Share News

భీమగరం

ABN , Publish Date - May 24 , 2026 | 01:04 AM

పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం వేడిసెగలు కక్కే ప్రాంతంగా రికార్డులకెక్కడం ఆందోళన కలిగిస్తోంది.

భీమగరం

ప్రపంచంలోనే 42వ స్థానం.. ఏక్యూఐ.ఇన్‌ వెబ్‌సైట్‌ వెల్లడి

పెరుగుతున్న గ్రీన్‌హౌస్‌

వాయువులు ఆందోళనకరం

45 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

కాంక్రీట్‌ జంగిల్‌.. పెరిగిన ఏసీలు, వాహనాల వినియోగం

ఆక్వా చెరువులతో

చౌడు బారుతున్న నేలలు

కనుమరుగవుతున్న చెట్లు.. కనిపించని మొక్కల పెంపకం

వేడి పెరగడానికి కారణాలెన్నో..

పచ్చని పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం వేడిసెగలు కక్కే ప్రాంతంగా రికార్డులకెక్కడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న టాప్‌–50 నగరాలలో ఈ పట్టణం 42వ స్థానంలో నిలి చిందని వాతావరణ అధ్యయన వెబ్‌సైట్‌ ఏక్యూఐ.ఇన్‌ వెల్లడించింది. శుక్రవారం ఉదయం 10 గంటల 50 నిమిషాలకు నమోదు చేసిన ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ జాబితాను ప్రకటించింది. వేడి నగరాల జాబితాలో ఈ పట్టణం కూడా చేరడంపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతున్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని అన్న అంశంపై చర్చ నడుస్తోంది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఓ వైపు గోదావరి నది ప్రవాహం.. మరోవైపు సముద్ర తీరం.. ఇంకోపక్క కొల్లేరు సరస్సు.. మధ్య కాల్వలతో అలరారుతూ పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతు వుంటుంది పశ్చిమ గోదావరి జిల్లా. ఇంతటి చల్లటి ప్రదేశంలో వేడి సెగలు పుట్టే పరిస్థితి దాపురించడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఇరుకైన పట్టణం, కాంక్రీట్‌ జంగిల్‌, ఎత్తైన బహుళ అంతస్తుల భవనాలు, చుట్టూ ఆక్వా చెరువులు, అత్యధిక వాహనాల రద్దీ.. విడుదలవుతున్న కార్బన్‌ వాయువులు, పెద్దగా కనిపించని చెట్లు.. మొదలైన ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి.

విస్తరించిన పట్టణం.. కాంక్రీట్‌ జంగిల్‌

జిల్లా కేంద్రం భీమవరం విద్య, వైద్య, వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఊరు బాగా విస్తరించింది. జిల్లాలోనే మారుమూల ప్రాంతాల ప్రజలు పిల్లల చదువుల కోసం, వ్యాపార, ఉద్యోగాల కోసం ఉన్న ఊరి నుంచి ఇక్కడకు వలస వస్తుంటారు. ఈ కారణంగా గడిచిన రెండు దశాబ్దాలుగా ఊరు బాగా విస్తరించింది. పట్టణాన్ని ఆనుకుని చుట్టుపక్కల జనాభా రెండు నుంచి మూడు లక్షల వరకు వుంటుంది. పట్టణం దాని చుట్టుపక్కల సుమారు 50 నుంచి 60 వేల వరకు గృహాలు వుంటాయి. జనాభా పెరగడంతో వసతి సమస్య ఏర్పడింది. వ్యక్తిగత ఇళ్ల స్థానంలో బహుళ అంతస్తుల భవనాలు ఏర్పడ్డాయి. ఇవి సుమారు రెండు వేల పైమాటే. ఒకదానికొకటి ఆనించి వుండడంతో గాలి చొరబడని కాంక్రీట్‌ జంగిల్‌గా మారింది. మరోవైపు ఒకప్పటి మట్టి రోడ్ల స్థానంలో సిమెంట్‌ రోడ్లు, డ్రెయిన్లు వచ్చాయి. నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు. ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలన్న స్పృహ ఎంత మందికి వున్నదో చెప్పడం కూడా కష్టమే. ఇక వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రతి ఇంటిలోనూ ఏసీల వినియోగం పెరిగింది. ఇది విడుదల చేసే వేడి కూడా వాతావరణంలో హీట్‌ పెరిగేందుకు కారణమవుతోంది.

వాహనాల తాకిడి..

వెదజల్లుతున్న కాలుష్యం

ఇక వాహనాల తాకిడి తక్కువేమీ కాదు. పట్టణ పరిధిలోని వాహనాల సంఖ్యే లక్షకు పైమాట. ఒక్కో కుటుంబంలో బైక్‌ తప్పనిసరిగా వుంది. ఇద్దరు వుంటే రెండు బైక్‌లు, కార్లు అదనం. 70 శాతానికిపైగా బైక్‌లే వున్నాయి. ఇక వ్యాపా రులు, ఉద్యోగులు, ఆక్వా రైతుల్లో అత్యధిక మందికి ఇప్పుడు కారు అవసరం ఏర్పడింది. ఇవి కాకుండా రవాణా వాహనాలు, ఆటోలు, బస్సులు, లారీలు అదనం. ఇవి కాకుండా నిత్యం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు.. అవి విడుదల చేసే కార్పన్‌ డయాక్సైడ్‌తో కాలుష్యం పెరుగుతోంది. ఆక్వా కల్చర్‌ విస్తరించినప్పటి నుంచి పచ్చని పొలాల స్థానంలో రొయ్యలు, చేపల చెరువుల విస్తరణ పెరిగింది. రొయ్యల చెరువుల కారణంగా నేల చౌడు బారుతోంది. భీమవరం చుట్టుపక్కల వేలాది ఎకరాల్లో ఆక్వా చెరువులు విస్తరించాయి. ఇందులోని కలుషిత జలాలను నేరుగా కాల్వల్లోకి వదిలేయడంతో అవి భూమిలోకి ఇంకి గాలిలో తేమ శాతాన్ని హరిస్తున్నాయి. పెరుగుతున్న కాలుష్యాన్ని పీల్చుకుని స్వచ్ఛమైన గాలిని అందించే చెట్లు లేకపోవడం హీట్‌ వేవ్‌స్‌ పెరగడానికి మరో కారణం. భీమవరం ప్రాంతంలో ఒకప్పుడు పచ్చని చెట్లు ఉండేవి. నగర విస్తరణలో భాగంగా ఎక్కడకక్కడ చెట్లను కొట్టేయడం, కొత్తగా మొక్కలను పెంచక పోవడంతో ఈ సమస్య జఠిలంగా మారుతోంది. పంట పొలాలు ఉంటే వాటి గట్లపైనా చెట్లు ఉండేవి. ఇక్కడ ఎక్కువగా ఆక్వా చెరువులు విస్తరించడంతో చాలా వరకు చెట్లు కనుమరుగయ్యాయి.

గ్రీస్‌ హౌస్‌ వాయువులను తగ్గించాలి

వాతావరణంలో గ్రీన్‌హౌస్‌ వాయువుల శాతం సగటున 15 సెంటీగ్రేడ్‌ డిగ్రీల వరకు వుండాలి. కాని, వీటి శాతం పెరగడంతో భూమి వేడెక్కుతోంది. ఇందుకు వాహనాల వల్ల విడుదలయ్యే కార్బన్‌డయాక్సైడ్‌, ఆక్వా సాగు, రసాయన ఎరువులు వాడకం ద్వారా వచ్చే మిథేన్‌, నైట్రస్‌ ఆక్సైడ్‌, ఏసీలు, రిప్రిజిరేటర్ల వాడకం ద్వారా ప్లోరినేటెడ్‌ వాయువులు విడుదల పెరగడమే కారణం. అదే ఇప్పుడు భీమవరం పట్టణం వేడి ప్రాంతంగా నమోదు కావడానికి కారణమై ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిని తగ్గించాలంటే చుట్టూ చెట్లు వుండాలి. ఇవి గ్రీన్‌ హౌస్‌ వాయువులను ఆకర్షించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి.

సేవ్‌ భీమవరం

ఇప్పుడు పట్టణాన్ని వేడి, రకరకాల కాలుష్యాల నుంచి కాపాడుకునేందుకు మన ముందువున్న ఏకైక లక్ష్యం పచ్చని చెట్లను పెంచడం. నీరు, గాలి, వాతావరణం కలుషితం కాకుండా చూసుకోవడం. ఆ దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర వంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇది మరింత పెరగాలి. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించాలి. ప్రతి ఇంటిలోను ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. ఏసీల వాడకాన్ని నిరోధించేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి చిన్న పనికి వాహనాల వినియోగం తగ్గించాలి. వారంలో ఒకరోజు నో వెహికల్‌ డే పాటించాలని ఇప్పటికే ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వీటిని ప్రతి ఒక్కరూ పాటించాలి. సేవ్‌ భీమవరానికి ఆచరణలో అడుగులు కదపాలి.

చెట్లతోనే రక్షణ

అత్యంత వేడి గాలులు వున్న ప్రాంతంగా భీమవరం కనిపించడం ఆందోళన కలిగించే అంశం. ఇందుకు సీసీ రహదారులు, ఆటోమొబైల్‌ వాహనాల వినియోగం, శీతలాన్నిచ్చే ఉపకరణాల వినియోగం వంటివి కారణాలని చెప్పవచ్చు. వీటిని అరికట్టలేం. కానీ చెట్లు పెంచుకుంటే వేడికి పరిష్కారం లభిస్తుంది. గ్రీన్‌ హౌస్‌ వాయువులను వాతావరణంలో తక్కువ చేయడానికి చెట్లు ఎంతగానో ఉపయోగపడ తాయి. వాటిని ఈ రోజుల్లో విస్మరిస్తున్నాం. అందుకే ప్రభుత్వం రాష్ట్రంలో 50 శాతం పచ్చదన ప్రాంతం ఉండేలా ప్రణాళిక చేస్తోంది. భీమవరంలోనూ ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.

– డాక్టర్‌ పి.రఘురామ్‌, వెట్‌సెంటర్‌ ప్రతినిధి, ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాల, భీమవరం

Updated Date - May 24 , 2026 | 01:04 AM