ఎరువు బరువు దిగింది!
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:47 AM
ఖరీఫ్ సీజన్ నేపథ్యం లో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు రైతాంగానికి ప్రభుత్వం నుంచి తీపి కబురందింది.
కుక్కునూరు, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ నేపథ్యం లో పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు రైతాంగానికి ప్రభుత్వం నుంచి తీపి కబురందింది. పోలవరం పరిహారం అందించిన భూములకు, పోడుసాగు చేస్తున్న భూములకు సైతం ఎరువుల సరఫరా జరగనుంది. దీంతో వేలాది మంది రైతులకు ఎరువుల ఇబ్బంది తొలగినట్టే. ప్రభుత్వం నిర్ణయంతో వారిలో సంతోషం వ్యక్తమవుతోంది.
గత ఏడాది యూరియా కొరతతో రైతాంగం ఇబ్బందులు పడ డంతో ప్రభుత్వం అప్రమత్తమై పంట డిమాండ్‌కు తగినట్టుగా యూరియా, ఇతర ఎరువులు సరఫరా జరిపింది. ఈ ఏడాది ఆరంభం నుంచే గత ఏడాది ఇబ్బందులు తలెత్తకూడదని కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా రైతుల పట్టా నంబర్, ఆధార్ లింక్‌తో ఈ–క్రాప్ చేసిన తర్వాత ఎరువులు అందిస్తామని ప్రచారం చేసింది. ఈ–క్రాప్ అయిన భూములకు మాత్రమే ఎరువులు అందుతాయి. తద్వారా ఎరువుల విక్రయాలకు అక్రమాలకు అడ్డుకట్ట జరుగుతుంది.
30 వేల ఎకరాలకు సమస్య
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపుకు గురవుతు న్న కుక్కునూరు మండలంలో 16 వేల ఎకరాలు, వేలేరుపాడులో దాదాపు 10 వేల ఎకరాలు సంబంధించి భూసేకరణ జరిగింది. ఈ భూములన్ని ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లాయి. అయితే 2017 నుంచి రైతులు ఇక్కడ కదిలివెళ్లే వరకు ఈ భూములను సాగు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వపరమైన ఈ భూములను ఈ–క్రాప్ చేసే అవకాశం లేదు. కుక్కునూరు అటవీరేంజ్ పరిధిలో 1,911 మంది రైతులు దాదాపుగా 5,700 ఎకరాల పోడుభూమిని సాగు చేస్తున్నారు. వీరికి పట్టా లేక పోవడంతో ఈ–క్రాప్‌లో నమోదు కాలేదు. కుక్కునూరు మండ లంలో ఈ–క్రాప్‌లో నమోదైన భూములు 1,669 ఎకరాలు మాత్ర మే ఉన్నాయి. నమోదు కాని దాదాపు 30 వేల ఎకరాల భూమిని సాగు చేస్తున్న తమకు ఎరువులు ఎలా అనేది గత రెండు నెలలుగా రైతులను వేధిస్తోంది.
వ్యవసాయ శాఖ అప్రమత్తం
కేవలం ఈ–క్రాప్ అయిన భూములకు మాత్రమే ఎరువులు అందిస్తే మిగిలిన భూములు సాగు చేస్తున్న రైతాంగానికి ఎరు వులు ఎలా అన్నది వ్యవసాయ శాఖ ముందే గుర్తించింది. కుక్కు నూరు మండల వ్యవసాయాధికారి బాలాజీ ఈ సమస్యను జిల్లా జేడీఏ హబీబ్ బాషా దృష్టికి తీసుకెళ్లారు. ఎరువుల సరఫరా జరగకపోతే వేలాది మంది రైతులు వ్యవసాయం చేయ్యలేని పరిస్థితి ఉందని గుర్తించారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు సమస్యను గుర్తించి వెసులుబాటు కల్పించారు. నాన్‌వెబ్ ల్యాండ్ ద్వారా ముంపు భూములు, పోడు భూముల రైతుల వివరాలు విస్తీర్ణం నమోదు చేస్తున్నారు. తద్వారా వారికి ఎరువుల సరఫరా జరగనుంది. రైతుల వివరాలు నమోదు చేస్తుండడంతో డీలర్ల వద్దకు వెళ్లగానే వారి ఆధార్ కార్డు వివరాల ద్వారా ఓటీపీ వచ్చిన నేపథ్యంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే యూరియా, ఇతర ఎరువులు అందిస్తున్న ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది.
90 వేల యూరియా బస్తాల కోసం ప్రతిపాదనలు
మండల ంలోని పోడు, ముంపు, ఈ–క్రాప్, జామాయిల్ నర్సరీల రైతాంగం అవసరాల నేపథ్యంలో దాదాపు 90 వేల (4,100 మెట్రిక్ టన్నులు) యూరియా అవసరమని గుర్తించాం. దీనికోసం ఇంత మొత్తం యూరియా కావాలని జిల్లా అధికారులకు ప్రతి పాదనలు పంపించాం. భూమి సాగు చేస్తున్న ప్రతి రైతుకి యూరరియా, ఇతర ఎరువుల కొరత అందించాలని కృషి చేస్తున్నాం.
– బాలాజీ, మండల వ్యవసాయాధికారి, కుక్కునూరు