Share News

మట్టి.. కొల్లగొట్టి..!

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:19 AM

మట్టి మాఫియాకు చెలరేగిపోతోంది. గ్రామాభివృద్ధి పేరుతో సొమ్ములు చెల్లించి చెరువులను ఇష్టానుసారం తవ్వేస్తోంది.

మట్టి.. కొల్లగొట్టి..!
అప్పారావుపేట చెరువు నుంచి మట్టి తవ్వుతున్న దృశ్యం

ఇష్టానుసారం మట్టి, గ్రావెల్‌ తవ్వకాలు

కాల్వ గట్లు, పొలాలు, చెరువులనూ వదలడం లేదు

మైనింగ్‌ మాఫియా సవాళ్లు.. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు

రాజీ కుదిర్చిన నేతలు.. మళ్లీ చెలరేగిపోతున్నారు

అధికారుల పాత్రపైనా అనుమానాలు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

మట్టి మాఫియాకు చెలరేగిపోతోంది. గ్రామాభివృద్ధి పేరుతో సొమ్ములు చెల్లించి చెరువులను ఇష్టానుసారం తవ్వేస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ భూముల మెరక చేసేందుకు ఈ మట్టిని తరలిస్తున్నారు, కాలువ గట్లు మాయమైపోతున్నాయి. ప్రభుత్వం ఏదైనా మట్టి మాఫియాదే పైచేయిగా నిలుస్తోంది. తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం జగన్నాథపురంలో మైనర్‌ ఇరిగేషన్‌, పంచాయతీ చెరువులు పరిమితికి మించి తవ్వకాలు సాగించడంతో గతంలో పలువురి ప్రాణాలు పోయాయి. తాజాగా అప్పారావుపేట చెరువులోనూ అదే జరుగుతోంది. దీనిపై విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరిపిన అధికారులు రూ.2.20 లక్షలు జరిమానా విధించారు. ఆ తర్వాత అయినా మట్టి తవ్వకాలు నిలిచిపోతాయని ఆశించారు. కానీ, గ్రామాభివృద్ధికి కొంత మొత్తాన్ని చెల్లించి రాత్రి, పగలు తవ్వకాలు చేస్తున్నారు. పంచాయతీ చెరువైనా.. మైనర్‌ ఇరిగేషన్‌ చెరువైనా పరిమితికి మించి తవ్వకూడదు. చెరువుల్లో నీటి నిల్వ కోసమో లేదంటే భూగర్భ జలాలు పెంచడం కోసమో అయితే పర్వాలేదు. కాని మట్టి వ్యాపారం కోసం తవ్వడమే వివాదస్పదంగా మారుతోంది. ఆరుగొలను, కొత్తూరు గ్రామాల్లో కొన్నేళ్లుగా తవ్వకాలు సాగిస్తున్నారు. అనుమతులు తెచ్చుకుంటున్నారు. దానిని ఆసరాగా చేసుకుని ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తూ వస్తున్నారు. ఇటీవల మైనింగ్‌ మాఫియా మధ్య విభేధాలతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అప్పారావుపేటలో చెరువు తవ్వకంపై విజిలెన్స్‌ దాడుల తర్వాత మాఫియా ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. చెరువు తవ్వకానికి అడ్డొస్తే క్వారీల్లో మైనింగ్‌ వ్యాపారాలు సాగనిచ్చేది లేదంటూ ఒక వర్గం సవాల్‌ చేసింది. ఇది కాస్తా హాట్‌ టాపిక్‌గా మారింది. కొందరు పెద్దలు జోక్యం చేసుకుని ఇరువర్గాలతో సమావేశం ఏర్పాటుచేశారు. పరస్పర ఫిర్యాదులు చేసుకోకూడదంటూ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మైనింగ్‌ మాఫియా మళ్లీ బుసలు కొడుతోంది. ఇబ్బడి ముబ్బడిగా తవ్వకాలు సాగిస్తున్నారు. పంట పొలాల్లో మట్టిని వ్యాపారం కోసం తవ్వకాలు సాగుతున్నాయి. వైసీపీ హయాంలో ఇటువంటి తవ్వకాలతో మాఫియా చెలరేగిపోయింది. ఎర్రకాలువ, తాడిపూడి కాలువను అప్పట్లో ఖాళీ చేసేశారు. జగనన్న కాలనీల మెరకపేరుతో మట్టి వ్యాపారం జోరుగా సాగింది. అప్పటి ప్రభుత్వం అభాసుపాలైంది. అదే పరిస్థితి కూటమి ప్రభుత్వంలోనూ జరుగుతోంది. ఇందులో అధికారుల పాత్రనూ విస్మరించలేం.

Updated Date - Mar 05 , 2026 | 12:19 AM