ఆక్వా జోష్
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:47 AM
ఆక్వా రైతులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. విద్యుత్ రాయితీని విస్తరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. హామీ ఇచ్చిన ఒక్కరోజు వ్యవధిలోనే ఆక్వా విద్యుత్ రాయితీపై సంతకం చేశారు.
రాయితీ కనెక్షన్ల విస్తరణకు ఆమోదం
సిద్ధాంతం సభలో ముఖ్యమంత్రి హామీ
రెండు రోజుల వ్యవధిలోనే ఉత్తర్వులు
జిల్లాలో కొత్తగా 27 వేల ఎకరాలకు లబ్ధి
ఆక్వా రైతులకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. విద్యుత్ రాయితీని విస్తరిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. హామీ ఇచ్చిన ఒక్కరోజు వ్యవధిలోనే ఆక్వా విద్యుత్ రాయితీపై సంతకం చేశారు. ఇప్పటిదాకా విద్యుత్ రాయితీకి నోచుకోని అనేకమంది రైతులకు లబ్ధి చేకూరనుంది. చంద్రబాబు ఇటీవల సిద్ధాంతం వచ్చినప్పుడు ఆక్వా రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆక్వా రైతులకు రూ. 1.50 పైసలకు ఇస్తున్న విద్యుత్ రాయితీని విస్తరిస్తామని ప్రకటించారు. దానిని అమలు చేశారు. దీంతో ఆక్వా రైతుల్లో జోష్ నెలకొంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర విభజన అనంతరం అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ఆదుకు నేందుకు రైతులకు యూనిట్ విద్యుత్ 1.50కే ఇచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సబ్సిడీ విధానానికి తిలోదకాలు ఇచ్చింది. ఆక్వా రంగాన్ని ఆక్వా, నాన్ ఆక్వా జోన్‌లుగా విడదీసింది. నాన్ ఆక్వా జోన్‌లో ఉన్న రైతులు 3.85 పైసలు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు టీడీపీ నిర్ణయంతో జిల్లాలో 27 వేల ఎకరాల్లో రైతులకు ప్రయోజనం కలగనుంది. ఇప్పటివరకు నాన్ ఆక్వాజోన్‌లో ఉండడంతో ఈ రైతులకు విద్యుత్ రాయితీ వర్తించలేదు. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ఆక్వా సాగుపై సర్వే నిర్వహించారు. నాన్ ఆక్వాజోన్‌లో ఉన్న చెరువులను గుర్తిం చారు. గ్రామ సభలను ఏర్పాటు చేశారు. తదుపరి మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. చివరిగా జిల్లా కలెక్టర్ అనుమతితో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.ఈ ఏడాది జిల్లాలోని నాన్ ఆక్వా జోన్ పరిధిలో విస్తరించి ఉన్న 27 వేల ఎకరాల్లో చెరువులను ప్రభుత్వం జోన్ పరిధిలోకి తీసు కొచ్చింది. ఇప్పటిదాకా నాన్ ఆక్వా పరిధిలో ఉండడంతో విద్యుత్ రాయితీకి నోచు కోలేదు. ప్రతినెలా వేల రూపాయలు విద్యుత్ బిల్లు చెల్లించేశారు. చెరువలన్నింటినీ ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జిల్లాలో ప్రస్తుత రాయితీ కనెక్షన్‌లు
జిల్లాలో 1.37 లక్షల ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు.ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు పెంచాలని ప్రణాళిక చేశారు. విద్యుత్ రాయితీ వర్తించదన్న ఉద్దేశంతో రైతులు కొత్త చెరువుల తవ్వకానికి వెనుకంజ వేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం నాన్ ఆక్వాజోన్ లేకుండా చేసింది. కొత్తగా ఆరు వేల ఎకరాల్లో చెరువులు తవ్వుకోవడానికి అవకాశం ఉందని మత్స్యశాఖ తేల్చింది. ప్రస్తుతం జిల్లాలో 14,259 విద్యుత్ కనెక్షన్‌లకు రాయితీ కల్పిస్తున్నారు. పది ఎకరాల పైన ఉన్న చెరువులకు, రైతులకు విద్యుత్ రాయితీ వర్తించడం లేదు. అటువంటి కనెక్షన్‌లు జిల్లాలో 1,133 వరకు ఉన్నాయి. నాన్ ఆక్వాజోన్‌లో ఇదివరకు 959 కనెక్షన్‌లున్నాయి.ఇవన్నీ ఇప్పుడు రాయితీ పరిధిలోకి రానున్నాయి. మరోవైపు కొత్త కనెక్షన్‌లు విస్తరించనున్నాయి. ఇప్పటికే రైతులు 359 కొత్త కనెక్షన్‌లకు దరఖాస్తు చేసుకున్నారు.
నాణ్యతా ప్రమాణాలు లేకపోతే నష్టపోతారు : కలెక్టర్
భీమవరంటౌన్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : ఆక్వా రైతులు సాగు, ఎగుమతులకు సంబంఽ దించిన అన్ని అనుమతులు, రిజిస్ట్రేషన్లు తప్ప నిసరిగా పొందడంతో పాటు నాణ్యత ప్రమా ణాలను పాటిస్తూ సాగు నిర్వహించాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. కలెక్టరేట్‌లో మత్స్యశాఖ, ఎంపెడా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆక్వా రైతుల అవగాహన సద స్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రస్తుతం అమెరికా, యూరప్ దేశాలకు ఎగు మతయ్యే ఆక్వా ఉత్పత్తులపై కఠిన నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారని నాణ్యతా ప్రమా ణాలు పాటించని పక్షంలో రైతులు, ఎగుమతి దారులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుం దని హెచ్చరించారు. 2029 జనవరి 10 నుంచి ట్రేసబిలిటీ సర్టిఫికెట్ తప్పనిసరిగా అమల్లోకి రానుందని, ప్రతి రైతు ముందుగానే అవగా హన పెంచుకుని అవసరమైన రికార్డులు, నమోదులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అప్సడా రిజిస్ట్రేషన్, ఎంపెడా ఎన్‌రోల్‌మెంట్ తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేశారు. జిల్లా మత్స్యశాఖ అధికారి డి.శ్రీనివాస్, ఎంపెడా డిప్యూటీ డైరెక్టర్ పి.ఆనంద్, టెక్నికల్ ఆఫీసర్ దుర్గారావు, ఎఫ్‌డీవోలు, ఎగుమతిదారులు, ఆక్వా రైతులు, పాల్గొన్నారు.
రైతులకు ఎంతో మేలు
విద్యుత్ రాయితీని విస్తరించేలా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా నాన్ ఆక్వాజోన్ సమస్యతో రైతులు నష్టపోయారు. తాజా ఉత్తర్వులతో రైతులకు చాలా మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చిన విధంగా మేత ధరలు తగ్గిస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది.ఆక్వా రంగం వృద్ధి చెందడానికి దోహడపడుతుంది.
– భగవాన్ రాజు, ఆక్వా రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు
ఆక్వా రైతులకు ఊతం
ఆక్వా రైతులకు విద్యుత్ భారం తగ్గు తుంది. యూనిట్ ధర రూ. 3.85 పైసల నుంచి 1.50కు లభించడంతో నెలకు సుమారు రూ. 50 వేల వరకు రైతులకు ఖర్చు తగ్గుతుంది. రెండు సంత్సరాలుగా వేలాది రూపాయలు నష్టం పోయాం.ఆక్వాజోన్ లేకపోవడంతో ప్రతి రైతుకు మేలు జరుగుతుంది.
– కన్నబాబు, రైతు కోళ్ళపర్రు
ఆకివీడురూరల్ (ఆంధ్రజ్యోతి)
జూన్ నుంచి అమలు చెయ్యాలి
విద్యుత్ సబ్సిడీ అంశంపై సంతకం చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. జివో విడుదల చేసే సమయం వరకు ఇచ్చిన విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ వర్తింప చెయ్యాలి. జూన్ నెల నుంచే అమలు చెయ్యాలి. ప్రభుత్వం ఇచ్చిన హమీని నిలబెట్టుకుంది.
– పిన్నమరాజు శ్రీనివాసరాజు ఆక్వా రైతు, దుంపగడప