Share News

మళ్లీ మొదటికే..!

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:43 AM

పురపాలక సంఘానికి డపింగ్‌ యార్డు సమస్య వీడడం లేదు. తాత్కాలికంగా పరిష్కారమైనా మళ్లీ మొదటికొస్తుంది.

మళ్లీ మొదటికే..!
డంపింగ్‌ యార్డ్‌లో కొండలా పేరుకుపోయిన చెత్త

ఎంపిక స్థలంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రైతులు

పుష్కరాల నాటికి సమస్య తీరేనా..?

నరసాపురం, జూలై 25(ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘానికి డపింగ్‌ యార్డు సమస్య వీడడం లేదు. తాత్కాలికంగా పరిష్కారమైనా మళ్లీ మొదటికొస్తుంది. పుష్కరాల నాటికైనా చెత్త డంపింగ్‌ సమస్య పరిష్కారం అవుతుందా? అన్న సందేహం ప్రజల్లో నెలకొంది. ఇటు అధికారులు ఈసమస్యను ఎలా పరిష్కరించాలని మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇటీవల డపింగ్‌యార్డు కోసం పాలకొల్లు రోడ్‌లో రెండు స్థలాలను గుర్తించారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించడంతో సేకరణ ప్రక్రియ వేగవంతం చేశారు. ఒక స్థలం ప్రభుత్వ భూమి కావడంతో రైతుల నుంచి ఇబ్బందులు రాదని ఆశించారు. అయితే అక్కడ ఏర్పాటు చేయవద్దని అధికారులకు రైతులు ముందుగా వినతిపత్రం ఇచ్చారు. అధికారులు వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చెత్త వేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేశారు. అక్కడ చెత్త వేస్తే తమ పంటలు దెబ్బతింటాయని రైతుల్లో భయం నెలకొంది. దీంతో సేకరించిన రెండు స్థలాల పరిసర రైతులు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం పురపాలక సంఘానికి స్థలం లేకపోవడంతో స్మృతివనం వద్దనున్న ఖాళీ స్థలంలో చెత్త డంప్‌ చేస్తున్నారు. రెండు నెలలుగా ఇక్కడ చెత్త భారీగా పేరుకుపోవడంతో పది రోజుల తర్వాత ఇక్కడ చెత్త వేసే అవకాశం కూడా ఉండదు. రోజువారి చెత్తను ఎక్కడ డంప్‌ చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి వివరణ ఇస్తూ రెండు స్థలాలు గుర్తించామని, రైతులు న్యాయస్ధానాన్ని ఆశ్రయించడం వల్ల పెండింగ్‌ పడింది. ప్రస్తుతం చెత్త వేస్తున్న స్థలంలో మరో 15 రోజులు వేసే వెసులుబాటు ఉంది. అప్పటిలోపు మరో స్థలాన్ని గుర్తిస్తాం.

Updated Date - Jul 26 , 2026 | 12:43 AM