గొంతు తడపనున్న గోదావరి
ABN , Publish Date - Jun 24 , 2026 | 12:37 AM
పశ్చిమలో పల్లెవాసులకు గోదారమ్మ గొంతు తడపనుంది. వాటర్ టిన్నులు కొనుగోలు చేసే దుస్థితికి స్వస్తి పలకనుంది.
2057కి సరిపడా పల్లెలకు మంచినీరు
విజ్జేశ్వరం నుంచి రక్షిత
నీరు నేరుగా సరఫరా
జిల్లాలో 50 బ్యాలెన్సింగ్ ఓవర్‌హెడ్ రిజర్వాయర్లు
అక్కడి నుంచే నేరుగా పంచాయతీ ఓహెచ్‌ఎస్‌ఆర్‌లకు తరలింపు
తర్వాత కుళాయిలకు సరఫరా
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పశ్చిమలో పల్లెవాసులకు గోదారమ్మ గొంతు తడపనుంది. వాటర్ టిన్నులు కొనుగోలు చేసే దుస్థితికి స్వస్తి పలకనుంది. విజ్జేశ్వరం వద్ద శుద్ధి చేసిన గోదావరి జలాలను పైప్‌లైన్ ద్వారా పల్లెలకు పంపిణీ చేసే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతోంది. పంచాయతీల్లో ఫిల్టర్ బెడ్‌లతో పనిలేదు. వాటికి మరమ్మతులు చేయాలన్న తల నొప్పులుండవు. గ్రామాల్లో సంపులతో పనిలేదు. ఓవర్‌హెడ్ రిజర్వాయర్‌లతోనే పైప్‌లైన్‌ల ద్వారా కుళాయిలకు మంచినీరు అందించనున్నారు. చెరువులు మురుగు దేలాయనో... పసర్లు పట్టాయనో వేసవిలో అడుగంటి పోయాయనో బెంగ అవసరం లేదు. విజ్జేశ్వరం వద్ద శుద్ధి చేసిన జలాలు పైప్‌లైన్ ద్వారా కుళాయిలకు అందించే ప్రాజెక్ట్ పనులు నిర్వహిస్తున్నారు. రానున్న మూడు దశాబ్దాల దాకా పల్లె ప్రజలకు మంచినీటి ఇబ్బంది ఉండదు. భూగర్భ జలాలనే శుద్ధి చేసి వాటర్ టిన్నుల ద్వారా విక్రయించడం జిల్లాలో పెద్ద వ్యాపారంగా మారింది. గోదావరి జిల్లా అనే పేరుకే తప్ప కొన్నేళ్లుగా తాగునీటి కోసం గోదావరి జలాలు ఉపయోగ పడడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పైప్‌లైన్ పనులు ప్రారంభించింది .రూ.1400 కోట్లు నిధులు కేటాయించింది. గ్రామాల వద్ద ఉన్న ఓహెచ్‌ఆర్‌ల వరకు పైప్‌లైన్‌లు కొత్తగా వేయనున్నారు. అలాగే గ్రామాల్లోనూ అవసరమైన చోట అంతర్గత పైప్ లైన్‌లు వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
క్లస్టర్లుగా గ్రామాలు
జిల్లాలో భీమవరం, తణుకు, ఆచంట ,నర్సాపురం, ఆచంట, ఉండి నియోజకవర్గాలకు తాగునీటి అవస రాలను వాటర్‌గ్రిడ్ తీర్చనుంది. జిల్లాలో గ్రామాలను 40 క్లస్టర్‌లుగా విభజించారు.వాటి పరిధిలో 40 ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్యాయర్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 50 సంప్‌లను నిర్మించనున్నారు. విజ్జేశ్వరం వద్ద శుద్ధి అయిన జలాలను క్లస్టర్‌ల వద్ద సంప్‌లకు మళ్లిస్తారు.సంపుల నుంచి 40 ఓవర్ హెడ్ బ్యాలెన్స్ రిజర్వా యర్‌లలో నీటిని భర్తీ చేస్తారు. వాటినుంచి గ్రావిటేషన్ ద్వారా నేరుగా గ్రామాల్లోని ఓవర్‌హెడ్ రిజర్వాయర్‌లకు నీటిని పంపిణీ చేస్తారు. గ్రామాల్లో రిజర్వాయర్‌ల నుంచి కుళాయిలకు నీటిని సరఫరా చేస్తారు. విజ్జేశ్వరం వద్ద శుద్ధి అయిన జలాలు ఎక్కడా కలుషితం కాకుండా పైప్‌లైన్‌ల ద్వారా కుళాయిల వరకు చేరుకుంటాయి. వాటిని తాగునీటి అవసరాలకు వినియోగించు కోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వాటర్ ప్లాంట్ల వద్ద శుద్ధి చేసిన భూగర్భ జలాలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఇక ఉండదు. రెండేళ్ల వ్యవధిలో గ్రిడ్ పూర్తిచేయాలి.ఇప్పటికే ఆరు నెలలు పూర్తయ్యిది.మరో ఏడాదిన్నరలో అందు బాటులోకి తీసుకొచ్చేలా గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
ప్రాజెక్ట్ వివరాలివే
వ్యయం రూ.1400 కోట్లు
మండలాలు 16
ఏడాదికి అసరమైన గోదావరి జలాలు 1.82 టీఎంసీలు
ప్రతిరోజు పంపిణీ చేసే శుద్ధి జలాలు 15.50 కోట్ల లీటర్లు
ప్రాజెక్ట్ డిజైన్ కాల పరమితి 30 ఏళ్లు
జిల్లాలో నిర్మించే సంప్‌లు 50
ఓవర్‌హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లు 40
గ్రామాలకు వేసే పైప్‌లైన్ విస్తీర్ణం 1929.19 కి.మీ
గ్రామాల్లో పంపిణీ పైప్‌లైన్ నెట్ వర్క్ 733.20 కి.మీ
ప్రస్తుతం ఉన్న కుళాయిలు 3,29,137
కొత్తగా ఏర్పాటు చేయనున్న కుళాయిలు 40,000