Share News

పెన్షన్‌ టైమ్‌

ABN , Publish Date - Jun 07 , 2026 | 12:54 AM

పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన బిక్కిన సాంబశివరావుకు కంటిచూపు తగ్గింది.

పెన్షన్‌ టైమ్‌

12 నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశం

పీజీఆర్‌ఎస్‌, కూటమి నేతల పరిష్కార వేదికల్లో విన్నపాలు

జిల్లాలో 25 వేల మంది లబ్ధిదారుల ఎదురుచూపు

ప్రభుత్వ నిర్ణయంతో హర్షం

పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన బిక్కిన సాంబశివరావుకు కంటిచూపు తగ్గింది. రోజువారీ పనులు చేయలేకపోతున్నాడు. ఉపాధి కరువై జీవనోపాధికి ఇబ్బంది పడుతున్నాడు. వృద్ధాప్య పింఛన్‌కు అర్హత ఉన్నా దరఖాస్తు చేసుకునే వీలు లేకపోవడంతో కలెక్టరేట్‌కు వచ్చి అర్జీ సమర్పిం చాడు. ఇప్పుడు కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాడు.

ఉండి మండలం మహదేవిపట్నానికి చెందిన షేక్‌ బాజీమ్‌ బీబీకి మెదడులో రక్తం గడ్డ కట్టింది. ఎడమ వైపు భాగం పూర్తిగా పని చేయడం లేదు. ఆమెకు వంద శాతం వైకల్యం ఉందని వైద్యులు నిర్ధారించారు. దీంతో తనకు దివ్యాంగ పెన్షన్‌ మంజూరు చేయా లని ఆమె కలెక్టరేట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇలా జిల్లావ్యా ప్తంగా వేలాది మంది పింఛన్ల కోసం పీజీఆర్‌ఎస్‌లోను, కూటమి నాయకులు ప్రజా దర్భార్‌ల్లోనూ దరఖాస్తు చేసుకున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 12వ తేదీకి రెండేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా అర్హులకు కొత్తగా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు పీజీఆర్‌ఎస్‌, సచివాలయాల్లో అంతా దరఖాస్తులు చేసుకున్నారు. కూటమి పార్టీల నేతలు నిర్వహించే పరిష్కార వేదికలోనూ విన్నవించుకున్నారు. ఈ లెక్కన ఒక్క మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే దాదాపు 25 వేల మంది అర్హులు కొత్త పెన్షన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నూతన పెన్షన్‌లకు అవకాశం ఇవ్వలేదు. పెన్షన్‌ పొందు తూ లబ్ధిదారుడు మరణిస్తే భార్యకు మాత్రమే పెన్షన్‌ బదిలీ చేశారు. ఇలా జిల్లాలో దాదాపు 2,300 మంది అర్హత సాధించారు. వారందరికీ వితంతు పెన్షన్‌లు మంజూరవుతున్నాయి. కానీ దివ్యాంగులు, 60 ఏళ్లు పూర్తయిన వృద్ధులకు కొత్త పెన్షన్లను కేటాయించలేదు. ప్రభుత్వం రెండేళ్లు అయిన సందర్భంగా ఆన్‌లైన్‌లో నమో దుకు అవకాశం ఇచ్చింది. ఇప్పటికే పీజీఆర్‌ ఎస్‌లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. కూటమి నేతలు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి అర్హతను నిర్ధారిస్తు న్నారు. వారందరికీ జూన్‌ 12 నుంచి ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయనుంది. అర్హుల నిరీక్షణ ఫలించనుంది.

కూటమిలోనే జోష్‌

కూటమి ప్రభుత్వంలోనే పెన్షన్‌ లబ్ధిదారులకు అధిక ప్రయోజనం చేకూరుతోంది. పెన్షన్‌ సొమ్మును పెంచుతున్నారు. గత ప్రభుత్వంలో ఏటా రూ.260 పెంచుతూ వచ్చారు. చివరి ఏడాది పెంచకుండానే ముగించారు. మరోవైపు 60 ఏళ్లు నిండిన అర్హులను పరిగణనలోకి తీసు కోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక పెన్షన్లను ఒకేసారి పెంచింది. వృద్ధులకు రూ.4 వేలు చేసింది. దివ్యాంగులకు రూ.6వేలు ఇస్తున్నారు. మంచంపైనే ఉండే బాధితులకు రూ.15 వేలు మంజూరు చేస్తున్నారు. గడచిన మూడేళ్ల నుంచి కొత్త వారికి పెన్షన్‌లు జారీ చేయలేదు. రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా జూన్‌ 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కూటమి నాయకులు దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. ఎమ్మెల్యేలు పెన్షన్‌ నమోదు విషయంలో కూటమి శ్రేణులను అప్ర మత్తం చేశారు. జిల్లాలో ప్రతినెలా 2,21,359 మందికి పెన్షన్‌లు మంజూరు చేస్తున్నారు. అందుకోసం ప్రభుత్వం రూ.96.77 కోట్లు కేటా యిస్తోంది. ఈ ఏడాది కొత్త పెన్షన్లు కలవను న్నాయి. మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న అర్హులకు ఇది ఊరటనిచ్చే సమాచారం.

దరఖాస్తు చేసుకుంటా

కొత్త పింఛన్‌ కోసం ఏడాది నుంచి ఎదురు చూస్తున్నా. ఆన్‌లైన్‌లో సైట్‌ ఓపెన్‌ కాగానే దరఖాస్తులు తీసుకుంటామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. గతంలో మాదిరి పింఛన్ల కోసం ఆర్జీలు తీసుకోవడం లేదు. ఈ నెలలో కొత్త పింఛన్లను మంజూరు చేస్తే నాకు పింఛన్‌ ఇస్తారని ఆశిస్తున్నా.

– మాడుగుల రమ్య, వితంతు పింఛను దరఖాస్తుదారు, తణుకు.

Updated Date - Jun 07 , 2026 | 12:54 AM