Share News

రఘురామే లక్ష్యమా..?

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:09 AM

ఆకివీడు పెదపేట రామాలయం వద్ద ఉద్రిక్తతల వెనుక డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

రఘురామే లక్ష్యమా..?
పెదపేట రామాలయం వద్ద బైఠాయింపు

రామాలయాన్ని అడ్డుకునే ప్రయత్నమా?

పెదపేట ఘటనలో బయట వ్యక్తులు ఎవరు ?

కత్తులు, కర్రలతో భయోత్పాతం

పోలీసు నిఘా ఏమైనట్టు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఆకివీడు పెదపేట రామాలయం వద్ద ఉద్రిక్తతల వెనుక డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఆయన కాన్వాయ్‌ను ఆందోళనకారులు అడుగడుగునా అడ్డుకోవడం.. దాడులకు తెగబడడం వెనుక నిఘా వైఫల్యం తేట తెల్లమవుతోంది. నియోజకవర్గంలో సీసీ కెమేరాలు భారీ సంఖ్యలో ఏర్పాటుచేసినా.. రెండు వారాలుగా పోలీసు పికెట్‌ జరుగుతున్నా.. శుక్రవారం వందలాది మంది ఇతర ప్రాంతాలకు చెందిన వారు రావడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించినా.. ఆందోళనకారులు కూటమి శ్రేణులపై దాడులు చేస్తున్నప్పుడు వారిని సరిగా అడ్డుకోలేదని విమర్శలు విని పిస్తున్నాయి. రామాలయం వద్దంటూ అక్కడ స్థానిక క్రైస్తవులు అభ్యంతరం తెలపడంతో వివాదం ప్రారంభమైంది. డిప్యూటీ స్పీకర్‌ రామాలయాన్ని పునరుద్ధరిస్తామంటూ ప్రకటించారు. పలుమార్లు ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో పేద పేటకు చెందిన స్థానికులు అక్కడ గొంతాలమ్మ ఆలయం నిర్మించా లంటూ కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం రఘురామకృష్ణంరాజు పెదపేట రామాలయం లోని శ్రీరాముని దర్శించుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ తలెత్తింది. బయట వ్యక్తులు అక్కడకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. రామాలయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో మేకులతో ఉన్న కర్రలు, కత్తులతో అక్కడ గుమిగూడినట్టు స్థానికులు చెబుతున్నారు. వారంతా గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు మందును సేవించారంటూ రామాలయ అనుకూల వర్గం అనుమానిస్తోంది. అందుకు తగ్గట్టుగానే అక్కడకు చేరుకున్న మూక వ్యవ హరించింది. దాడికి పాల్పడింది. ఇంతలా ఘటన జరగడానికి ముందస్తు ప్రణాళిక ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రఘురామ ఆల యానికి చేరుకునే సరికి బయట వ్యక్తులు అక్కడ గుమిగూడారు. స్థానిక దళితుల ముసుగులో స్థానికేతరులు అంతలా వస్తుంటే పోలీసు వర్గాలు ఎందుకు ముదుగా పసిగట్టలేకపోయాయన్నది చర్చకు దారితీస్తోంది. నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? ఇది పోలీసు వైఫల్యమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. ముందస్తు వ్యూహరచనతో దాడులకు పాల్పడడంపై ఇప్పుడు ఆకివీడులో ఆందోళన నెలకొంది. దీని వెనుక ఎవరి హస్తం ఉందనే దానిపైనా చర్చ నడుస్తోంది. నిఘా వర్గంలో పనిచేసిన ఓ మాజీ పోలీస్‌ అధికారి హస్తం ఉండడం వల్లే అల్లరి మూకలు బయట నుంచి చేరుకుని రామాలయం వద్ద దాడులకు పాల్పడుతున్నాయన్న అనుమానం ఆకివీడు ప్రజల్లో బలంగా నాటుకుంది. రఘురామ లక్ష్యంగానే దాడి జరిగినట్టు అంతా భావిస్తున్నారు.

భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు శుక్రవారం రాత్రి పరామర్శించారు. అనిల్‌ కుమార్‌, వెజ్జు నాగ సాయి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, చలమలశెట్టి చంద్రశేఖర్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 12:09 AM