ప్రియుడే కాలయముడై..
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:09 AM
ప్రేమించింది... అతడే సర్వస్వం అనుకుంది.. అతడు ఏం కావాలన్నా కాదనకుండా సమకూర్చింది. కానీ అతనికి అంతకు ముందే వివాహమైంది. ఈ విషయం చెప్పకుండా మోసం చేశాడని తెలిసి తట్టుకోలేకపోయింది. దీంతో అతడిని దూరం పెట్టింది. ఆ ద్వేషంతోనే ఆమెను ఇప్పుడు ఈలోకం నుంచి దూరం చేశాడు.. కత్తితో పొడిచి దారుణంగా హత మార్చాడు..
భీమవరంలో సా్‌ఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య
ఆటోడ్రైవర్‌తో కొన్నేళ్లుగా ప్రేమలో..
పెళ్లయిందని తెలిసి దూరం పెట్టిన యువతి ..
కక్షతో ప్లాన్ చేసి మర్డర్
భీమవరం క్రైం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ప్రేమించింది... అతడే సర్వస్వం అనుకుంది.. అతడు ఏం కావాలన్నా కాదనకుండా సమకూర్చింది. కానీ అతనికి అంతకు ముందే వివాహమైంది. ఈ విషయం చెప్పకుండా మోసం చేశాడని తెలిసి తట్టుకోలేకపోయింది. దీంతో అతడిని దూరం పెట్టింది. ఆ ద్వేషంతోనే ఆమెను ఇప్పుడు ఈలోకం నుంచి దూరం చేశాడు.. కత్తితో పొడిచి దారుణంగా హత మార్చాడు.. భీమవరం మండలం తాడేరు గ్రామంలో ఈ ఘటన సంచలనమైంది. భీమవరం రూరల్ సీఐ జగదీశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం తాడేరులో నివాసం ఉండే కొత్తపల్లి వెంకటేశ్వరరావు వ్యవసాయ కూలీ. అతనికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా, చిన్న కుమార్తె కొత్తపల్లి అనంతవాణి (32) సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నది. ఇటీవలే తాడేరులో కొత్త ఇల్లు కూడా కట్టుకున్నారు. తల్లికి ఆపరేషన్ చేయడంతో ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం చేస్తోంది. ఇదిలా ఉండగా కొన్నేళ్ల క్రితం సమీప గ్రామమైన కొర్రపాడు గ్రామానికి చెందిన తాడేపల్లి శ్యాంబాబు అనే ఆటో డ్రైవర్‌తో అనంతవాణికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. శ్యాంబాబు ఏది కావాలన్నా సమకూర్చేది. ఇటీవలే కొత్త ఆటో కూడా కొని ఇచ్చినట్లుగా చెబుతున్నారు. శ్యాంబాబుకు గతంలోనే వివాహమై ముగ్గురు సంతానంకూడా ఉన్నారు. కొంత కాలం క్రితం భార్యను కూడా వదిలిపెట్టేశాడు. ఆ విషయాన్ని అనంతవాణికి చెప్పకుండా దాటవేశాడు. శ్యాంబాబుకు వివాహమై, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారన్న విషయం అనంతవాణికి ఇటీవల తెలిసింది. అప్పటి నుంచి శ్యాంబాబును దూరం పెడుతూ ఫోన్ చేసినా కూడా పట్టించుకోవడం మానేసింది. దీంతో కక్ష పెంచుకుని ప్లాన్ ప్రకారం ఆమెను మట్టుబెట్టాడు.
అర్ధరాత్రి గోడ దూకి...
దూరం పెట్టడంతో శ్యాంబాబు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి దాటాక కొర్రపాడు గ్రామం నుంచి తాడేరు చేరుకున్నాడు. అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో అనంతవాణి ఇంటి గోడ దూకాడు. అలికిడి విన్న అనంతవాణి తండ్రి వెంకటేశ్వరరావు బయటకు రాగా అతని వెంట అనంతవాణి కూడా వచ్చింది. ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం వెంట తెచ్చుకున్న కత్తితో శ్యాంబాబు అనంతవాణిని విచక్షణారహితంగా కడుపులో పొడిచాడు. తండ్రి అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పక్కకు తోసి పరారయ్యాడు .ఆమెను వెంటనే భీమవరం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే అనంతవాణి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేశారు. శ్యాంబాబు గురించి ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు.