మాకు న్యాయం చేయండి తల్లి!
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:03 AM
న్యాయం కోసం నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఓ వృద్ధ దంపతులు సోమవారం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ కారును అడ్డగించి తమ ఆవేదన వ్యక్తం చేశారు.
వృద్ధ దంపతుల ఆవేదన.. కలెక్టర్ కారు అడ్డగింత
ఏలూరు రూరల్, జూలై 27, (ఆంధ్రజ్యోతి):
న్యాయం కోసం నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో ఓ వృద్ధ దంపతులు సోమవారం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ కారును అడ్డగించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. చాట్రాయి మండలం గుడి పాడుకు చెందిన కొమ్మన గోపాల రావు, వరలక్ష్మి దంపతులు తమకు ఉన్న వ్యవ సాయ భూమిలో ఎక్కువ భాగాన్ని కుమారులకు, కొంత కుమార్తెకు రాశారు. తమ జీవనాధారంగా ఉంచుకున్న 80 సెంట్ల భూమిని కుమారులకే కౌలుకి ఇచ్చాడు. కౌలు చెల్లిం చకుండా, ఉన్న పొలాన్ని తమకు రాసివ్వా లంటూ ఒత్తిడి చేస్తుండగా వారు నిరాకరిం చారు. దీంతో కుమారులు తమను ఇంటి నుంచి బయటకు పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వారు కుక్కునూరు వృద్ధా శ్రమంలో ఆశ్రయం పొందుతూ న్యాయం చేయాలని నాలుగేళ్లుగా నూజివీడు లోని అధికారులను ఆశ్రయిస్తున్నా సమస్య పరిష్కారం కాలేదన్నారు. గతంలోనే కలెక్టర్‌ను కలిసి విన్నవించగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించినా ఫలితం లేదని వాపో యారు. సోమవారం పీజీఆర్‌ఎస్ ముగించుకు ని వెళ్తున్న కలెక్టర్ వెట్రిసెల్వి కారుకు అడ్డంగా బైఠాయించి ‘మాకు న్యాయం చేయండి తల్లి’ అంటూ వేడుకున్నారు. కలెక్టర్ వారిని సము దాయించి సమస్యను పూర్తిగా పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
పీజీఆర్‌ఎస్‌లో మహిళకు అస్వస్థత
ఏలూరు పవర్‌పేటకు చెందిన వసంత తన ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం అందలేదని ఫిర్యాదు చేసేందుకు పీజీఆర్‌ఎస్‌కు వచ్చారు. ఆమె అనారోగ్యంగా ఉండడంతో ఎక్కువసేపు క్యూలో నిలబడలేక కళ్లు తిరిగి నేలపై పడిపోగా 108లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అర్జీలకు శాశ్వత పరిష్కారం : కలెక్టర్
పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా స్వీకరించిన ప్రతి అర్జీకి నిర్ణీత గడువులోపు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి మొత్తం 334 వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి, సమస్యలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు. జేసీ అభిషేక్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, డీఆర్వో శ్రీదేవి, విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, ఆర్డీవో లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నిర్వహించిన జూమ్ సమీక్షలో అధికారులను హెచ్చరించారు.