Share News

ఎరువుల యాప్‌

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:37 AM

ఎరువులు విక్రయాలల్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే యాప్‌ను అమలు చేయనుంది.

ఎరువుల యాప్‌

కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆవిష్కరణ

దేశమంతా ఒకే విధానం అమలు

రాష్ట్ర ప్రభుత్వ యాప్‌కు స్వస్తి

అక్టోబరు 1నుంచి అమలు

ఎరువులు విక్రయాలల్లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే యాప్‌ను అమలు చేయనుంది. ప్రధానంగా యూరియా, డీఏపీలను సెంట్రల్‌ యాప్‌లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. గడచిన ఖరీఫ్‌లో స్టేట్‌ యాప్‌ ద్వారా ఎరువులను విక్రయించారు. అక్టోబరు 1నుంచి సెంట్రల్‌ యాప్‌ ద్వారా అమ్మకాలు జరపనున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

వాస్తవంగా జిల్లాలో ఖరీఫ్‌లో ఎరువుల సీజన్‌ ముగిసింది. కొద్దిపాటి యూరియా మాత్రమే మరోసారి వినియోగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసే సెంట్రల్‌ యాప్‌ రాబోయే రబీ సీజన్‌లో తప్పనిసరి కానుంది. యూ రియా విచ్చలవిడి వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం యాప్‌లో విక్రయాలను తెరపైకి తెచ్చింది. జిల్లాలో ఎకరాకు రెండు బస్తాలు మాత్రమే యూరియా సరఫరా చేశారు. డీఏపీ విషయానికి వస్తే ఎకరాకు అర బస్తా విక్రయించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. జిల్లాలో వినియోగించే ప్రతీ కాంప్లెక్స్‌ ఎరువు ధర కనిష్ఠంగా రూ.2,200 నుంచి గరిష్ఠంగా రూ.2,400 వరకు ధర పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎరువుల రాయితీని యూరి యా, డీఏపీకి మాత్రమే అమలు చేస్తోంది. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరలు పెరిగినా యూరియా, డీఏపీ ధరలను నిలకడగా ఉండేలా రాయితీ భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. వీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించేందుకు యాప్‌లో విక్రయించాలని షరతు విధించింది. ఖరీఫ్‌లో యూరియా, డీఏపీ ధరలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన యాప్‌లోనే విక్రయించారు. జిల్లాలో 2.20 లక్షల ఎకరాలల్లో వరి సాగు చేస్తుండగా 4.40 లక్షల టన్నుల యారియా యాప్‌లోనే విక్రయించారు. ఇనాళ్లు రైతులు డీఏపీ అంతగా వినియోగంచలేదు. ఇతర కాం ప్లెక్స్‌ ఎరువులపై ఆసక్తి చూపించారు. అయినాసరే జిల్లాలో సుమారు 5 వేల టన్నుల పైగా డీఏసీ అమ్ముడుపోయింది. రానున్న రబీలో మరింత అధికంగా ఉంటుంది.

సమస్యలు సమసేనా..?

యాప్‌లోనే యూరియా, డీఏపీ అమ్మకాలతో ఎన్నో సమస్యలు తెరపైకి వచ్చాయి. సక్రమంగా సర్వర్‌ పనిచెయ్యలేదు. రైతులు ఈ పోస్‌ వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లా సరిహద్దు గ్రామాల రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడ్డారు. పొరుగు జిల్లాలో భూములు ఉంటే ఇక్కడ ఎరువుల విక్రయించలేదు. అలాగని భూములున్న గ్రామాల్లో కూడా ఎరువుల విషయంలో చుక్కెదురైంది. తాడేపల్లిగూడెంలో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన రైతులు ఎరువులు కొనుగోలు చేసుకుంటారు. ఇది యాప్‌ లో సాధ్య పడలేదు. ఇతర జిల్లా రైతులకు ఎరువులు విక్రయించలేమంటూ వ్యాపారులు చేతులెత్తేశారు. సొసైటీలలో కూడా అదే పరిస్ధితి నెలకొంది. సరిహద్దు జిల్లా గ్రామాల రైతులకు ఇక్కడ సొసైటీలు రుణాలు కల్పిస్తున్నాయి. సొసైటీలు దగ్గరగా ఉన్నాయంటూ ఇతర జిల్లాల రైతులు మన జిల్లా పరిధిలోని సొసైటీలల్లో ఎరువులు కొనుగోలు చెయ్యటం, రుణాలు తీసుకోవడం ఆనవాయితీ. యూరి యా, డీఏపీ అమ్మకాలను యాప్‌తో ముడి వెయ్యడంతో ఇవేమీ సాధ్యం కాలేదు. ఇక నుంచి సెంట్రల్‌ యాప్‌ అమలులోకి రానుంది. అప్పుడైనా సరే ఎరువుల విక్రయాల సమస్యలు తొలగనున్నాయా, లేక మరింత అధికం కానున్నాయా అంటూ రైతులు ఆలోచన చేస్తున్నారు.

Updated Date - Sep 14 , 2026 | 12:37 AM