Share News

రికవరీలు.. తూచ్‌!

ABN , Publish Date - Jul 12 , 2026 | 12:32 AM

సహకారశాఖలో రూ.కోట్లు మింగేసిన ఘనులపై పూర్తిస్థాయి చర్యలు లేక పోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వారి నుంచి నోట్ల కట్టలు కక్కించలేక సహకారశాఖ అధికారులు ఏళ్ల తరబడి పిల్లి మొగ్గలు వేస్తున్నారు.

రికవరీలు.. తూచ్‌!
పోతునూరు సొసైటీ

సొసైటీల్లో రూ.కోట్లలో గుటకాయ స్వాహా

ముందుకు సాగని విచారణలు

పోతునూరులో కదలిక వచ్చి.. ఆగింది

దర్జాగా అవినీతిపరులు చెలామణి

తాజాగా మక్కినవారిగూడెంలో ఎరువుల అమ్మకాల్లో అక్రమాలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

సహకారశాఖలో రూ.కోట్లు మింగేసిన ఘనులపై పూర్తిస్థాయి చర్యలు లేక పోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. వారి నుంచి నోట్ల కట్టలు కక్కించలేక సహకారశాఖ అధికారులు ఏళ్ల తరబడి పిల్లి మొగ్గలు వేస్తున్నారు. రైతులకు పారదర్శకంగా రుణాలు ఇవ్వాల్సిన చోట్ల గత వైసీపీ పాలనలో నీకంతా.. నాకింతా అంటూ సొసైటీల పాలనను నిర్వీర్యం చేశారు. దీంతో కోట్ల రూపాయల మేర నిధుల స్వాహాపర్వం వెలుగు చూసినా.. అవినీతి పరులకు ఇంకా రాచమర్యాదలే అన్నట్టుగా వ్యవహారం వుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. సహకారశాఖలో పోతునూరు, రంగా పురం, జంగారెడ్డిగూడెం, వట్లూరు, టి.నర్సాపురం, మక్కినవారి గూడెం, బాదంపూడి, కామవరపుకోట సొసైటీల్లో రూ.కోట్లలో స్వాహా చేసిన సెక్రటరీలు, గుమస్తాలు, రిటైర్డు అధికారులపై విచారణలు కొలిక్కిరాక పోవడంతో ప్రజాధనం అక్రమార్కులు కబంధహస్తాల్లోనే మూలుగుతోంది. ఆస్తుల జప్తు, ఇతర విచారణలపై సహకారశాఖ ఉదాసీన వైఖరి పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుణాలు, అక్ర మాలు, అవినీతి కేసుల్లో రికవరీలపై కలెక్టర్‌ అధ్యక్షతన మూడు నెలలకు ఒకసారి విచారణలు జరగాల్సి వుంది. రెండేళ్లుగా ఆ ఊసే లేదు. కలెక్టర్‌, ఎస్పీ, డీసీసీబీ సీఈవో, డీసీవో, ఇతర సభ్యులు కలిసి చర్చించాల్సి వుంది. ఇదేమీ పట్టనట్టుగా వారు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

తాజాగా ఎరువుల కుంభకోణం

మక్కినవారిగూడెం సొసైటీలో రెండేళ్లకు పైబడి లోపాయికారిగా ఎరువులు అమ్మకాలు నిర్వహించే గుమస్తా వాటికి తాలూకా మొత్తాలను సొంతానికి వాడేసుకున్నాడు. దాదాపుగా రూ.60 లక్షలు స్వాహా చేసినట్టు తేలడంతో ఏడాది క్రితం అతని భూమిపై బ్యాంకులో లోను పెట్టి ఆ సొమ్ము సొసైటీకి జమ చేశారు. ఇతను మళ్లీ అదే పోస్టులో కొనసాగి తాజా గా రూ.1.04 కోట్ల ఎరువుల అమ్మకాలను సొమ్మును పక్కదారి పట్టించి సొంతానికి వాడేసుకున్నట్టు తాజాగా తేలింది.ఈ సొసైటీ పరిధిలోని అప్పల రాజుగూడెం ఎరువుల గొడౌన్‌లోని గుమస్తా రూ.40 లక్షలు వాడుకుని, తిరిగి గుట్టుచప్పుడు కాకుండా కట్టేశారు. త్రిసభ్య కమిటీ చైర్మన్‌ ఆచంట సూర్య నారాయణ ఎరువుల స్వాహాపై 52 విచారణ వేయాలని కోరగా, 51 విచారణ తాజాగా కొన సాగుతోంది.

తూతూ మంత్రంగా విచారణలు..?

జిల్లాలో అక్రమాలకు పాల్పడిన సొసైటీలపై విచారణ చేపట్టిన అధికారుల పాత్రపైన ఆరోపణ లు వ్యక్తమవుతున్నాయి. విచారణల పేరిట సాగ దీత, అక్రమార్కులపై పోలీస్‌ కేసులు పెట్టడంలో నిర్లిప్తత వల్ల కేసులు నీరుగారుతున్నాయి. పోతు నూరు సొసైటీలో అక్రమాలపై కొద్ది నెలల క్రితం డీఆర్‌ కేసు పెట్టగా, సంబంధిత వ్యక్తి బెయిల్‌పై వచ్చి బయటే తిరుగుతున్నాడు. నిధుల స్వాహాపై ఇప్పటి వరకు పురోగతి లేనేలేదు.

పాతవి అలానే.. కదలిక శూన్యం

టి.నర్సాపురంలో సొసైటీలో రూ.40 కోట్ల పైనే అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పటి సెక్రటరీ టి.కిశోర్‌ కుమార్‌ డీసీసీబీ నుంచి రుణాలు మొత్తాలను తీసుకొచ్చి తనకు కావాల్సిన వారికి ఇవ్వడం, వారు కట్టినా ఆయా మొత్తాలను జమ చేయకపోవడంతో నిధులు దుర్వినియోగం భారీగా జరిగింది. అతన్ని సస్పెండ్‌ చేసి, జైలుకు పంపారు. బెయిల్‌పై వచ్చాడు. ఇతని కారణంగా పలువురి ఆస్తులను జప్తు చేసినట్టు చెబుతున్నారు.

జంగారెడ్డిగూడెంలో రుణాల కోసం భూములు తనఖా పెట్టి తీసుకోవాల్సి ఉండగా, పొలాలు లేకపోయినా ఉన్నట్లు సృష్టించి తన కుటుంబ సభ్యులకు రుణాలు రాసుకుని ఇక్కడ సెక్రటరీ రత్నాజీ రూ.రెండు క్లోట్ల పైబడి అక్రమాలకు పాల్పడ్డాడు.అతడ్ని సస్పెండ్‌ చేయగా తదుపరి రిటైర్‌ అయ్యాడు. అతని ఆస్తుల నుంచి రికవరీ కోసం కోర్టులో కేసు వేశారు. ఇంకా డిక్రీ రాలేదు. డిక్రీ వస్తే అతని ఆస్తుల నుంచి రికవరీ చేస్తారు. తాజాగా లక్ష్మి, నాగేశ్వరరావు దంపతులు భూమిపై తనఖా రుణం చెల్లించినా కాగితాలు ఇవ్వకపోవడంపై కలెక్టర్‌ను ఆశ్రయించారు. ఇందులో సహకారశాఖ అధికారులు వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై జేసీ విచారణ చేపడుతున్నారు. శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. బొక్కేసిన సొమ్ములు జమ చేయించలేకపోయారు. ఇటీవల ఏలూరు డీఆర్‌ సత్యవతి ఇక్కడ అవకతలపై జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

పోతునూరు భోగేశ్వరస్వామి విశాల పరపతి సొసైటీలో గతంలో పనిచేసిన సొసైటీ చైర్మన్లు వైసీపీ చెందిన దంపతులు దూళిపాళ్ల నాగేంద్రవరప్రసాద్‌ (బజ్జీ), రమాదేవి రూ.1.52 కోట్ల స్వాహా చేసినట్టు ఆరోపణలు రాగా రూ.52 లక్షలు డిపాజిట్లు రూపంలో ఉన్నట్టు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ష్యూరిటీలు లేకుండా రూ.కోటి వరకు పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు రాగా, కొద్ది నెలలు క్రితం పోలీసులు బజ్జీని అరెస్టు చేయగా, బెయిల్‌పై బయటకు వచ్చాడు. రంగాపురం, బాదంపూడి, వట్లూరుల్లో లక్షల్లోనే అవకతవకలు తేలాయి. ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు లేవు. ఇక్కడ సొసైటీ సెక్రటరీలు సొంతానికి నిధులను వాడేసుకున్నారు.

Updated Date - Jul 12 , 2026 | 12:32 AM