ఉపాధి హామీకి రామ్.. రామ్
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:43 AM
రెండు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కాలం చల్లిపోనుంది.
ఒకటి నుంచి వీజీ జీ రామ్ జీ అమల్లోకి
శ్రామికులకు ప్రతి వారం వేతనం
ఆలస్యమైతే పరిహారం..15 రోజుల్లో పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి
అత్తిలి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : రెండు దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మరో రెండు రోజుల్లో కాలం చల్లిపోనుంది. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వీబీజీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవీకా మిషన్) అమలులోకి రానుంది. రాష్ట్రంలో ఈ పథకం జూలై 2న తిరుపతి జిల్లా మంగంపేటలో ముఖ్య మంత్రి లాంఛనంగా ప్రారంభించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 419 పంచాయతీలున్నాయి. పంచాయతీల్లో రెండు లక్షల 66 వేల 372 జాబ్ కార్డుల కోసం నమోదు చేసుకోగా లక్షా 65 వేల 90 మంది శ్రామికులు క్షేత్రస్థాయిలో పనులకు హాజరవుతున్నారు. గ్రామాల్లో దుర్భర పరిస్థితుల కారణంగా ఇతర ప్రాంతాలకు వలసపోతున్న పల్లెవాసులకు ఉన్నచోటే పనులు కల్పించాలన్న సంకల్పంతో 2002లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉపాఽధిహామీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద శ్రామికులు పొందే వేతనం మొత్తంలో 40 శాతం అదనంగా గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేటా యించింది. దీంతో పల్లెల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వమే ఈ పథకం అమలుకు అవసరమైన నిధులు కేటాయించేది. నూతన పథకంలో భాగంగా వీబీజీ రామ్‌జీలో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చేలా పథకానికి రూప కల్పన చేయడంతో పాటు చట్టంలో పలుమార్పులకు శ్రీకారం చుట్టారు.
కొత్త పథకంలో మార్పులు ఇవే :
ఒక కుటుంబానికి వంద రోజులు బదులు 125 రోజులు పనిదినాలు కల్పించనున్నారు. శ్రామికుల వేతన చెల్లింపులో జాప్యం లేకుండా క్రమం తప్పకుండా వారినికి ఒక రోజు వేతనాలు చెల్లిస్తారు. అవసరమైతే పరిహారాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఉపాధి కావాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న ప్రతి వ్యక్తికి 15 రోజుల్లోగా పని కల్పించాలి...లేని పక్షంలో నిరుద్యోగ భృతి చెల్లించాలని చట్టంలో పేర్కొంది. సమాజంలో కొన్ని వర్గాలకు ప్రత్యేక కార్డులను జారీ చేయడానికి నిబంధనలు పొందుపరిచారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60 ఏళ్లకు పైబడిన వారు ట్రాన్స్‌జండర్లకు ప్రత్యేక గ్రామీణ రోజ్‌గార్ గ్యారెంటీ కార్డులు అందజేస్తారు. పనులు వేతనాలు, మస్తర్ల వివరాలు బహిర్గతం చేస్తారు. ఆరు నెలల కొకసారి సామాజిక తనిఖీలు నిర్వహించేలా మార్పు చేశారు.