జూదార్పణం
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:26 AM
సంక్రాంతి సందడి ముగిసింది. వచ్చిన అతిథులు, పందెంరాయుళ్లు తిరుగుముఖం పట్టారు. రోడ్లన్నీ ట్రాఫిక్‌తో కిటకిటలాడు తున్నాయి. మరోవైపు మూడు రోజులుగా అరు పులు, కేకలు, కేరింతలు, డ్యాన్స్‌లు, మ్యూజికల్, డబ్బు మిషన్ల లెక్కింపుల సౌండ్, వాహనాలతో కిటకిటలాడిన పార్కింగ్ ప్రదేశాలు శనివారం వెలవెలబోయాయి.
జేబులు ఖాళీ చేసుకున్న జనం
పెద్ద బరులకు లాభాల పంట.. నష్టపోయిన చిన్న నిర్వాహకులు
ఉదయం నుంచి లెక్కలు వేసుకుని లబోదిబోమని గగ్గోలు
ఒక్కొక్కరిది.. ఒక్కో వ్యఽధ..
చేతులు కాల్చుకుని బోరుమన్నారు
నరసాపురం, జనవరి 17(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి సందడి ముగిసింది. వచ్చిన అతిథులు, పందెంరాయుళ్లు తిరుగుముఖం పట్టారు. రోడ్లన్నీ ట్రాఫిక్‌తో కిటకిటలాడు తున్నాయి. మరోవైపు మూడు రోజులుగా అరు పులు, కేకలు, కేరింతలు, డ్యాన్స్‌లు, మ్యూజికల్, డబ్బు మిషన్ల లెక్కింపుల సౌండ్, వాహనాలతో కిటకిటలాడిన పార్కింగ్ ప్రదేశాలు శనివారం వెలవెలబోయాయి. పూర్తి నిశ్శబ్దం నెలకొంది. నాలుగో రోజు కూడా పందేలకు అనుమతి ఇస్తారని ఎదురుచూసిన నిర్వాహకులకు నిరాశే మిగిలింది. దీంతో వేసిన పందిళ్లను తొలగి స్తున్నారు. పట్టణం, గ్రామం అన్న తేడా లేకుం డా ఈ సారి ప్రతి ఊరిలోను బరులువేశారు. గతంతో పోలిస్తే బరుల సంఖ్య పెరిగాయి. పందెం రాయుళ్ల సంఖ్య రెట్టింపు అయ్యింది. స్వగ్రామాలకు వచ్చిన అతిథులు, బంధువులు సంఖ్య గతంతో పోలిస్తే.. చాలా ఎక్కువ. ఈ కారణంగా ప్రతి గ్రామం, రోడ్లు, కూడళ్లల్లో పట్టణాల్లో సంక్రాంతి సందడి కనిపించింది. ఇది పందెం నిర్వాహకులకు జోష్‌నిచ్చింది.
అయితే పెద్ద బరుల నిర్వాహకులు కోట్లాది రూపాయల లాభాలను చవిచూస్తే.. చిన్న చిన్న బరులు మాత్రం నష్టాలను మూటగట్టుకు న్నాయి. శనివారం ఉదయం నుంచి నిర్వాహకులు లాభనష్టాల లెక్కల్లో బిజీబిజీగా ఉన్నారు. ఖర్చులు తీసేసి ఎంత మిగిలింది, ఎవరెవరికి ఎంత వాటా పంపాలన్న దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు.
పాలకొల్లు నియోజకవర్గంలోని ఒక బరిని గుండాట నిర్వాహకుడు పెద్ద మొత్తానికి పాడుకున్నారు. పాడుకున్న దానికంటే రెట్టింపు మిగిలిందని ప్రచారం జరుగుతోంది. భీమవరం, ఉండి, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లోని కొన్నిచోట్ల లాభాలు వచ్చి పడితే.. చిన్న బరులు ఎక్కువగా నష్టాలను మూటగట్టుకున్నాయి.
బడాయికి బరి కడితే..
తణుకు రూరల్ : సంక్రాంతికి బడాయికి పోయి కోడి పందేల బరులు వేసి.. ఉన్నదంతా ఊడ్చేసిందని చోటా నాయకులు గగ్గోలు పెట్టా రు. కనీసం నిర్వహణ ఖర్చులు రాకపోవడంతో వారి బాధ వర్ణణాతీతం. తణుకు రూరల్‌లోని ఓ గ్రామానికి చెందిన కూటమి నాయకుడు ఏర్పాటు చేసిన బరిలో గుండాట, పేకాట, కోతాటలకు జనం పెద్దగా రాలేదు. వీటిని ఏక మొత్తంలో తీసుకున్న వ్యక్తికి నష్టపోయాడు. ఈ బరిలో గుండాటకు సంబంధించి మొత్తం ఆరు బోర్డులు ఏర్పాటు చేశారు. ఒక్కో బోర్డుకు రూ.3 లక్షలు చెల్లించేలా సంక్రాంతి ముందురోజు ఒప్పందాలు జరిగాయి. గుండాట బోర్డుల నిర్వహణకు రోజుకు రూ.2 లక్షలు జీతాలకే సరిపోయింది. ఈ బరిలో బోర్డుల కోసం చె ల్లించిన అసలు కూడా నిర్వాహకులకు రాలేదు.
బరి ఏర్పాటు చేస్తానని..
తణుకు జాతీయ రహదారి పక్కన బరి ఏర్పాటు చేస్తానని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ భర్త పెట్టుబడి నిమిత్తం ఆశావహుల నుంచి రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకూ వసూలు చేశారు. సంక్రాంతి ముందు రోజు సాయంత్రం ఒక టెంట్ వేసి కూటమి నాయ కుల ఫొటోలతో ప్లెక్సీ పెట్టారు. ఎలాంటి కోడి పందేలు జరగకపోవడంతో సొమ్ములు ఇచ్చిన యువకులు లబోదిబోమన్నారు.
టెంట్ ఖర్చులూ రాలేదు
ఆకివీడు రూరల్ : ఆకివీడులో రెండుచోట్ల, మండలంలో ఆరు గ్రామాల్లోను కోడి పందేల చిన్న బరులు వేశారు. ఇక్కడకు పందెం రాయు ళ్లు పెద్దగా రాకపోవడంతో రోజుకు 15 పందేలు కూడా జరగలేదు. ఒక్కో బరికి రెండు నుంచి మూడు లక్షల వరకు ఖర్చు చేశారు. కాని, టెంట్ ఖర్చులు వచ్చినా గొప్పే అన్నట్టు వుందని వాపోయారు. కుప్పనపూడిలో గొడవలు జరగకుండా చూసేందుకు గ్రామంలో పందేలు వద్దని పంచాయతీలో తీర్మానం చేశారు. దీంతో గ్రామానికి చెందిన రెండు వర్గాలు ఊరికి సమీపంలోని అజ్జమూరు సరిహద్దులో పోటా పోటీగా బరులు ఏర్పాటు చేశారు. ఒక బరి వారు కేబుల్ లేదు. ఉచితంగా పందేలు నిర్వహించకోవచ్చునని ప్రకటించడంతో రెండో బరి బోసిపోయింది.
90 శాతం జేబులు ఖాళీ
ఆచంట : ఆకివీడు నియోజకవర్గంలో ఏర్పా టు చేసిన 20 పందేల బరుల్లో పందేలకు వెళ్లి 90 శాతం మంది నష్టపోయారు. కేవలం పది శాతం మందికే కొద్దిపాటి సొమ్ములు వచ్చాయి. ఇక్కడ పది కోట్లు చేతులు మారాయి. కంచుస్థంభం పాలెంకు చెందిన ఓ వ్యక్తి గుండాటలో ఎనిమిది లక్షలు, నీరుళ్లిపాలెంకు చెందిన మరో వ్యక్తి ఏడు లక్షలు గెలుచుకున్నారు. గుంపర్రు, వల్లూరుకు చెందిన ఇద్దరు చెరో మూడు లక్షలు పొగొట్టుకున్నారు.
చిన్నగొడవ.. రూ.14 లక్షల నష్టం
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం సమీప గ్రా మంలో ఓ వ్యక్తి కోడి పందేల నిర్వహణకు భారీ టెంట్లు వేసి పందెంరాయుళ్లను ఆకర్షించాడు. ఎక్కువగా పందేలు కొట్టిన వారికి రోజుకు ఒక బుల్లెట్ అని ప్రకటించి మూడు బుల్లెట్లను తెప్పించారు. ముసుగుపందేంలో గెలుపొందిన పందెం రాయుడికి కాసు బంగారం ప్రకటించాడు. మొదటిరోజు బాగానే జరిగింది. ఎక్కువ పందేలు గెలుపొందిన వ్యక్తికి బుల్లెట్, ముసుగు పందెం విజేతకు కాసు బంగారం బహుకరించారు. రెండో రోజు ఓ పందెం జరిగింది. రెండు కోళ్లు హోరాహోరీగా పోరాడి కింద పడిపోయాయి. ఇందులో ఓ కోడిని విజేతగా ప్రకటించారు. దీనితో రెండో కోడికి చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేయడంతో చిన్న గొడవ కాస్తా ముదరడంతో పందేలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో తనకు రూ.14 లక్షల వరకు నష్టం వాటిల్లిందని నిర్వాహకుడు వాపోయాడు.