తారుమారు!
ABN , Publish Date - Jun 07 , 2026 | 12:51 AM
పశ్చిమాసి యాలో యుద్ధ సంక్షోభం ముగిసినా ఇంకా రోడ్లకు తారు కొరత కారణంగా జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులు నెలన్నరగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
జిల్లాలోఎక్కడి రోడ్డు పనులక్కడే..
ఠారెత్తిస్తున్న తారు ధరల ప్రభావం
నెలన్నర నుంచి పనుల్లో మందగమనం
అధికారుల్లో అయోమయం
పశ్చిమాసి యాలో యుద్ధ సంక్షోభం ముగిసినా ఇంకా రోడ్లకు తారు కొరత కారణంగా జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులు నెలన్నరగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పూర్తి కావాల్సిన రోడ్లు అథోగతిలో ఉండడంతో రోడ్లుపై రాళ్లు లేచి జిల్లాలో పలు ప్రాంతాల ప్రజలు ప్రత్యక్ష నరకం చవి చూస్తున్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న రోడ్డు పనులపై తారు కొరత ప్రభావం తీవ్రంగా పడింది. తారు ధర అమాంతంగా ఆకాశన్నంటుతుండటంతో కాంట్రాక్టర్లు ఎక్కడ పనులు అక్కడే నిలిపివేశారు. జిల్లాలో గతేడాది నవంబరు, డిసెంబరు నెలల నుంచి రోడ్లు భవనాలశాఖ రోడ్లు పనులకు రాష్ట్ర ప్రభుత్వం నాబార్డు, ప్లాన్, ఎండీఆర్, సాస్కి నిధుల కింద 121 కోట్ల 54 లక్షలతో 54 పనులు మంజూరు కాగా 29 పనులు పూర్త య్యాయి. ఇంకా రూ.53.39 కోట్ల విలువైన 24 పనులు పూర్తి కావా ల్సి ఉంది. పంచాయతీరాజ్ కింద మరో రూ.50 కోట్ల మేర పనులు ముందుకు సాగడం లేదు. పనులు వేగంగా పూర్తి చేయడానికి టెండర్లు షెడ్యూళ్లను ప్రభుత్వం కుదించింది. వర్షాలు పడేలోగా రోడ్లన్నీ సుందరంగా పూర్తి చేయాలని ఆదేశాలను జారీ చేసింది.
జిల్లాలో ఎక్కడ నిలిచిపోయాయంటే..
జిల్లాలో ఏలూరు నియోజకవర్గంలో పనులన్నీ పూర్త య్యాయి. దెందులూరు నాలుగు, చింతలపూడి ఐదు, పోలవరంలో ఏడు, ఉంగుటూరులో నాలుగు, కైకలూరులో ఐదు, నూజివీడులో రెండు చోట్ల కీలకమైన ప్రధాన రహ దారులు పనులకు బీటీ కింద తారు వేసి పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో బస్సుల్లో, వివిధ వాహనాల్లో ప్రయా ణించే ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరో
వైపు గుంతలు పడిన రోడ్ల మరమ్మతులు తారు కొరతతో చివరి దశలో నిలిచిపోయాయి. శుక్రవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో గుంతలు పడి న రోడ్లు ఈ నెలఖారులోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నాదెండ్ల ఆదేశాలు జారీ చేశారు. కాగా రుతుపవనాల రాకతో వర్షాలు పడే కాలం అయిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే ఇప్పుడున్న రాళ్లు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని కాంట్రాక్టర్లు మదన పడుతున్నారు.
రెట్టింపు ధరలో తారు.. కాంట్రాక్టర్లు బేజారు
యుద్ధం ముందుకు వరకు తారు టన్ను ధర రూ.41 వేల నుంచి రూ.42 వేలు మధ్య ఖరారు చేశారు. విశాఖ లోని హెచ్‌పీసీఎల్ నుంచి తారు సరఫరా అవుతుంది. ఇక్కడకు గల్ఫ్ దేశాల నుంచి సరఫరా కావాల్సిన తారు దిగుమతి కావడం లేదు. హోర్మూజ్ జలసంధి మూసివేతతో తారు ధర అమాంతంగా పెరిగి ప్రస్తుతం టన్ను రూ.92 వేలకు చేరింది. కిలోమీటరుకు సగటున 22 టన్నుల పడుతుంది. తారు కోసం వెచ్చించే ఖర్చు రెట్టింపు కావడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారు. అధికారులు ఒత్తిడి తెస్తున్న ముందుకు రావడం లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లిస్తే పనులు చేపడతామని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పనులన్నీ పూర్తి చేసే దిశగా అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఉన్నతస్థాయిలోనే సంప్రదింపులు
జిల్లాలో తారు కొరతతో నిలిచిన రోడ్లు పరిస్థితిపై చీఫ్ ఇంజనీర్ స్థాయిలోనే తారు సరఫరా చేసే కంపెనీలైన ఐవోసీఎల్,హెచ్‌పీసీఎల్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నారు. తారు రేట్లు పెరిగిన దానికి అదనంగా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు ఉంటుంది. త్వరలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాం.
– విజయరత్నం, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ
డబ్బులు కట్టినా.. సరఫరా లేదు
రెండు నెలల నుంచి తారు కొరత కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం. టన్నుకు రూ.40 వేలకు పైనే భారం పడింది. డబ్బులు కట్టినా ఆ మేరకు కంపెనీల నుంచి తారు సరఫరా కాక పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం తారు కొరత నివారణకు చర్యలు తీసు కుంటే పనులన్నీ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
– వి.సతీశ్, కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర ట్రెజరర్