Share News

సోలార్‌ వెలుగొచ్చింది..!

ABN , Publish Date - May 31 , 2026 | 01:20 AM

మండల పరిధిలోని పెదరావిగూడెం పంచాయతీ చీపురు గూడెం, బండారుగూడెం రెండు ఆదివాసీ గ్రామాలు ప్రధాన రహదారికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉన్నాయి.

సోలార్‌ వెలుగొచ్చింది..!
సోలార్‌ గ్రిడ్‌ను ప్రారంభిస్తున్న విద్యుత్‌శాఖాధికారులు

కుక్కునూరు, మే 30 (ఆంధ్రజ్యోతి):మండల పరిధిలోని పెదరావిగూడెం పంచాయతీ చీపురు గూడెం, బండారుగూడెం రెండు ఆదివాసీ గ్రామాలు ప్రధాన రహదారికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉన్నాయి. దాదాపు 30 ఏళ్ల క్రితం వీరంతా చత్తీస్‌ఘడ్‌ ప్రాంతం నుంచి వలస వచ్చి ఆదివాసీ గ్రామాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం లేదు. అటవీ శాఖ రిజర్వ్‌ ఫారెస్ట్‌ నిబంధనల ప్రకారం విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలంటే ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వారు చీకటిలోనే మగ్గుతూ ఇన్నేళ్లు కాలం గడిపారు. అయితే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్‌ (పీఎం జన్మన్‌) పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ విద్యుత్‌ శాఖాధికారులు ఈ గ్రామాలపై దృష్టి పెట్టారు. బండారుగూడెంలో 12 కేవీ, చీపురుగూడెం 13 కేవీ సోలార్‌ ఆఫ్‌గ్రీడ్‌ను దాదాపు రూ.65 లక్షలతో ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామానికి విద్యుత్‌ సౌకర్యం ఏర్పడింది. ఈ రెండు గ్రామాల్లో దాదాపు 85 ఆదివాసీ కుటుంబాలున్నాయి. శనివారం ఏలూరు సర్కిల్‌ సూపరిండెంటెండ్‌ ఇంజనీర్‌ పి.సాల్మన్‌రాజు సోలార్‌ ఆఫ్‌ గ్రిడ్‌ను ప్రారం భించారు. ఇప్పటి వరకు విద్యుత్‌ వెలుగులు ఎరుగని ఆదివాసీ గ్రామాలకు పీఎం జన్మన్‌ పథకం ద్వారా విద్యుత్‌ సౌకర్యం కల్పించామని ఆయన విలేకరులకు తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్‌కో డీఈ ఖాన్‌, ఏడీఈ కట్టా రమేశ్‌, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు, మాజీ ఉపసర్పంచ్‌ పిచ్చుక రాజు, స్థానిక టీడీపీ నాయకులు సుబ్బారావుశర్మ, రమణరాజు, గోరమూడి శ్రీను, గుర్రం ఉదయ్‌, పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2026 | 01:20 AM