Share News

కూటమిలో సెగలు

ABN , Publish Date - Jul 03 , 2026 | 12:51 AM

తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి పార్టీల్లో నేతల మధ్య అంతరం నానాటికి పెరుగుతోంది.

కూటమిలో సెగలు

తాడేపల్లిగూడెంలో నేతల మధ్య పెరుగుతున్న అంతరం

తొలుత విభేదాలు.. ఎన్నికల తర్వాత సయోధ్య.. మళ్లీ మొదటికి

నామినేటెడ్‌ పదవులతో మొదలైన రచ్చ.. రోజురోజుకూ మరింత వేడి

వేదికలపై ఒకరిపై మరొకరు వ్యక్తిగత ఆరోపణలు.. విమర్శలు

స్థానిక సంస్థల ఎన్నికల నాటికైనా కలుస్తారా ? కేడర్‌లో ఉత్కంఠ

ఇరువురి మధ్య ఆజ్యం పోస్తున్న కొందరు నేతలు

ఆచితూచి అడుగులు వేస్తున్న టీడీపీ, జనసేన అధినాయకత్వాలు

తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి పార్టీల్లో నేతల మధ్య అంతరం నానాటికి పెరుగుతోంది. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వలవల బాబ్జి మధ్య విభేదాలు ఉప్పు నిప్పూగా మారాయి. ఒకరిపై మరొకరు చేసుకుంటున్న విమర్శలు తారస్థాయికి చేరుతున్నాయి. బాబ్జి చేస్తున్న వ్యాపారాలపై ఎమ్మెల్యే బొలిశెట్టి బహిరంగ వేదికలపై పరోక్ష ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనపై మీడియాల్లో వస్తున్న కథనాల వెనుక బాబ్జి ప్రమేయం వుందని అనుమానిస్తున్నారు. టీడీపీ ఆంతరంగిక సమావేశాల్లో బొలిశెట్టిపై బాబ్జి విమర్శలు సందిస్తున్నారు. ఇక్కడి పరిణామాలపై అడపాదడపా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

అసెంబ్లీ ఎన్నికల ముందు ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు వుండేవి. జనసేన తరపున బొలిశెట్టి, టీడీపీ తరపున వలవల తమ పార్టీల బలోపేతానికి కష్టపడ్డారు. ఎన్నికల్లో టిక్కెట్టు తనకే వస్తుందని, పార్టీ అధినేత చంద్రబాబు బాబ్జికి భరోసా ఇచ్చారు. కాని, కూటమి పార్టీల మధ్య పొత్తు ఏర్పడింది. ఎమ్మెల్యే టిక్కెట్‌ బొలిశెట్టికి వరించింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాట కలిసింది. ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేశారు. తాడేపల్లిగూడెంలో ఘన విజయం సాధించారు. బొలిశెట్టికి ప్రభుత్వ విప్‌ బాధ్యతలను అప్పగించారు. ఏపీ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రాష్ట్ర చైర్మన్‌గా బాబ్జిని నియమించారు.

నామినేటెడ్‌ పదవులతో చిచ్చు

నామినేటెడ్‌ పదవుల విషయంలో టీడీపీకి 50 శాతం, జనసేన, బీజేపీలకు మరో 50 శాతం తీసుకోవాలని ఆయా పార్టీల అధిష్టానాలు స్పష్టత ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన సొసైటీ త్రిసభ్య కమిటీలు, ఇతర పదవుల కేటాయింపు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. కొమ్ముగూడెం సొసైటీ చైర్మన్‌ పదవికి బొలిశెట్టి ఒకరికి సిఫారసు చేస్తే, వలవల మరొకరి పేరు సూచించారు. సర్దుబాటులో భాగంగా టీడీపీ తీసుకుంది. ఇక్కడ జనసేన సిఫారసు ఏమిటంటూ అధిష్ఠానం వద్ద బాబ్జి పట్టుబట్టారు. తొలుత సిఫారసు చేసిన వ్యక్తికి కాకుండా బాబ్జి సిఫారసు చేసిన వారికే ఈ చైర్మన్‌ పదవి వరించింది. దీనిపై ఆరు నెలలపాటు పంచాయతీ నడచింది. ఇరువురి నేతల మధ్య నామినేటెడ్‌ పదవుల విషయంలో భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నాయి.

విజయోత్సవ సభకు దూరం

ఇటీవల కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ సభ తాడేపల్లిగూడెంలో జరిగింది. సమావేశానికి టీడీపీ మండల, పట్టణ అధ్యక్షులు, ముఖ్యమైన నాయకులతో మాట్లాడి కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. బాబ్జికి మాత్రం మున్సిపల్‌ కమిషనర్‌తో ఫోన్‌ చేయించారు. దీంతో సమావేశానికి బాబ్జి దూరంగా ఉన్నారు.

ఆజ్యం పోస్తున్న నాయకులు

ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు మరింత ముదరడానికి కూటమిలోని కొందరు నాయకులే కారణం. అక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడి విషయాలు అక్కడకు చేరవేస్తూ ఇద్దరి మధ్య మరింత ఆజ్యం పోస్తున్నారు. మొత్తంపైన ఇరువురి మధ్య విభేదాలు జిల్లాలోనే కాదు.. రాష్ట్ర ముఖ్య నేతల మధ్య చర్చనీయాంశంగా మారింది. కానీ ఇరువురి మధ్య విభేధాలను చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ విషయం అత్యంత సున్నితంగా మారినట్టు అధిష్ఠానాలు భావిస్తున్నాయి. ఇరువురిలో ఏ ఒక్కరిని తప్పుపట్టినా కూటమి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తోంది. అందుకే ఆచితూచి అడుగులు వేస్తోంది. స్థానికంగా మాత్రం రాజకీయాలు ఉప్పు–నిప్పుగా మారుతున్నాయి.

వ్యక్తిగత విమర్శలు

బాబ్జి నిర్మిస్తున్న భవన నిర్మాణ స్థలాలు వేరొకరివి అంటూ బొలిశెట్టి పరోక్షంగా విమర్శిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం నిర్మించిన గణేశ్‌ రైస్‌మిల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ విషయంలోనూ స్థల యజమానులంటూ కొందరిని రప్పించి బాబ్జి కార్యాలయం వద్ద ధర్నా చేయాలంటూ ఓ నేత సూచించారు. వాస్తవానికి సదరు రైస్‌మిల్‌ స్థలం అప్పటికే ఐదు చేతులు మారింది. తర్వాత 12 మంది వ్యాపారులు స్థలాన్ని కొని షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టారు. ఇప్పుడు బాబ్జి లక్ష్యంగా సదరు షాపింగ్‌ కాంప్లెక్స్‌పై పావులు కదిపే ప్రయత్నం చేయడంతో ఇది వలవలకు కాక పుట్టించింది. ఆయన కూడా బొలిశెట్టి వ్యక్తిగత విషయాలపై కేడర్‌ వద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరోవైపు అధికారులకు బాబ్జి నేరుగా ఫోన్‌లు చేస్తూ పనులు చేయిస్తున్నారని, బెదిరిస్తున్నారంటూ బొలిశెట్టి నుంచి పరోక్షంగా విమర్శలు వినిపించాయి. ఇలాంటి చిన్నపాటి విమర్శలతో విభేదాలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. రాజకీయంగా తొక్కేస్తామంటూ బహిరంగంగానో.. అంతరింగకంగానో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే పరిస్థితికి వెళ్లిపోయారు.

స్థానిక ఎన్నికలపై ప్రభావం

రాజకీయాల నుంచి వ్యక్తిగత విషయాల వరకు తారస్థాయికి చేరుకున్న విభేదాలు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం వుందని ఆయా పార్టీల కేడర్‌ ఆందోళన చెందుతోంది. ఇరువురు కలుస్తారా..? లేదంటే వేర్వేరుగా ప్రచారం చేస్తూ తమ మద్దతుదారులను గెలిపిస్తారా ? అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. వైసీపీలోనూ విభేదాలు ఉండడంతో స్థానిక ఎన్నికల్లో కూటమికి ఎటువంటి ఢోకా ఉండదని భావిస్తున్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:51 AM