Share News

అత్యాధునిక సాంకేతికతతో నిరంతర నిఘా

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:32 AM

అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ స్థానిక ఎన్నికల నామినేషన్‌ కేంద్రాలపై ఏలూరు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతర నిఘా ఉంచామని ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ తెలిపారు.

అత్యాధునిక సాంకేతికతతో నిరంతర నిఘా
ఏలూరు పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సీసీ టీవీలను పరిశీలిస్తున్న ఎస్పీ కిశోర్‌

ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌

ఏలూరు క్రైం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ స్థానిక ఎన్నికల నామినేషన్‌ కేంద్రాలపై ఏలూరు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతర నిఘా ఉంచామని ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ తెలిపారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ఏలూరు జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజిలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ప్రత్యేక్ష పర్యవేక్షణ ఉంటుందని, నామినేషన్ల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. జిల్లాలో ఏలూరు, దెందులూరు, పెదవేగి, కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, భీమడోలు, గణపవరం, ద్వారకాతిరుమల, చాట్రాయి, ముసునూరు, నూజీవీడు మండలాల కార్యాలయాల ఎంపీడీవో ఆఫీస్‌ల వద్ద సీసీటీవీ ద్వారా నామినేషన కేంద్రాల భద్రతను ఈ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్ధులకు, ప్రజలకు ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే 112 లేదా ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 9550351100కు ఫోన్‌ చేసి పోలీసుల తక్షణ సహాయం పొందవచ్చన్నారు.

నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

ఏలూరు జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రతి కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లపై శుక్రవారం ఆయన పరిశీలన చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పార దర్శకంగా నిర్వహించడానికి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తు న్నామ న్నారు. రాజకీయ పార్టీలు, ప్రతినిధులు ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటిం చాలని ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అందరూ పోలీసు యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Oct 24 , 2026 | 12:32 AM