అలంకారప్రాయంగా ఏఎంసీలు
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:56 AM
వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నాయి. పాలకవర్గాలు ఏర్పాటైనా రైతులకు సేవలు అందించలేకపోతు న్నామన్న ఆవేదన మిగులుతోంది.
నిధులు మంజూరు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ససేమిరా
పుంత రహదారులకు నిధులివ్వని వైనం
డీలా పడుతున్న చైర్మన్‌లు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోతున్నాయి. పాలకవర్గాలు ఏర్పాటైనా రైతులకు సేవలు అందించలేకపోతు న్నామన్న ఆవేదన మిగులుతోంది. సెస్ రూపంలో ఆదాయాన్ని తెచ్చిపెట్టే అలంకార ప్రాయమై పోతున్నాయి. గత కూటమి ప్రభుత్వంలో కొద్దో గొప్పో నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. గ్రామాలకు లింకు రహదారులు వేశారు. పంటపొలాలకు పుంత రహదారులు నిర్మించారు. అప్పట్లో ప్రతి ఎఎంసికి గరిష్టంగా రూ. 3 కోట్లతో పనులు చేపట్టే అవకాశం లభించింది. అదే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ హయాంలో పైసా విదల్చలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడంతో రైతుల్లోనూ ఆశలు చిగురించాయి. జిల్లాలో ఏఎంసీల ద్వారా అభివృద్ధి జరుగుతుందంటూ భావించారు. స్థానిక శాసనసభ్యులు, కూటమి నేతలు కమిటీల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. జిల్లాలో ఉన్న పది వ్యవసాయ మార్కెట్ కమిటీలను కూడా ప్రభుత్వం భర్తీ చేసింది. కమిటీ చైర్మన్‌గా నియ మితులైన వారంతో ఎంతో ఊహించుకున్నారు. పదవి అలంకరించిన తర్వాత డీలా పడిపోయారు. పైసా ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం లేదు. యార్డుల్లోనూ రైతుల కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయి. మార్కెట్ కమిటీల వైపు రైతులు కన్నెత్తి చూడడం లేదు. జిల్లాలో మార్కెట్ కమిటీలకు అత్యధిక ఆదాయం లభిస్తోంది. ముందు వరుసలో భీమవరం ఉంది. ఇక్కడ ఏడాదికి రూ. 15 కోట్లు వస్తోంది. అలాగే ఉండి, ఆకివీడు పరిధిలోనూ ఆక్వా చెరువులు విస్తరించి ఉన్నాయి. దాంతో ఆ రెండు మార్కెట్ కమిటీలకు కూడా ఆశించిన స్థాయి లోనే సెస్ సమకూరుతోంది. తర్వాత తాడేపల్లి గూడెంలో ధాన్యం, ఇతర అపరాల ద్వారా ఆదాయం లభిస్తోంది. జిల్లాలో పది మార్కెట్ కమిటీలు ప్రతి ఏటా ప్రభుత్వానికి దాదాపు రూ. 80 కోట్లు మేర ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. రైతులకు మాత్రం పైసా ప్రయోజనం చేకూర్చడం లేదు.
గతమెంతో ఘనం
గతంలో ఏఎంసీ చైర్మన్ అంటే ఎంతో గౌరవ ప్రదంగా ఉండేది. చైర్మన్ పదవికోసం అంతా తహ తహ లాడేవారు. ప్రభుత్వ స్థాయిలో లాబీయింగ్ జరిగేది. ఎమ్మెల్యే తర్వాత నియోకవర్గంలో ఏఎంసీ చైర్మన్‌కు గుర్తింపు లభించేది. కమిటీ చైర్మన్ కోసం సీనియర్‌లంతా పోటీ పడేవారు.వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేవారు. పశువులకు ఉచిత వైద్య సేవలు అందించి మందులు సరఫరా చేసేవారు. రైతులకు అవసరమైన పుంత రహదారులు నిర్మించేవారు. రైతు బంధు పథకంలో రుణాలు మంజూరయ్యేవి. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా తల్లకిందులయ్యాయి. కేవలం ఏఎంసీలో సిబ్బంది నుంచి మాత్రమే కాస్త మన్నన ఉంటోంది. అంతకు మించి ఎటువంటి ప్రయోజనం లేదంటూ చైర్మన్లు వాపోతున్నారు. ఇటీవల భీమవరంలో పలువురు చైర్మన్‌లు సమావేశమయ్యారు. ఏఎంసీల సాధకబాదకాలపై చర్చించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించారు. ముఖ్యంగా రైతులకు అవసరమయ్యే రహదారులను ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించేలా ప్రభుత్వం వద్ద ప్రతి పాదించాలని తీర్మానించారు.
పుంత రహదారులు లేక అవస్థలు
వాస్తవానికి వ్యవసాయ మార్కెట్ కమిటీలకు ప్రతీ ఏటా వచ్చే ఆదాయంలో 20శాతం స్థానికంగా ఖర్చుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటికి కూడా మార్కెటింగ్ శాఖ అనుమతి ఇవ్వడం లేదు. కేవలం ఉద్యోగుల జీతభత్యాలు, కమిటీ గౌరవ వేతనాలు, వాహనాల బిల్లులకే మార్కెటింగ్ శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపారు. కానీ టెండర్ ప్రక్రియలోనే ప్రతిపాదనలు నిలచి పోయాయి. కాంట్రాక్టర్‌లనుంచి స్పందన కూడా అప్పట్లో లేకుండా పోయింది. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయదన్న ఉద్దశంతో కాంట్రాక్టర్‌లు వెనుకడుగు వేశారు. పెట్రోల్ బంకులు, కాటాలు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదనలు చేశారు. అవికూడా అమలుకు నోచుకోలేదు. వైసీపీ హయాంలో ఐదేళ్లు కమిటీలు పూర్తిగా చతికిల పడ్డాయి. ఇప్పుడూ అదే పరిస్థితి ఉందంటూ పాలకవర్గాలు నిట్టూరుస్తున్నాయి. మార్కెట్ కమిటీల్లో సిబ్బంది అవసరమైన సౌకర్యాల కోసం కూడా నిధులు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేసేలా ప్రయత్నం చేయాలంటూ చైర్మన్‌లంతా ఒక నిర్ణయానికి వచ్చారు.