Share News

పొట్ట విప్పి చూడ.. మందులుండు..!

ABN , Publish Date - Apr 05 , 2026 | 12:32 AM

ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు.

పొట్ట విప్పి చూడ.. మందులుండు..!

భీమవరానికి చెందిన రమేశ్‌ వయసు 50 ఏళ్లు. కొన్నేళ్లుగా థైరాయిడ్‌, బీపీ, షుగర్‌, గ్యాస్‌ ట్రబుల్‌, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. వైద్యుల సూచనలతో కొన్ని మాత్రలు, సొంతంగా మరికొన్ని మాత్రలు వాడుతున్నాడు. ఇలా రోజూ 12 నుంచి 15 వరకు మింగుతున్నాడు.

ఆకివీడుకు చెందిన సురేష్‌ కొన్నేళ్ల క్రితం ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. నొప్పి మాత్రలతోపాటు గ్యాస్‌, విటమిన్‌, కాల్షియం, విటమిన్‌–డి మాత్రలు వాడారు. నొప్పి మాత్రలు మానివేసినా గ్యాస్‌ మాత్రలు కొనసాగించాడు. ఇప్పుడు అవి వేసుకోకపోతే భరించలేని స్థితికి వచ్చేశాడు.

సుబ్రహ్మణ్యంకు షుగర్‌, బీపీ, గ్యాస్‌ సమస్యలు వున్నాయి. మూడేళ్ల క్రితం వైద్యులను సంప్రదిస్తే మూడింటికి మాత్రలు రాశారు. అప్పటి నుంచి ఈ మందులు వాడుతూనే వున్నారు. మధ్యలో కనీసం డాక్టర్‌ను కలవలేదు. మాత్రలు మార్చలేదు. డోస్‌ అడ్జస్ట్‌మెంట్‌ చేయకపోవ డంతో కొత్త సమస్యలతో బాధపడుతూ వైద్యులను సంప్రదించాడు.

డాక్టర్‌ సూచనతో కొన్ని.. సొంతంగా మరికొన్ని..

దీర్ఘకాలిక జబ్బులతో మాత్రల పెరుగుదల

కొందరు రోజుకు పది నుంచి 15 మాత్రల వరకు మింగేస్తున్నారు

కుటుంబ ఆదాయంలో మేజర్‌ షేర్‌ దీనికే.. ప్రతి చిన్న సమస్యకు మందులే కాదు.. జీవనశైలిలో మార్పులతోనే మేలన్న వైద్యులు

భీమవరం క్రైం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి):ఇటీవల కాలంలో చాలా మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. డాక్టర్‌ వద్దకు వెళితే కొన్ని రకాల పరీక్షలు చేసి వాటికి తగ్గట్లుగా మందులు ఇస్తున్నారు. దీంతో మందులు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. నిత్యం మందులు వాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఒక ఇంట్లో ఇద్దరూ లేక ముగ్గురూ వివిధ రకాల జబ్బులతో బాధపడేవారుంటే నిత్యావసర సరుకులకంటే వారు వాడే మందుల ఖర్చు అధికంగా ఉంటుంది.

కొంత మందికి శరీరంలో ఏదైనా నలతగా ఉంటే వెంటనే మందుల షాపునకు వెళ్లి మందులు కొని తెచ్చుకుని వేసుకోవడం అలవాటుగా మారింది. ప్రతి చిన్న సమస్యకు వైద్యుల వద్దకు వెళ్లి మందులు వాడటం మరి కొందరికి పరిపాటిగా మారింది. దీంతో జిల్లాలో మందులు వాడే వారి సంఖ్య బాగా పెరిగినట్లు మెడికల్‌ షాపుల యజమానులు చెబుతున్నారు.

మెడికల్‌ షాపా... కడుపా...!

దీర్ఘకాలిక జబ్బుల కారణంగా పలు ఆరోగ్య సమస్యలకు డజనుకు పైగా మందులు వాడే వారి సంఖ్య అధికమయ్యింది. దీనికితోడు అలర్జీ, జలుబు, దగ్గు, జ్వరం, వళ్ళు నొప్పులు వంటివి వస్తే వెంటనే మెడికల్‌ షాపునకు వెళ్లి మందులు కొని వాడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రతి మందుకు ఏదో ఒక సైడ్‌ ఎఫెక్ట్‌ ఉంటుంది. ఒక మాత్ర వేసుకోవడం వల్ల వచ్చిన సైడ్‌ ఎఫెక్ట్‌ను తగ్గించేందుకు మరో మాత్ర.. ఇలా వాడుతూ వెళుతున్నారు. దీనివల్ల మందుల వాడకం పెరుగుతోంది. యాభై ఏళ్లతో పోలిస్తే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా బీపీ, షుగర్‌, థైరాయిడ్‌, కొలెస్ట్రాల్‌, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, పలు రకాల క్యాన్సర్లతో బాధపడే వారి సంఖ్య బాగా ఎక్కువయ్యింది. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి కలుషితం కావడమే ఈ పరిస్థితికి కారణంగా వైద్యులు చెబుతున్నారు. యాంత్రీకరణ పెరగడంతో పిల్లల నుంచి పెద్దల వరకు శారీరక శ్రమ తగ్గిపోయింది. వ్యాయామం అసలే లేదు. మానసిక ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో ప్రతి కుటుంబంలో మందులకే ప్రతి నెలా మూడు వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలా మందులు వాడే కుటుంబాలు చాలానే ఉన్నట్లు అంచనా.

నేను వాడా.. నువ్వు వేసుకో !

నేను ఫలానా మందు వేసుకున్నా. నాకు రోగం తగ్గింది. కాబట్టి నువ్వు కూడా ఆ మందు వేసుకో.. అంటూ చెప్పే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇతరులకు ఉపయోగపడితే నాకు ఉపయోగపడుతుందనే భావన సరికాదు. ప్రతి వ్యక్తి శరీర పరిస్థితి వేరు. అందుకే ప్రతి మందు కూడా వ్యక్తిగతంగా నిర్ణయించాలి. ఇంగ్లీష్‌ మందులతో, ఆయుర్వేద లేదా హర్బల్‌ మందులతో కలిపి వాడే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇవి కొన్నిసార్లు ప్రతికూలంగా మారే అవకాశాలు ఉంటాయి. సరైన వైద్యుల సూచనతోనే మందులు వాడటం ఆరోగ్యకరమైన మార్గం. ఫార్మసీలు కూడా వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా ఈ మందులను ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

కొత్త సమస్యలు తెచ్చుకోవద్దు

శరీరంలో ఏ విధమైన రుగ్మత కలిగి నా చాలా మంది మెడికల్‌ షాపునకు వెళ్లి మందులు కొని వేసుకుంటున్నారు. ఇది సరికాదు. ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడేవారు వైద్యుడి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. తప్పుగానో, అవసరం లేకుండానో వాడితే తీవ్రమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. హార్ట్‌ ప్రొటెక్షన్‌ కోసం కొందరు రోజూ ఆస్పిరిన్‌ వేసుకుంటున్నారు. ఇది అవసరం లేకుండా తీసుకుంటే కడుపులో, మెదడులో రక్తస్రావం వంటి ప్రమా దాలు పెరుగుతాయి. గుండె దడ, ఆందోళన ఉన్నప్పుడు కొందరు బీటా బ్లాకర్లు వాడుతున్నారు. ఇది తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినా, రక్తపోటు తగ్గిపోవడం, గుండె స్పందన నెమ్మదించడం, అలసట వంటి సమస్యలు కలగవచ్చు. ఆస్త మా, గుండె వైఫల్యం ఉన్న వారికి ఇది మరింత ప్రమాద కరం. కొలెస్ట్రాల్‌ తగ్గించే స్టాటిన్‌ మందులను కొందరు వాడ డం మూలాన కండరాల నొప్పులు, లివర్‌పై ప్రభావం చూపు తాయి. వాపు తగ్గించే మందుల కారణంగా శరీరంలో ఎలకో్ట్ర లైట్స్‌ అసమతుల్యతకు దారి తీసి, కిడ్నీ, గుండె రిథమ్‌లో మార్పులు వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలోనే మందులు వాడాలి. సోషల్‌ మీడియా ద్వారా తప్పుదారి పట్టించే సమాచారం ఎక్కువగా స్ర్పెడ్‌ అవుతోంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి.

డాక్టర్‌ జి.వి.నాగేశ్వరరావు, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌, తణుకు

సొంత నిర్ణయం వద్దు

చాలా మంది అనేక జబ్బులకు ఇష్టానుసారం మందులు వాడుతుంటారు. అది చాలా ప్రమాదకరం. దీనివల్ల అల్సర్‌, కిడ్నీ సమస్యలు, ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. కొన్ని రకాల జబ్బులకు మందులను ఆపడం వల్ల ఆ జబ్బులు మరింత తీవ్రమవుతాయి. అలాంటి వారికి చాలా జాగ్రత్తగా వైద్యం అందించాలి. స్టెరాయిడ్స్‌ కూడా ఎక్కువ వాడకూడదు. దీనివల్ల లావు అవ్వడం, చర్మవ్యాధులు, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యలు వంటివి వస్తాయి. స్టెరాయి డ్స్‌ వాడే వారు తప్పనిసరిగా మూడు నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. యాంటీబయోటిక్స్‌ ఐదు నుంచి పది రోజులలోపు మాత్రమే వాడాలి. ఎక్కువ రోజులు వాడితే కిడ్నీ, లివర్‌, గుండె జబ్బులు వంటివి వస్తాయి. సొంత నిర్ణయంతో మందులను వినియోగించకండి.

– డాక్టర్‌ నాగిడి హరిశ్చంద్రప్రసాద్‌, జనరల్‌ ఫిజీషియన్‌, భీమవరం

ఇక్కడ నకిలీ వైద్యులదే హవా..!

లింగపాలెం, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి):లింగపా లెం మండలంలోని పలు గ్రామాల్లో అనుమతు లు లేని క్లినిక్‌లు, రక్త పరీక్ష కేంద్రాలు, మందుల షాపులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఎటువంటి అర్హతలు లేకపోయినా కొందరు నకిలీ వైద్యులు క్లినిక్‌లు నిర్వహిస్తూ ఇష్టానుసారం టెస్టుల చేయి స్తూ.. విచ్చల విడిగా మందులను వేయిస్తూ వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. వీరికి సీజనల్‌ వ్యాధులు కాసులు కురిపిస్తున్నాయి. జ్వరం వచ్చి వారి వద్దకు వెళితే టైఫాయిడ్‌, డెంగీ, మలేరియా అంటూ రకరకాల పరీక్షలు చేయించి వేలల్లో వసూలు చేస్తున్నారు. మరికొందరు చిన్నపిల్లల ప్రత్యేక వైద్యులమని చెబుతూ మోతాదుకు మించిన ఇంజక్షన్‌లు, మందులు ఇస్తున్నారు. మందుల డోసు ఎక్కువై వైద్యం వికటిస్తే ఏలూరు, చింతలపూడి తీసుకువెళ్లమని చెబుతున్నారు. మరికొందరు పలురకాల వ్యాధులకు ప్రత్యేక చికిత్స అందించే వైద్యులమని విజయవాడ, ఏలూరు వంటిచోట్ల పెద్ద ఆస్పతుల్లో పనిచేశామని మోసం చేస్తున్నారు. దీనిపై ధర్మాజీగూడెం పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ ప్రియాంక వివరణ ఇస్తూ అనుమతులు లేని రక్త పరీక్ష కేంద్రాలు, నకిలీ క్లినిక్‌లు, మందుల షాపులను పరిశీలించి, తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - Apr 05 , 2026 | 12:32 AM