Share News

నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు : ఎస్పీ కిశోర్‌

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:45 AM

ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు ప్రతి కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ కిశోర్‌ తెలిపారు.

 నామినేషన్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు : ఎస్పీ కిశోర్‌
ఏలూరు జడ్పీ కార్యాలయంలో నామినేషన్‌ కేంద్రాలను పరిశీలిస్తున్న ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్‌

ఏలూరు క్రైం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు ప్రతి కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ కిశోర్‌ తెలిపారు. ఏలూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లపై గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. నామినేషన్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగంతో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అధికారులు, ఇన్‌ఛార్జి నియామకం, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లావ్యాప్తంగా ప్రతి నామినేషన్‌ కేంద్రానికి ఒక ఎస్‌ఐ స్ధాయి అధికారిని, అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలలో సీఐ స్థాయి అధికారులను ప్రత్యేక ఇన్‌చార్జిలుగా నియమించామన్నారు. నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడానికి అభ్యర్థితోపాటు ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుంది. నామినేషన్లు వేసే సమయంలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైనా, బెదిరింపులకు గురిచేసే ప్రయత్నాలు జరిగితే.. పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ అత్యవసర నంబరు 112, ప్రత్యేకంగా కేటాయించిన 95503 51100 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. అభ్యర్థులందరికీ పోలీస్‌శాఖ నుంచి పూర్తి భద్రత, సహాయం అందించబడు తుందన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Oct 23 , 2026 | 12:45 AM