సోలార్‌తో సొమ్ము ఆదా
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:31 AM
సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకాన్ని అమలు చేస్తోంది.
మిగులు విద్యుత్ అమ్మకంతో అదనపు ఆదాయం
పీఎం సూర్యఘర్ వినియోగంలో ఏలూరు జిల్లా ప్రథమం
4 వేల మందికి జీరో బిల్లు
ఏలూరు సిటీ, మార్చి 4(ఆంధ్రజ్యోతి): సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇంటి పై భాగంలో సోలార్ రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేసుకుని సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి వినియోగించుకోవడంతో పాటు అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించి ఆదాయాన్ని పొందవచ్చు. నిరంతర విద్యుత్‌తో పాటు అంతరాయాలు, లో ఓల్టేజీ, విద్యుత్ బిల్లుల సమస్యలకు చెక్ పెట్టేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఏలూరు జిల్లాలో 38,012 మంది విద్యుత్ వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా 7,402 మంది సూర్యఘర్ పథకంలో సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోగా వీరిలో 4,200 మందికి జీరో బిల్లు వస్తోంది. 2,500 మందికి జీరో విద్యుత్ బిల్లుతో పాటు తిరిగి అదనపు ఆదాయం పొందుతున్నారు.
ప్యానల్స్, నెట్ మీటర్ ఏర్పాటు
విద్యుత్ అధికారుల ఆమోదంతో ఆయా గృహాలపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తారు. భవనం పై భాగంలో వంద చదరపు అడుగుల స్థలంలో సోలార్ ప్యానెల్స్‌ను అమర్చి ప్రస్తుతం వినియోగించే విద్యుత్ మీటర్ స్థానంలో నెట్ మీటర్ ఏర్పాటు చేసి వినియోగాన్ని లెక్కిస్తారు. వినియోగానికి మించి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. అదనపు విద్యుత్‌కు ఆదాయాన్ని విద్యుత్ శాఖ సమకూర్చుతుంది. సబ్సిడీ, బ్యాంకు రుణంతో పాటు పెట్టుబడి 6, 7 ఏళ్లలో తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. సూర్యఘర్ ప్యానెల్స్ ఏర్పాటు చేసిన 30 రోజుల్లో వినియోగదారుల ఖాతాల్లో సబ్సిడీ జమ అవుతుంది. ముందుగా వినియోగ దారులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌లోడ్ చేయాలి. 100 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన కిలోవాట్ రూఫ్‌టాప్ కెపాసిటీ విద్యుత్ ఉత్పత్తికి 3 నుంచి 4 ప్యానెల్స్ ఉపయోగిస్తారు.
పఽథకానికి దరఖాస్తు ఇలా..
ఈ పథకం కోసం మొబైల్‌లో సూర్యఘర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖా స్తులో వినియోగదారుడి వివరాలు నమోదు చేయాలి. ఆరు నెలల విద్యుత్ బిల్లుల కాపీలను జతచేసి ఈ పథకానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ రుసుం కిలో వాట్ ఆధారంగా చెల్లించాలి. ట్రాన్స్‌కో అనుమతులు పొందిన తర్వాత వెండర్లను ఎంపిక చేసుకోవాలి. కిలోవాట్స్‌ను బట్టి సబ్సిడీ మంజూరు చేస్తారు. మిగిలిన సొమ్ము మొత్తానికి బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తారు. వాయిదాల పద్ధతిలో రుణం చెల్లించాలి. ఈ పథకం గృహ విద్యుత్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు కోసం విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబరు 1912 ను సంప్రదించవచ్చు.
ఏలూరు జిల్లా ప్రథమం
పి.సాల్మన్ రాజు, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్, ఏలూరు
పీఎం సూర్యఘర్ యోజనలో సోలార్ రూఫ్‌టాప్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటులో రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 38,012 మంది విద్యుత్ వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేయించుకోగా 7,402 మందికి 24 మెగావాట్లకు సంబంధించి సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం 101 మందికి ప్యానెల్స్ ఏర్పాటు జరుగుతోంది. సోలార్ రూఫ్‌టాప్‌ల ఏర్పాటుకు వినియోగదారులు ముందుకురావాలి.
పశ్చిమలో 5,277 ప్యానల్స్ ఏర్పాటు
–ఉషారాణి, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్, పశ్చిమగోదావరి
భీమవరం టౌన్: సూర్యఘర్ పథకంలో పశ్చిమలో 26,569 మంది సోలార్ ప్యానల్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 5,277మందికి ప్యానల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ఇప్పటి వరకు సుమారు 300 మందికి పైగా జీరో బిల్లులు పొందుతున్నారు. అదనపు ఆదాయం పొందుతున్నవారు కూడా 200 మందికి వరకు ఉంటారని అంచనా. ప్రస్తుతం విద్యుత్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో కొంత మార్పులు ఉండవచ్చు.