Share News

బావలూ.. సయ్యా..!

ABN , Publish Date - Apr 25 , 2026 | 01:01 AM

జాతర.. పెళ్లి.. షష్టి పూర్తి కార్యక్రమం ఏదైనా లక్షలు ఖర్చు పెట్టి భోజనాలు పెట్ట డమే కాదు.. రికార్డింగ్‌ డ్యాన్సులు ఏర్పాటు చేయాల్సిందే..! చుక్క ఏసి.. డ్యాన్సులు చేయాలి. ఇదీ జిల్లాలో ప్రస్తుతం పెరు గుతున్న ట్రెండ్‌కు నిదర్శనం.

బావలూ.. సయ్యా..!

సరదాల కోసం డబ్బుకు వెనుకాడని యువత

పోలీసుల కళ్లుగప్పి అసాంఘిక కార్యకలాపాలు

భీమవరం క్రైం, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి):జాతర.. పెళ్లి.. షష్టి పూర్తి కార్యక్రమం ఏదైనా లక్షలు ఖర్చు పెట్టి భోజనాలు పెట్ట డమే కాదు.. రికార్డింగ్‌ డ్యాన్సులు ఏర్పాటు చేయాల్సిందే..! చుక్క ఏసి.. డ్యాన్సులు చేయాలి. ఇదీ జిల్లాలో ప్రస్తుతం పెరు గుతున్న ట్రెండ్‌కు నిదర్శనం. ఎంత వరకు వెళ్లిందంటే ఇటీవల ఎవరో ముసలావిడ చనిపోతే పెద్ద కర్మకు రికార్డింగ్‌ డ్యాన్సులు పెట్టేంత వరకు.. ఇది ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో జాతరలు, తీర్థాల సమయాల్లో మ్యూజికల్‌ నైట్‌లు, డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌ పెట్టేవారు. ఇటీవల పోటీ పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను, హిజ్రాలను తీసుకువచ్చి వారితో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. దీనిని చూసి మరో ఊరి వారు మనం పెట్టాలంటూ ఏర్పాటు చేస్తున్నారు. హిజ్రా లతో అయితే 50 వేల నుంచి 60 వేలు, యువతులు అయితే లక్ష వరకు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఖర్చు గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఊరిలో చందాలు వేసుకుని మరీ పెడుతున్నారు.

సంక్రాంతికి రెచ్చిపోయిన యువత

ఈ ఏడాది సంక్రాంతికి ఎప్పటిలానే కోడి పందేలు, జూదాలు యధావిధిగానే జరిగాయి. పందేలు, జూదాల ముసుగులో అశ్లీల నృత్యాలు హద్దు మీరాయి. ఏ గ్రామంలోనైనా సరే రాత్రి పూట ఇతర ప్రాంతాల నుంచి యువతులను, హిజ్రాలను తీసుకువచ్చి అశ్లీల నృత్యాలు చేయించారు. ఆ ముసుగులో వ్యభిచారం జరిగిందన్న ప్రచారం జరిగింది. అప్పటి నుంచి చాలా చోట్ల ఏ వేడుక నిర్వహించినా ముందుగా అశ్లీల నృత్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు చిన్నా పెద్దా తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌పుణ్యమా కొంత మంది యువత పెడదారులు తొక్కుతుండగా.. ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. గ్రామ పెద్దల అనుమతితో రంగంలోకి దిగుతారు. కొన్నిచోట్ల పోలీసులు అటు వైపు రాకుండా ఉండేందుకు కొంత నగదును ముట్టచెబుతారు.

వీఆర్‌తో పోలీసుల అలర్ట్‌

కొన్నాళ్ళ క్రితం పాలకోడేరు మండలం పెన్నాడ శివారులో ఒక నాయకుడు షష్ఠి పూర్తిని ఘనంగా నిర్వహించారు. దీని కోసం కొందరు హిజ్రాలతో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం అంతా వారు పూర్తి చేసుకున్నారు. కాని సోషల్‌ మీడియా ద్వారా ఆ భాగోతం బయటకు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. నిర్వాహకులపై కేసులతోపాటు కొంత మంది పోలీసులను వీఆర్‌కు పంపారు. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనంగా మారింది. ఇటీవల వీరవాసరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని తోలేరులో హిజ్రాలను తీసుకువచ్చి అశ్లీల నృత్యాలకు ప్లాన్‌ వేస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వారు ముందే అక్కడకు చేరుకుని ముగ్గురు హిజ్రాలను, ఎనిమిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. నరసాపురం ప్రాంతంలో కొందరు ఒక జాతర సందర్భం గా ఆర్కెస్ట్రా పేరుతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్పట్లో దాడులు చేశారు. కొంత మందిపై కేసులు నమోదు చేశారు.

Updated Date - Apr 25 , 2026 | 01:01 AM