Share News

నరసాపురం పురపాలకానికి స్పెషల్‌ గ్రేడ్‌

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:46 AM

నరసాపురం పురపాలక సంఘానికి స్పెషల్‌ గ్రేడ్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పురపాలక సంఘం గ్రేడ్‌–1 పురపాలకంగా ఉంది.

నరసాపురం పురపాలకానికి స్పెషల్‌ గ్రేడ్‌
నరసాపురం పట్టణంలో పురపాలక కార్యాలయం

మారనున్న పట్టణ రూపురేఖలు 8 పెరగనున్న నిధులు

నరసాపురం, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): నరసాపురం పురపాలక సంఘానికి స్పెషల్‌ గ్రేడ్‌గా గుర్తిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పురపాలక సంఘం గ్రేడ్‌–1 పురపాలకంగా ఉంది. దీని హోదాను పెంచాలని గత ఏడాది నుంచి అధికారులు, నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, తణుకు పురపాలక సంఘాలను స్పెషల్‌ గ్రేడ్‌గా మార్చింది. ఇదే క్రమంలో నరసాపురం కూడా స్పెషల్‌ గ్రేడ్‌ అవుతుందని ఎదురు చూస్తూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జీవో నరసాపురానికి చోటు దక్కడంపై ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. 1960లో నగర పంచాయతీగా ఏర్పడింది. అప్పటినుంచి ఆదాయాన్ని, వనరుల్ని పెంచుకుంటూ మూడో గ్రేడ్‌, తరువాత గ్రేడ్‌–1గా అప్‌గ్రేడ్‌ అయింది. ప్రస్తుతం పట్టణ పరిధిలో 31 వార్డులు ఉన్నాయి. సుమారు 70 వేల మంది జనాభా ఉన్నారు. పట్టణ పరిధి 12కిలోమీటర్ల విస్తరించింది. సుమారు 18వేలు నివాసాలు ఉన్నాయి. ఏటా పురపాలక సంఘానికి పలు పన్నుల రూపంలో రూ.16 కోట్లుపైనే ఆదాయం వస్తుంది. బ్రిటిష్‌ హయాం నుంచి సబ్‌ డివిజన్‌ కేంద్రంగా ఉంటూ వస్తున్నా ఇప్పటి వరకు స్పెషల్‌ గ్రేడ్‌ కాలేకపోయింది. ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేయడంతో పురపాలక రూపు రేఖలు మారనున్నాయి. ఉద్యోగుల సంఖ్య పెరగనుంది. కమిషనర్‌గా ఇక నుంచి స్పెషల్‌ గ్రేడ్‌ అధికారినే నియమిస్తారు. పలు పథకాల కింద ప్రభుత్వం ఇచ్చే నిధులు పెరగనున్నాయి. రాష్ట్ర విభజన తరువాత చేపట్టిన అభివృద్ధి పనులతో పట్టణ పరిధి పెరిగింది. ప్రధానంగా 216 జాతీయ రహదారి తీరం వెంబడి వెళ్లడంతో గ్రామాలతో పట్టణం అనుసంధానమైంది. ఇటీవల కొన్ని గ్రామాలను పురపాలకంలో విలీనం చేయాలని ప్రతిపాదనలు కూడా పరిశీలించారు. ఇటు రైల్వేస్టేషన్‌ త్వరలో జంక్షన్‌గా మారనుంది. వీటన్నంటికి తోడు నరసాపురం అనగానే అందరికి గుర్తొచ్చేది విద్యా సంస్థలు. ఇంజనీరింగ్‌ కాలేజీతోపాటు వైఎన్‌ కళాశాల, ఆక్వా యూని వర్సిటీలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.

పట్టణం మరింత అభివృద్ధి

గత ప్రభుత్వ హయాంలోనే స్పెషల్‌ గ్రేడ్‌గా చేసే అవకాశం ఉన్నప్పటికీ నోచుకోలేదు. కూటమి అధికారంలోకి రాగానే అర్హత ఉన్న అన్ని పురపాలక సంఘాల్ని ఆప్‌గ్రేడ్‌ చేసింది. అందులో నరసాపురం పురపాలకానికి చోటు దక్కింది. స్పెషల్‌ గ్రేడ్‌ రావడంతో పురపాలక సంఘం రూపురేఖలు మారనున్నాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి వచ్చే నిధులు పెరుగుతాయి. పట్టణ పరిధి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది నియోజకవర్గం మరింత ఆభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.

– బొమ్మిడి నాయకర్‌, విప్‌, నరసాపురం

Updated Date - Aug 11 , 2026 | 12:46 AM