Share News

స్లాట్‌లు పెంచారు

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:51 AM

రిజిస్ర్టేషన్‌ శాఖలో స్లాట్‌ బుకింగ్‌ విధానానికి రెండు రోజులు వెసులు బాటు కల్పించారు. ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో స్లాట్‌లు పూర్తయిన తర్వాత కూడా రిజిస్ర్టేషన్‌లు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

స్లాట్‌లు పెంచారు

రెండు రోజులు మినహాయింపు

పట్టణాల్లో డిమాండ్‌

ముందుగా బుక్‌ చేసుకుంటున్న కొందరు లేఖరులు..బ్లాక్‌లో అమ్మకాలు

స్లాట్‌లు పెంచితేనే సమస్యకు పరిష్కారం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

రిజిస్ర్టేషన్‌ శాఖలో స్లాట్‌ బుకింగ్‌ విధానానికి రెండు రోజులు వెసులు బాటు కల్పించారు. ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో స్లాట్‌లు పూర్తయిన తర్వాత కూడా రిజిస్ర్టేషన్‌లు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో సోమ, మంగళవారాల్లో స్లాట్‌లకు కాస్త మినహాయింపు ఇచ్చింది. సాయంత్రం 5.30 గంటల తర్వాత కూడా రిజిస్ర్టేషన్‌లు చేసుకునే అవకాశం కల్పించింది. ఒకవైపు లక్ష్యాలను చేరుకోవడానికి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఆపసోపాలు పడుతున్నారు. జిల్లాలో దాదాపు రూ.467 కోట్లు ఆదాయాన్ని రాబట్టాలి. మార్చి నెలలోనే జిల్లా వ్యాప్తంగా రూ.40 కోట్లు లక్ష్యాన్ని విధించారు. అప్పుడే లక్ష్యం చేరుకుంటామని రిజిస్ర్టేషన్‌ శాఖ భావిస్తోంది. భీమవరం, తాడేపల్లిగూడెం, గునుపూడి, ఉండి తదితర సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లోనే లక్ష్యానికి చేరువవుతున్నారు. జిల్లాలోని 15 సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ఈ ఏడాది 90 శాతం వరకు రెవెన్యూ రానుందని అంచనా వేస్తున్నారు. గడచిన కొన్ని నెలల నుంచి స్లాట్‌ల విధానాన్ని అమలు చేస్తున్నారు. ముందుగా బుక్‌ చేసుకుంటేనే రిజిస్ర్టేషన్‌లు చేస్తున్నారు. దాంతో బుకింగ్‌లకు డిమాండ్‌ పెరిగింది. డిమాండ్‌ ఉన్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో ప్రస్తుత స్లాట్‌లు సరిపోవడం లేదు.మరోవైపు కొందరు లేఖరులు స్లాట్‌లు బుక్‌ చేసుకుని బయట మార్కెట్‌లో విక్రయించుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో వెనక్కు తీసుకున్న ప్రభుత్వం

గతంలో జిల్లాలోని అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు స్లాట్‌లను పెంచారు. భీమవరం, తాడేపల్లిగూడెం, గునుపూడి, తణుకు, సజ్జాపురం వంటి కార్యాల యాలకు 120 స్లాట్‌లు ఇచ్చారు. మిగిలిన వాటికి 70 వంతున రోజుకు కేటా యించారు. అప్పట్లో భూములు మార్కెట్‌ విలువ పెంపునకు రిజిస్ర్టేషన్‌ శాఖ చర్యలు తీసుకుంది. భూములు, స్థలాలు,ఇళ్లు కొనుగోలు చేసుకున్నవారు.అగ్రిమెంట్‌లు చేసుకున్న వారంతా రిజిస్ర్టేషన్‌లకు ఎగబడ్డారు. సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రద్దీ నెలకొంది. దాంతో ప్రభుత్వం స్లాట్‌ల సంఖ్యను పెంచింది. మార్కెట్‌ విలువ పెంపు వాయిదా వేయడంతో పెంచిన స్లాట్‌లను కుదించేశారు.ఇదే ఇప్పుడు డిమాండ్‌ ఉన్న సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాల యాల్లో ఇబ్బందులకు గురి చేస్తోంది. స్లాట్‌లు తక్కువగా ఉంటున్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెంలో సమస్య అధికంగా ఉంది. చెల్లు రశీదు రిజిస్ర్టేషన్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. బ్యాంకులో ఆస్తుల తనఖా పెట్టినా, విడిపించుకున్నా సరే సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో చెల్లు రశీదు రిజిస్ర్టేషన్‌లు చేయాల్సి వస్తోంది. భీమవరం, తాడేపల్లిగూడెం కార్యాలయాల్లో ఇటువంటి రిజిస్ర్టేషన్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. దీనిపై రిజిస్ర్టేషన్‌ శాఖ దృష్టిపెట్టాలి.

Updated Date - Mar 31 , 2026 | 12:51 AM