ఇసుక మేత !
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:32 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం అభాసుపాలవుతోంది. దళారుల దందాతో సామాన్యులకు ఇసుక అందడం లేదు. ప్రస్తుతం ఆరు యూనిట్ల లారీ ఇసుక రూ.12 వేలకు విక్రయిస్తున్నారు.
ఉచిత విధానం అభాసుపాలు
స్టాక్ పాయింట్ల వద్ద దోపిడీ
ఆరు యూనిట్ల లారీ రూ.12 వేలు
గతంలో గరిష్ఠంగా రూ.10 వేలు
ర్యాంపులు మూత..
పక్క జిల్లా నుంచి సరఫరా
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం అభాసుపాలవుతోంది. దళారుల దందాతో సామాన్యులకు ఇసుక అందడం లేదు. ప్రస్తుతం ఆరు యూనిట్ల లారీ ఇసుక రూ.12 వేలకు విక్రయిస్తున్నారు. గతంలో ఇదే ఇసుక రూ. 9 వేలకు లభ్యమయ్యేది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఉచిత విధానం ఫలితం ఇస్తోందంటూ నిర్మాణదారులు సంబరపడిపోయారు. గడిచిన కొన్ని నెలల నుంచి పరిస్థితి తారుమారైంది. ఇసుకకు డిమాండ్ పెరిగింది. జిల్లాలో కొద్దో గొప్పో నిర్మాణాలు జోరందుకున్నాయి. ప్రభుత్వ పరంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఫలితంగా ఇసుక వినియోగం పెరిగింది. ర్యాంప్‌ల్లో ఇసుక అందుబాటులో ఉంది. అయినా ధరలు పెంచేశారు. ఆరు యూనిట్ల లారీ రూ. 9 వేల నుంచి రూ. 10 వేల వరకు అమ్మకాలు సాగించే వారు. టిప్పర్ యజమానులు తమకు అద్దె లభిస్తే చాలని భావించేవారు. కారణాలేవైనా ధరలు పెరిగి పోవడంతో నిర్మాణదారులపై భారం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇసుక సరఫరా అవుతోంది.
స్టాక్ పాయింట్‌ల వద ్ద అధిక ధరలు
జిల్లాలో స్టాక్ పాయింట్‌లు ఏర్పాటు చేశారు. గడచిన వేసవిలో పెద్దమొత్తంలో నిల్వ చేసుకున్నారు, స్టాక్ పాయింట్ల వద్ద అమ్మకాలు అంతగా లేవు. గోదావరి నుంచి ఇసుక సరఫరా అవుతూ వచ్చింది. అనధికారికంగా లారీ యజమానులు, నిర్మాణదారులు ముందుగానే నిల్వ చేసుకున్నారు. నిల్వ చేసుకున్న ఇసుకను లారీ యజమానులు విక్రయించుకునేవారు. దీనివల్ల వానాకాలంలోనూ పెద్దగా ధరలు పెరగలేదు. దాంతో స్టాక్ పాయింట్ల వద్ద నిల్వ చేసుకున్న కాంట్రాక్టర్‌లకు నష్టం వాటిల్లింది. బిల్లులు లేకుండా విక్రయాలు సాగించే వాహనాలను సీజ్ చేయాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది. కానీ నిర్మాణదారులు మాత్రం తక్కువకు లభ్యమయ్యే ఇసుకను మాత్రమే కొనుగోలు చేసేవారు. స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక అమ్ముడు పోయేదికాది. ఇటీవల ధరలు పెరగడంతో స్టాక్ పాయింట్‌లలోనూ అమ్మకాలు పెరిగాయి. గోదావరి నుంచి ఆశించిన స్థాయిలో ఇసుక రావడం లేదంటూ దళారులు చెపుతున్నారు. భవిష్యత్తులో మరింత ధర పెరిగే అవకాశం ఉందని సొంతిల్లు నిర్మించుకునేవారు కూడా ముందస్తుగానే గోదావరి ఇసుకను నిల్వ చేసు కుంటున్నారు. మరోవైపు ఇసుకకు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. లారీ యజమానులు సైతం ఇసుక తర లింపు కోసం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరో వైపు స్టాక్ పాయింట్‌ల వద్దే రూ. 6500లకు అమ్మకాలు సాగిస్తున్నారు. పెండ్యాల నుంచి ఎక్కువగా దిగుమతి అవుతోంది. దానికి అదనంగా లారీ కిరాయిలు వేసు కుంటున్నారు. మధ్యలో దళారులు కొంత బొక్కేస్తున్నారు.
ర్యాంప్‌లు మూత
ప్రస్తుతం వర్షాలు తక్కువగా ఉన్నాయి. ర్యాంపుల్లోకి లారీలు వెళ్లే వెసులుబాటు ఉంది. వానాకాలం ప్రారంభ మైందన్న ఉద్దేశంతో ర్యాంప్‌ల్లో తవ్వకాలు నిలిపివేశారు. గోదావరిలో తవ్వకాలు సాగించి పడవల ద్వారా తరలి స్తున్నారు. స్టాక్ పాయింట్లలో నిల్వ ఉన్న ఇసుకను విక్రయిస్తున్నారు. పడవల్లో ఇసుకకు గతంలో రూ. 4500 తీసుకునేవారు. ర్యాంప్‌ల్లో రూ. 5 వేలు ఉండేది. ఇప్పుడు స్టాక్ పాయింట్‌లతో పాటు, పడవల్లో వచ్చే ఇసుకను రూ. 6,500 లకు సరఫరా చేస్తున్నారు. దానిపై అద నంగా రవాణా ఖర్చులు కలుపుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. మొత్తంపైన ధర పెరిగింది. లారీ ఇసుక రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. గతంలో రూ. 9 వేలకు సరఫరా చేయడానికి రవాణా యజమానులు పోటీ పడేవారు. ఆ లెక్కన చూస్తే రూ. 3 వేలు పెరిగి నట్టే . ఉచిత ఇసుక విధానంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. ర్యాంప్‌లున్న నియోజకవర్గాల పరిధిలో దోపిడీ జరుగుతోంది. వినియోగదారులు అధిక ధరలకు ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోంది.