సా..గుతోంది!
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:29 AM
ఎల్‌నినో ప్రభావం అనుకున్న దానికన్నా చాలా తీవ్రంగా ఉండడంతో కనీసస్థాయిలో కూడా వర్షాలు పడడం లేదు.ఖరీఫ్ సీజన్‌లో సగం కాలం దాటినా వాన జాడ లేదు.
ఖరీఫ్‌లో సగం సీజన్ గడిచినా జాడ లేని వాన
ఏలూరు రూరల్, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి):ఎల్‌నినో ప్రభావం అనుకున్న దానికన్నా చాలా తీవ్రంగా ఉండడంతో కనీసస్థాయిలో కూడా వర్షాలు పడడం లేదు.ఖరీఫ్ సీజన్‌లో సగం కాలం దాటినా వాన జాడ లేదు. ఏలూరు రూరల్ మండలంలో వర్షాధార భూ ములతో పాటు, కృష్ణా డెల్టా, పోణంగి పుంత ఆయ కట్టు చివరి భూముల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరితో పాటు ఇతర పంటల సాగు లేనట్టేనని రైతులు వాపో తున్నారు. చాలామంది రైతులు పొలాలను దుక్కిదున్న కుండా వదిలేశారు. వర్షాలు కురుస్తాయన్న ఆశతో కొంత మంది రైతులు గత నెలలో వరి నారుమడులు పోయగా వర్షాలు లేక నారు ఎండిపోయింది. కొన్నిచోట్ల ఏదోలా అష్టకష్టాలు పడి నారును పెంచినా ఇప్పుడు పొలాలను దమ్ము చేయడానికి నీరు లేక నారును వృఽథాగా వదిలేయాల్సిన దుస్థితి. మాదేపల్లి, జాలిపూడి, లింగారావుగూడెం, చాటపర్రు, వెంకటాపురం, సుంకర వారితోట గ్రామాల్లో వరినాట్లు వేయక పోవడంతో పొలాలు గడ్డితో పచ్చిక మైదానాలను తలపిస్తున్నాయి. ఏడు వేలు ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా వెయ్యి ఎకరాల్లోపు మాత్రమే నాట్లు వేయడం గమనార్హం.
సాగు చేసిన పంటలను కాపాడండి..
కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి, రైతులు సాగు చేసిన పంటలను కాపాడాలి. వరి పంట సాగుకు అవకాశం కల్పించాలి. కృష్ణా డెల్టా ఆయకట్టుకు గోదావరి జలాలు అందించే అవకాశం ఉంది. పోణంగి పుంత కాలువ ద్వారా ఏలూరు రూరల్ మండలంలో 10 వేల ఎకరాల కృష్ణా డెల్టా ఆయకట్టుకు గోదావరి ప్రధాన కాలువ నుంచి సాగునీరు అందించాలి.
– కె.శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
ఆరు ఎకరాలు బీడు.. కన్నీళ్లే మిగిలాయి
ఏటా ఆరు ఎకరాల్లో పంట సాగు చేసేవాడిని. ఈసారి నీరు లేక ఆరు ఎకరాలు బీడుగా మారాయి. పంటలు పండించి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన మాకు ఇప్పు డు కన్నీళ్ళు తప్ప ఏమీ మిగలడం లేదు. వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తున్నారు. పంట వేసిన తర్వాత వర్షాలు కురిస్తే ఆ పంట కూడా పూర్తిగా నాశనం అయ్యే ప్రమాదం ఉంది.
– రామారావు, రైతు, మాదేపల్లి
ఇప్పటి వరకు నారు పోయలేదు..
గతేడాది నాలుగు ఎకరాలకు నీరందింది. ఈసారి పశువుల తాగడానికీ నీరు దొరకని పరిస్థితి. ఇప్పటి వరకు నారు పోయలేదు. నారు పోయడానికి అనువైన బలమైన కార్తెలు కూడా వెళ్ళిపోతున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు. ప్రభుత్వం సాగునీటి సమస్యకు పరిష్కరం చూపాలి.
– వీరంకి రామకృష్ణ, జాలిపూడి