Share News

సమగ్రశిక్షలో ఏం జరుగుతోంది?!

ABN , Publish Date - May 14 , 2026 | 12:31 AM

సమగ్రశిక్ష జిల్లా కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆకస్మికంగా సందర్శించడం చర్చనీయాంశమైంది.

సమగ్రశిక్షలో ఏం జరుగుతోంది?!

కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్‌

అదే సమయంలో ఆర్థిక అంశాల ఫైళ్లపై అధికారుల బృందం ఆడిట్‌

ఏలూరు అర్బన్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): సమగ్రశిక్ష జిల్లా కార్యాలయాన్ని బుధవారం మధ్యాహ్నం కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆకస్మికంగా సందర్శించడం చర్చనీయాంశమైంది. స్థానిక వెంకట్రావుపేట మున్సిపల్‌ స్కూలులో నిర్వహించిన ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌లో పాల్గొన్న అనంతరం ఆక్కడినుంచి ఎస్‌ఎస్‌ఏ కార్యాలయానికి చేరుకుని పలు విభాగాలను సందర్శించారు. సెక్షన్ల వారీగా కార్యకలాపాల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, కొన్నిచోట్ల ఉద్యోగులు గుంపుగా ఉండడాన్ని ప్రశ్నించినట్టు తెలిసింది. జిల్లా లోని కస్తూర్బా గాంధీ బాలికావిద్యాలయ (కేజీబీవీ)లలో పనిచేస్తున్న కాం ట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను సమగ్రశిక్ష జిల్లా కార్యాలయ అధికార వర్గాలు వేధిస్తుండటం, కేజీబీవీలకు మెయింటెనెన్సు గ్రాంట్లుగా ప్రభుత్వం విడుదలచేసిన నిధుల్లో మిగిలిపోయిన నిధులకు చెక్కులను ఓ అధికారి తీసుకెళ్లడం, కాంట్రాక్టు సిబ్బందిని విధులనుంచి తొలగించకుండా (టెర్మి నేట్‌ చేయకుండా) ఉండేందుకు సిబ్బంది నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ఏ కార్యాలయానికి ఆకస్మికంగా రావడం చర్చనీయాంశమైంది. అదే సమయం లో సమగ్రశిక్షలో వివిధ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన బిల్లులు, ఫైళ్లను తనిఖీచేసేందుకు అధికారుల బృందమొకటి ఆడిట్‌ చేపట్టడం గమనార్హం. ఆడిట్‌లో ఏవైనా అవకతవకలు వెలుగులోకి వచ్చిందీ, లేనిదీ తెలియరాలేదు. మొత్తంమీద ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో కలెక్టర్‌ సుమారు 10 నిమిషాలు ఉన్నారు. కాగా అవినీతి ఆరోపణలు, కాంట్రాక్టు సిబ్బందిపై వేధింపులు, తదితర ఆరోపణలపై వాస్తవాలను తెలుసుకునేందుకు బుధ వారం ఉదయం వేలేరు, కుక్కునూరు, వేలేరుపాడు కేజీబీవీల స్పెషలాఫీసర్లను పిలిపించుకుని జిల్లా ఉన్నతాధికారి ఒకరు మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎటువంటి ధ్రువీకరణ లేదు. మొత్తంమీద కేజీబీవీల విషయంతో పాటు, మరిన్ని ఆరోపణలపై తుది నిర్ధారణల తర్వాత సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టులో ఒకరిద్దరిపై తీవ్రచర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Updated Date - May 14 , 2026 | 12:31 AM