రైతులకు చుక్కెదురు
ABN , Publish Date - May 12 , 2026 | 12:58 AM
రైతులకు బ్యాంకుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. ధాన్యం సొమ్ములు ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాయి.
రోజుకు రూ.20 నుంచి 30 వేలే..
నెల రోజులుగా ఇదే పరిస్థితి
బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రైతులకు బ్యాంకుల నుంచి చేదు అనుభవం ఎదురవుతోంది. ధాన్యం సొమ్ములు ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. నగదు కొరతతో సొమ్ములు ఇవ్వకుండా దాట వేస్తున్నాయి. మరో వైపు పరిమితులు విధించాయి. రోజుకు రూ.20 వేలు నుంచి రూ.30 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దాంతో రైతులంతా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జిల్లాలోని రైతులకు ఇది పెద్ద సమస్యగా మారింది. డిజిటల్ లావాదేవీలకు ఇబ్బంది లేదు. కూలీలకు వరి కోత యంత్రాలకు నగదు చెల్లించాల్సి వస్తోంది. దీంతో నగదు అవసరమవుతోందని రైతులు వాపోతున్నారు. రెండు వారాల కిత్రం రోజుకు రూ.50 వేలు సర్దుబాటు చేశారు. ఇప్పుడు బ్యాంకులు మరింత కోత విధిం చాయి. కేవలం రూ.20 వేలతోనే సరిపెడుతున్నారు.
సకాలంలో ప్రభుత్వం జమ
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం సకాలంలోనే సొమ్ములు జమ చేస్తోంది. ఆన్‌లైన్‌లో నమోదైన 24 గంటల వ్యవధిలోనే రైతు ఖాతాలో సొమ్ములు జమవుతున్నాయి. ఇప్పటిదాకా జిల్లాలో 6 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. రూ.వెయ్యి కోట్లు రైతులకు చెల్లించింది. మరో రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు. రైతులకు చెల్లించటానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటు వచ్చి బ్యాంకులే ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నాయి. నెల రోజుల నుంచి ఇదే రకమైన ఇబ్బందులతో రైతులు సతమతమవుతున్నారు. బ్యాంకులకు రావాలసిన రికవరీలు కూడా తగ్గిపోయాయి. రికవరీ అయినా రైతులకు, మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చెయ్యవలసి వస్తోంది. వ్యాపారస్తుల నుంచి నగదు చెల్లింపులు తగ్గుముఖం పట్టడంతో నగదు కొరత ఏర్పడుతోందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. మరో వైపు పైనుంచి బ్యాంకులకు నగదు సరఫరా తక్కువగా ఉంటోంది. మొత్తం మీద సోమ్ములు లేకపోవడంతో రైతులకు భాధపెడుతున్నాయి.