సర్దుబాటు..తడబాటు
ABN , Publish Date - Jul 15 , 2026 | 01:04 AM
జిల్లాలో మిగులు వున్న ఉపాధ్యాయులను అవసరమైన చోటుకు సర్దుబాటు చేసే కార్యక్రమం సజావుగా జరగడం లేదు.
ఆచంట, జూలై 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మిగులు వున్న ఉపాధ్యాయులను అవసరమైన చోటుకు సర్దుబాటు చేసే కార్యక్రమం సజావుగా జరగడం లేదు. ఇప్పటికి చాలాచోట్ల ఉపాధ్యాయులు లేకుండానే పాఠశాలలు నడుస్తున్నాయి. వేసవిలో చేపట్టిన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని ఆయా పాఠశాలల్లో విద్యార్థులు పెరిగేలా కృషి చేశారు. కాని దానికి తగ్గట్టు ఉపాధ్యాయుల సర్దుబాటు జరగకపోవడంతో చాలాచోట్ల బోధన కుంటుపడటంతో ఆ ఉపాధ్యాయుల్లో అంతర్మఽథనం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా 92 ఉపాధ్యాయుల పోస్టులు సర్దుబాటు చేయాల్సి ఉండగా 12 మంది మాత్రమే సర్దుబాటు అయ్యారు. 80 మంది వారు చేస్తున్న స్కూళ్లలోనే ఉండిపోయారు.
సర్దుబాటు ఇలా..
మొదట జూన్ 1న ఉన్న రోల్ ఆధారంగా సర్దుబాటు చేస్తామని వాయిదా వేస్తూ చివరకు జూన్ 30 నాటికి ఉన్న రోల్ ఆధారంగా తీసుకున్నారు. మొదటి మండల స్థాయిలో సర్దుబాటు జరపగా అందులో పనిచేస్తున్న కేడర్‌ను వదిలి వేరే కేడర్‌కు సర్దుబాటు జరగడం వల్ల ఉపయోగం లేకపోయింది. ఉదాహరణకు స్కూలు అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉపాధ్యాయులను వారు చదివిన మెథడాలజిలో గణితం ఉందని గణిత ఉపాధ్యాయులు అవసరమైన చోటుకు సర్దుబాటు చేశారు. ఇంగ్లీష్ స్కూలు అసిస్టెంట్‌ను వారి మెథడాలజీ సోషల్ ఉందని సోషల్ ఉపాధ్యాయుడిగా సర్దుబాటు చేశారు. ఇదంతా అధికారులు నిర్బంధంగా మండల స్థాయిలో సర్దుబాటు చేయడం వల్ల వారు బోధించే సబ్జెక్టు కాగా వేరే సబ్జెక్టు బోధించవలసి రావడంతో అటువంటి ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. మండల స్థాయి సర్దుబాటు అనంతరం మిగిలిన వారికి డివిజనల్ స్థాయిలో సర్దుబాటుకు ఇష్టమైన చోటుకు వెళ్లడానికి అవకాశం ఇచ్చారు. అలా వెళ్లని వారికి జిల్లా స్థాయిలో వెళ్లే అవకాశం ఇచ్చారు. ఇలా కాకుండా అదే స్థానంలో ఉండవచ్చు. దీంతో చాలాచోట్ల ఉపాధ్యాయులు లేక బోధన కుంటుపడుతోంది. పది సెక్షన్లు దాటిన పాఠశాలల్లో సబ్టెక్టుకు ఇద్దరు ఉపాధ్యాయులు అవసరం అవుతుంది. గత ఏడాది మెగా డీఎస్సీ 2025లో పోస్టులు భర్తీలో ఎన్ని సెక్షన్‌లు ఉన్నప్పటికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే రెండు పోస్టు ఇవ్వలేదు. పది నుంచి 15 సెక్షన్‌లు ఉన్న పాఠశాలలలో ఒకే ఉపాధ్యాయుడు బోధించలేక బోధన కుంటుపడింది. దీనిపై అధికారులు స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు లేనిచోట్ల నిరుత్సాహంగా ఉన్నారు.