కన్నుల పండువగా శ్రీనివాస కల్యాణం
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:10 AM
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాసపురం రోడ్డులోని రాములమ్మ చెలకలో శ్రీనివాస కల్యాణం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది.
జంగారెడ్డిగూడెం, జనవరి 9(ఆంధ్రజ్యోతి):తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాసపురం రోడ్డులోని రాములమ్మ చెలకలో శ్రీనివాస కల్యాణం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. పట్టణానికి చెందిన ఇనగడప వీర రామాంజనేయులు దంపతులు ఇంటివద్ద స్వామివారి ఉత్సవ మూర్తులకు వేద పండితులు అభిషేకం నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్ఛరణలు, మేళ తాళాలతో శోభా యాత్రగా కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు టీటీడీకి చెందిన వేద పండితులు వైభవంగా కల్యా ణం నిర్వహించారు. తొలుత చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి స్వామి వారి కల్యాణాన్ని తిలకించి, వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. కార్యక్రమంలో టీటీడీ వేద పండితులు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కొండ్రెడ్డి కిశోర్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రావూరి కృష్ణ, కూటమి నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, రాజాన పండు, చెరుకూరి శ్రీధర్, వలవల తాతాజీ, గురుజు ఉమా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.