Share News

మృత్యు మలుపు

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:27 AM

అప్పటివరకు పెళ్లిలో ఎంతో ఆనందంగా గడిపిన ఆ యువకులు మృత్యువు తమను వెంటాడుతోందని ఊహించలేకపోయారు. ఆ ప్రమాదకర మలుపు విద్యార్థుల ఆనందాన్ని ఆవిరిచేసింది. స్నేహితుడి సోదరుడి వివాహ వేడుకకు వెళ్లి ఆనందంగా తిరిగి ఇంటికి వెళుతుండగా అయితంపూడి లాకుల సమీపంలోని మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు కాలువలోకి దూసుకుపోయింది.

మృత్యు మలుపు

నలుగురు విద్యార్థులు మృతి ..

మరొకరి కోసం గాలింపు

అయితంపూడి– ఓగిడి మధ్య కాలువలోకి దూసుకెళ్లిన కారు

అర్ధరాత్రి..వర్షంలో కనిపించని మలుపు

మృతులంతా కోనసీమ జిల్లా సఖినేటిపల్లి

మండలానికి చెందినవారు

ఒకరిని రక్షించిన స్థానికులు

మోరి, మోరిపోడు, శృంగవరప్పాడు

గ్రామాల్లో తీరని విషాదం

వారంతా ఇంజనీరింగ్‌ విద్యార్థులు.. పెరవలిలో జరుగుతున్న స్నేహితుడి సోదరుడి వివాహానికి హాజరయ్యారు.. రాత్రంతా పెళ్లి సందడిలో పాలుపంచు కున్నారు. అనంతరం ఓగిడి గ్రామంలోని పెళ్లికొడుకు ఇంటికి వెళ్లారు.. అక్కడి నుంచి తెల్లవారుజామున కారులో తమ సొంత ఇళ్లకు బయలు దేరారు. ఓగిడి అయితంపూడి మధ్యలో ఒక మలుపు వారి పాలిట మృత్యువైంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఐదుగురు గల్లంతవగా ఒకరు సురక్షితంగా బయటపడ్డాడు.

ఇరగవరం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : అప్పటివరకు పెళ్లిలో ఎంతో ఆనందంగా గడిపిన ఆ యువకులు మృత్యువు తమను వెంటాడుతోందని ఊహించలేకపోయారు. ఆ ప్రమాదకర మలుపు విద్యార్థుల ఆనందాన్ని ఆవిరిచేసింది. స్నేహితుడి సోదరుడి వివాహ వేడుకకు వెళ్లి ఆనందంగా తిరిగి ఇంటికి వెళుతుండగా అయితంపూడి లాకుల సమీపంలోని మలుపు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు కాలువలోకి దూసుకుపోయింది. అర్ధరాత్రి వేళ.. వర్షం కురుస్తోంది.. చీకటిలో స్పష్టంగా కనిపించని మలుపు.. కారు అదుపు తప్పి క్షణాల్లోనే పెరవలి – నరసాపురం కాలువలోకి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో విద్యార్థి కోసం గాలింపు కొనసాగుతోంది. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం రాత్రి పెరవలిలో వివాహ వేడుకకు హాజరైన ఆరుగురు యువకులు అనంతరం ఓగిడి గ్రామంలోని పెళ్లికొడుకు ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో తిరుగు ప్రయాణ మయ్యారు. అయితంపూడి లాకుల సమీపంలో ప్రమాదం జరిగింది. ఆచంట మండలం వల్లూరు తోటకు మట్టా సంతోష్‌ కారు పైకి ఎక్కి రక్షించండంటూ కేకలు వేశాడు. స్థానికులు స్పందించి అతడిని రక్షించారు. మిగిలిన ఐదుగురు నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగి విస్తృతంగా గాలింపు చేపట్టారు. గంటల తరబడి సాగిన గాలింపులో నలుగురి మృతదేహాలను వెలికితీశారు. ఇంటర్‌ విద్యార్థి చెరుకూరి రాజారాం చరణ్‌ కోసం గాలింపు కొనసాగుతోంది. చదువుకుని జీవితంలో స్థిరపడతారని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి మృతితో కుటుంబాల్లో కన్నీరే మిగిల్చింది.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సంఘటనా స్ధలాన్ని పరిశీలించి సహాయక, గాలింపు చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పితాని మాట్లాడుతూ ఓగిడి మలుపును తానే గమనించలేదని పలుమార్లు ఈ మలుపులో ఇబ్బంది పడిన సంఘటనలు ఉన్నాయన్నారు. కాలువ మలుపు వద్ద ప్రమాదం జరగకుండా ప్రమాద సూచికలు, అడ్డుకట్ట ఉన్నా ప్రమాదం తప్పేదన్నారు.

హెచ్చరిక బోర్డులు, రక్షణ చర్యలు ఏవీ ?

ఓగిడి–అయితంపూడి మార్గంలో ఉన్న ఈ మలుపు వద్ద రాత్రివేళ ప్రయాణించే వాహనదారులకు స్పష్టమైన హెచ్చరికలు, రిఫ్లెక్టివ్‌ సూచికలు వంటి భద్రతా ఏర్పాట్లు ఎంతవరకు ఉన్నాయన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. వర్షాకాలంలో రహదారిపై మలుపులు స్పష్టంగా కనిపించకపోతే ప్రమాదాలకు అవకాశం ఉంది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా మలుపుల ముందు హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, తగిన వెలుతురు, రహదారి మార్గ సూచికలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అంతులేని విషాదం

అంతర్వేది, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రమాదానికి గురైన ఐదుగురు విద్యార్థులు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి, మోరిపోడు, శృంగవరప్పాడు గ్రామాలకు చెందిన వారు. వీరంతా నర్సాపురంలో ఇంజనీరింగ్‌లో కాలేజీలో చదువుతున్నారు. ప్రమాదంలో నాగిరెడ్డి దుస్వంత్‌సాయి (18), పోతుల లక్ష్మీభాను వికాస్‌ (18) వీరమల్లు సాయి వెంకట కిరణ్‌ (18), నాగబత్తుల తేజ సాయి సూర్య (19) మృతి చెందారు. ఇంటర్‌ విద్యార్థి చెరుకూరి రాజారాం చరణ్‌ గురించి గాలిస్తున్నారు. మోరిపోడుకు చెందిన పోతుల లక్ష్మీభాను వికాస్‌ తండ్రి శ్రీను జీడిపప్పు వ్యాపారస్తుడు. ఇతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెల్లవారుజామున కారు ప్రమాద సంఽఘటన తెలిసిన వెంటనే శ్రీను అనారోగ్యం పాలయ్యారు. నాగిరెడ్డి దుశ్వంత్‌ సాయి తండ్రి సురేష్‌కు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడైన దుశ్వంత్‌ సాయి ఇంజనీరింగ్‌ చదువుతూ తమకు అండగా ఉంటాడనుకుంటే ఈ విధంగా మృతిచెందడం పట్ల తల్లి శ్యామల బోరున విలపిస్తున్నారు. సురేష్‌ ఒక కల్యాణ మండపంలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. చెరుకూరి రాంచరణ్‌ ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. తండ్రి ప్రసాద్‌ ఇటీవల గల్ఫ్‌ నుంచి వచ్చారు. రామ్‌చరణ్‌ తాత స్వగ్రామమైన శృంగవరప్పాడు కాగా వీరు ప్రస్తుతం మోరిలో ఉంటున్నారు. వీరిది పశ్చిమగోదావరి జిల్లా బూరుగుపల్లి కాగా మోరి ఊరులో ఉంటున్నారు. ఒకే ప్రమాదంలో పక్కపక్క గ్రామాలకు చెందిన ముగ్గురు మృతిచెందడంతో ఆయా గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఆదివారం ఉదయం ఈ మూడు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో మృతుల బంధువులు, తల్లిదండ్రులు ప్రమాదస్థలికి చేరుకున్నారు.

Updated Date - Aug 17 , 2026 | 12:27 AM