Share News

‘సహకార’ సమరం

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:45 PM

సహకార సంఘాల ఉద్యోగుల నిరసనలు మిన్నం టాయి. జిల్లాలోని కార్యాలయాల వద్ద ఉద్యోగులు ఆందోళన చేశారు. డిమాండ్లు తీర్చాలంటూ కొన్ని రోజులుగా సాగుతున్న నిరసనలు నిరవధిక సమ్మెకు దారితీశాయి.

‘సహకార’  సమరం

సమ్మె బాట పట్టిన సహకార సంఘాల ఉద్యోగులు

జిల్లాలోని 111 సంఘాల్లో సేవలు నిలుపుదల

ఆమరణ నిరాహార దీక్షలు..

ప్రధాన రహదారులపై బైఠాయింపులకు ప్రణాళిక

సమ్మె కొనసాగితే రైతులకు ఇక్కట్లే

భీమవరం రూరల్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : సహకార సంఘాల ఉద్యోగుల నిరసనలు మిన్నం టాయి. జిల్లాలోని కార్యాలయాల వద్ద ఉద్యోగులు ఆందోళన చేశారు. డిమాండ్లు తీర్చాలంటూ కొన్ని రోజులుగా సాగుతున్న నిరసనలు నిరవధిక సమ్మెకు దారితీశాయి. బుధవారం జిల్లాలోని 111 సహకార సంఘాల్లో ఉద్యోగ సేవలు నిలిచి పోయాయి.తమ డిమాండ్లు ఒప్పుకునే వరకు సమ్మె కొనసాగిస్తామని ఉద్యోగులు చెబుతున్నారు.

సమ్మెలో 724 మంది ఉద్యోగులు

ఉద్యోగ పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని ఇంకా పలు డిమాండ్లతో రెండు నెలలుగా సహకార సంఘాల ఉద్యోగులు నిరసన బాటపట్టారు. జిల్లాలోని 111 సంఘాల్లోని 724 మంది ఉద్యోగులు వివిధ రకాలుగా నిరసనలు తెలియజేశారు. గుంటూరులోని కమిషనరేట్‌ రోజుకు రెండు జిల్లాలు ఉద్యోగులు చొప్పున డిమాండ్లు తీర్చాలంటూ నిరసన చేశారు. అంతకు ముందు కలెక్టరేట్‌లు, డీసీసీబీ ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు. ఇప్పుడు పోరాటం పెంచే దశలో నిరవధిక సమ్మెలోకి దిగారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆమరణ నిరాహార దీక్షలు, ప్రధాన రోడ్లపై బైఠాయింపు చేయడానికి సిద్ధమవుతున్నట్లు జిల్లా జేఏసీ నాయకులు తెలుపుతున్నారు.

సేవలు నిలిస్తే రైతులకు నష్టం

సహకార సంఘాల ఉద్యోగుల నిరవధిక సమ్మెతో రైతులకు నష్టం చేకూరుతుంది. ప్రస్తుతం దాళ్వా సాగు సీజన్‌ కనుక ఎరువులు సహకార సంఘాల నుంచి కొనుగోలు జరుగుతున్నాయి. జిల్లాలో సహకార సంఘాల నుంచి దాదాపు లక్షా 50 వేల మంది రైతుల వరకు ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. యూరియా బస్తాలు రైతులకు సరిపడగా అందించడంలో సంఘాలు ఈ పంటలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం 111 సహకార సంఘాల్లో యూరియా 1,946 టన్నులు సూపర్‌ ఫాస్పేట్‌, పొటాష్‌ వంటి ఎరు వులు 3,230 టన్నులు మొత్తం 5,176 టన్నులు నిల్వ ఉంది. మరో 20 రోజులపాటు ఎరువుల విక్రయాలు జరుగుతాయి. ఉద్యోగులు సమ్మె చేస్తే రైతులకు ఎరువులు అందకుండా పోతాయి. రుణాల చెల్లింపులలో గడువు ముగిస్తే రాయితీలు రైతులు కోల్పోతారు. ధాన్యం కొనుగోలులో సహకార సంఘాలు ఉన్నందున రానున్న రోజుల్లో వాటికి ఆటంకం ఏర్పడవచ్చు.

రానున్న రోజుల్లో మరింత ఉధృతం

–నందమూరి సుబ్బారావు, రాష్ట్ర సహకార సంఘం జేఏసీ సభ్యుడు

సహకార సంఘాల్లో ఉద్యోగులకు ప్రభుత్వం చేయాల్సిన వాటి కోసమే డిమాండ్‌ చేస్తున్నాం. 2022 సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నాం. ఈసారి మా డిమాండ్‌లు తీర్చేవరకు సమ్మె విర మించం. మావి న్యాయమైన కోర్కెలు. రానున్న రోజుల్లో సమ్మె మరింత ఉధృతం చేస్తాం.

ఆమరణ దీక్షలకైనా సిద్ధం

– పి.విజయభాస్కర్‌ , సహకార సంఘం, జేఏసీ జిల్లా అధ్యక్షుడు

డిమాండ్ల పరిష్కారం కోసం రెండు నెలలుగా పోరాటం చేస్తున్నాం. దీనిని ప్రభుత్వం గుర్తించాలి. ఇప్పటికే నిరసనల నుంచి నిరవధిక సమ్మెకు వచ్చాం. జిల్లాలోని అన్ని సంఘాల్లో సేవలు నిలిపివేశాం. ఆమరణ దీక్షలు చేయడానికి కూడా సిద్ధమే. రహదారులపై బైఠాయించాలని రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చింది. రానున్న రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేశాం.

Updated Date - Feb 18 , 2026 | 11:45 PM