ఏడాది మరింత డిమాండ్ పెరిగింది. ఒక్కొక్క సీటుకు పది మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు.
ఒక సీటుకు పది మంది అభ్యర్థులు
ప్రత్యేక కేటగిరీలలో కూడా పోటీ
దివ్యాంగుల కోటాలో స్వల్పం
5 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
12న మెరిట్ లిస్ట్ విడుదల
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు ఈ ఏడాది మరింత డిమాండ్ పెరిగింది. ఒక్కొక్క సీటుకు పది మంది విద్యార్థులు పోటీ పడుతున్నారు. గ్రామీణ విద్యార్థులకు ఉత్తమ సాంకేతిక విద్యనందించే ట్రిపుల్ ఐటీపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.
(నూజివీడు టౌన్ – ఆంధ్రజ్యోతి)
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు మొత్తం 44,104 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. గ్రామీణ ప్రాం త విద్యార్ధులకు అంతర్జాతీయస్థాయి సాంకేతిక విద్యనందిం చాలని లక్ష్యంతో రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీని 2008లో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు, ఆర్కేవాలి, బాసరలో ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేయగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌లోని నూజివీడు ఆర్కే వ్యాలీలకు అదనంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. ట్రిపుల్ ఐటీలలో ఆరు సంవత్సరాల ఇంటి గ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులలో మొదటి రెండు సంవత్సరాలను ఇంటర్మీడియట్ స్థాయి పీయూసీ కోర్సు ఉంటుంది. అనంతరం నాలుగు సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్సు ఉంటుంది. మొత్తం నాలుగు క్యాంపస్ లలో 4000 సాధారణ సీట్లు మరో 400 సూపర్ న్యూమరీ సీట్లు మొత్తం 4400 సీట్లలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 30న దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 44,104 మంది ఆన్‌లైన్‌లో అర్జీలు దాఖలు చేశారు.
ఒక్కో సీటుకు పది మంది..
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ పరిధి లో మొత్తం నాలుగు క్యాంపస్‌ల మీద 4400 సీట్లు ఉండగా అర్జీలు దాఖలు చేసిన విద్యార్ధులు 44104 ఉండడంతో దాదాపు ప్రతి సీటుకు పది మంది విద్యార్ధుల పోటీ ఉంది. సాధారణ కేటగిరిలో అర్జీ ధాఖలు చేసిన వారిలో మెరిట్ వారిని మొత్తం ఆన్‌లైన్ సిస్టం ద్వారా ఎంపిక జరగనుంది. మెరిట్ లిస్టును ఈనెల 12న విడుదల చేయనున్నారు.
ప్రత్యేక కేటగిరీలలో భారీ పోటీ
ప్రత్యేక కేటగిరి కింద 2453 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా ఎన్‌సీసీ కేటగిరి కింద మొత్తం నాలుగు క్యాంపస్ ల లో 40 సీట్లకు 1289 మంది, స్పోర్ట్స్ కేటగిరిలో 20 సీట్లకు 450 మంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరిలో 20 సీట్లకు 282 మంది, సిఏడి కేటగిరి కింద 80 సీట్లుకు 235 మంది పోటీ పడుతుండగా ఫిజికల్లీ చాలెంజ్ విభాగంలో 200 సీట్లకు 195 మంది విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేశారు.
ఐదు నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలో ప్రత్యేక కేటగిరీల్లో ప్రవేశాలకు నూజివీడు క్యాంపస్ లో ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 5 నుంచి 8 వరకు నిర్వ హించనున్నారు. విద్యార్థులకు ఈమెయిల్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం అందించినట్లు, జాబితాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ట్రిపుల్ ఐటీ అధికారులు తెలిపారు. ప్రత్యేక కేటగిరి మినహా మిగిలిన అభ్యర్థుల మెరిట్‌లిస్ట్ ఈనెల 12న విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు.