రయ్..రయ్!
ABN , Publish Date - May 05 , 2026 | 01:04 AM
రవాణాను సులభతరం చేయడానికి జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ హైవేలు జోరందుకుంటున్నాయి. వేగవంత మైన ప్రయాణాలు, వివిధ వాణిజ్య ఉత్ప త్తులు, ముడిసరుకులను శరవేగంగా గమ్య స్థానాలకు రవాణా చేయడానికి మార్గం సుగమం కానుంది.
అందుబాటులోకి ఖమ్మం–దేవరపల్లి ఎక్స్‌ప్రెస్ హైవే
ఏలూరు జిల్లాలో మూడు ఎంట్రీ పాయింట్లు
హైదరాబాద్–విశాఖ మధ్య తగ్గిన 56 కి.మీ దూరం
బొగ్గు, సిమెంట్,ఇతర ఉత్పత్తుల రవాణాకు మరింత మేలు
రవాణాను సులభతరం చేయడానికి జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ హైవేలు జోరందుకుంటున్నాయి. వేగవంత మైన ప్రయాణాలు, వివిధ వాణిజ్య ఉత్ప త్తులు, ముడిసరుకులను శరవేగంగా గమ్య స్థానాలకు రవాణా చేయడానికి మార్గం సుగమం కానుంది. తాజాగా ఖమ్మం– దేవర పల్లి ఎక్స్‌ప్రెస్‌వే ఏలూరు జిల్లాకు తొలి మణిహారం చెప్పవచ్చు. ఎన్‌హెచ్ 365 బీజీ గ్రీన్‌ఫీల్డ్ హైవేపై గతనెల 20 నుంచి భారీ వాహనాలకు అనుమతించారు. ఈ కొత్త రహదారి వల్ల ఆంధ్రప్రదేశ్– తెలంగాణ మధ్య రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
ఖమ్మం– దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేను 2018లో రూ.ఆరువేల కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ఎట్ట కేలకు ఎనిమిదేళ్ల తర్వాత అతిపెద్ద రవాణా మార్గం అందు బాటులోకి వచ్చింది. ఈ హైవేతో హైదరాబాద్–విశాఖ మధ్య 56 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి సూర్యాపేట,విజయవాడ, ఏలూరు, దేవరపల్లి మీదుగా వైజాగ్‌కు 365 బీబీ ఎక్స్‌ప్రెస్ హైవే ఉంది. తాజాగా హైదరా బాద్ నుంచి సూర్యాపేట, ఖమ్మం నుంచి వైరా మీదుగా చింతలపూడి నుంచి దేవరపల్లి వరకు 365 బీజీ గ్రీన్‌ఫీల్డ్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఈ హైవే 365 బీబీ హైవేలో అనుసంధానం అవుతుంది. ఖమ్మం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల అనుసంధానికి ఇది ఉపయోగ పడనుంది. వాహనాల్లో సరుకులు, బొగ్గు, కలప, గ్రానైట్, ఇతర ఉత్పత్తుల రవాణాకు మార్గం అనుకూలంగా మారనుంది. ఏజెన్సీలోని జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు, జంగారెడ్డిగూడెం మండలాల నుంచి వివిధ ఉత్పత్తులను తరలించడానికి ఈ హైవే మరింత వెసులు బాటు కల్పించనుంది.
మొత్తం నిడివి 162 కిమీ..
గ్రీన్‌ఫీల్డ్ హైవే నిడివి 162 కిలోమీటర్లు కాగా జిల్లాలో 72.29 కిలోమీటర్ల మేర ఈ రహదారి మీదుగా ప్రయాణాలు సాగుతాయి. జిల్లా పరిధిలో రూ.300 కోట్లు వెచ్చించి 24 గ్రామాల నుంచి 466.76 హెక్టార్ల భూమిని విస్తరణకు వాడారు. ఈ హైవే తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్, పోలవరం ప్రాజెక్టులను క్రాస్ చేస్తూ సాగుతోంది.
రెండుచోట్ల విశ్రాంతికి ఏర్పాట్లు
జిల్లాలో రాఘవాపురం, పొంగుటూరు (ఏడువాళ్లపాలెం) వద్ద హైవేపై వాహనాల నిలుపుదలకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పుడ్ ఫ్జాజాలు, ఫస్ట్ ఎయిడ్, విశ్రాంతి గదులు, ఇతర ఏర్పాట్లు చేశారు. కొన్ని రోజులుగా ఈ రహదారిపై వాహనాల రాకపోకలు సాగుతున్నప్పట్పికీ.. తాజాగా పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా ఫాస్ట్‌ట్యాగ్ రూపంలో టోల్ రుసుం వసూలు చేస్తున్నారు. ఈ హైవేపై ఎక్కడ ప్రవేశించి.. ఎక్కడ నిష్క్రమించిన ఒకటే టోల్‌ఫీజును నిర్ధారించారు. కాగా ఖమ్మం పరిధిలో ఈ హైవే నిర్మాణ పనులు ఇంకా కొన్నిచోట్ల తుది దశలో ఉన్నాయి.
ప్రమాదాల నివారణకు తనిఖీలు
గ్రీన్‌ఫీల్డ్ ప్రారంభోత్సవానికి ముందు జరిగిన కొన్ని ప్రమాద సంఘటనలపై యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా పరిధిలో ఈ హైవేపై అయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్‌ఐలు పెట్రోలింగ్ నిర్వహించడంతో పాటు, స్థానిక తహసీల్దార్లు, ఆర్డీవోలు, డీఎస్పీలు నిఘా ఉంచుతారు. జేసీ అభిషేక్ గౌడ ఈ మేరకు పర్యవేక్షించనున్నారు.
ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు వెళ్లే ఈ హైవేపై 14 చోట్ల ఎంట్రీ (ప్రవేశం), ఎగ్జిట్ (నిష్క్రమణ)ల ప్రదేశాల ఏర్పాటు ఉంది. ఏలూరు జిల్లాలో చింతలపూడి మండలం రేచర్ల వద్ద, జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద, కొయ్యలగూడెం మండలం పొంగు టూరు వద్ద ఎక్స్‌ప్రెస్ వేకు మార్గాలున్నాయి. సీసీ కెమెరాలు, సోలార్ ప్యానెళ్లు, సమాచారాన్ని అందించే క్యూఆర్ కోడ్‌లు, ఎమర్జెన్సీ ఓపెనింగ్స్, అత్యాధునిక రవాణా నిర్వహణ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ హైవేపై 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా కనీస లిమిట్‌ను నిర్ధారించారు. ఈ ఎక్స్‌ప్రెస్ హైవేపైౖ ట్రాక్టర్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు.