శివదేవుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Feb 05 , 2026 | 12:22 AM
ద్వారకాతిరుమల కొండపై వున్న శ్రీవారి ప్రధాన ఆలయానికి ఉపాలయమైన శివదేవుని ఆలయంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు.
ద్వారకాతిరుమల శివాలయంలో 12 నుంచి 18 వరకు ఉత్సవాలు
15న రాత్రి లింగోద్భవకాల అభిషేకం, శివయ్య కల్యాణం
ద్వారకాతిరుమల, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమల కొండపై వున్న శ్రీవారి ప్రధాన ఆలయానికి ఉపాలయమైన శివదేవుని ఆలయంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 12 నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 12 ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా చేస్తారు. 13న వేదపారాయణలు, శివయ్యకు అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన, రాత్రి విఘ్నేశ్వరపూజ, శైవ పుణ్యహవాచన, యాగశాల ప్రవేఽశం, ధ్యజారోహణ, 14న రాత్రి స్వామివారి గ్రామోత్సవం, 15న మహాశివరాత్రి పర్వదినాన విశేష కార్యక్రమాలు.. ఉదయం నాలుగు గంటలకు స్వామికి అభిషేకం, వేదపారాయణలు, రాత్రి పది గంటలకు లింగోద్భవకాల అభిషేకం, తర్వాత స్వామి, అమ్మవారి కల్యాణం, అనంతరం గ్రామోత్సవం. 16న అభిషేకం, కుంకుమార్చనలు, గ్రామోత్సవం. 17న వసంతోత్సవం, గ్రామోత్సవం, పూర్ణాహూతి, దీక్ష విరమణ, రాత్రి ఏడు గంటలకు ఆలయద్వాదశ కోవెల ప్రదక్షిణలు. 18న రాత్రి శ్రీపుష్పయాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్త మవుతాయని భక్తులు తరలిరావాలని ఈవో కోరారు. ఆలయ అభివృద్ధికి పలు చర్యలు చేపట్టామని ఇందులో భాగంగా ఆలయం ముందు నూతన గాలిగోపురాన్ని నిర్మించినట్టు వివరించారు.