Share News

సర్‌కు సన్నద్ధం

ABN , Publish Date - May 22 , 2026 | 12:32 AM

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు నాలుగు నెలలు ప్రణాళికను ఎన్నికల కమిషన్‌ రూపొందించింది. ఇందులో భాగంగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఫొటో ఎలక్ర్టోల్‌ రోల్స్‌(సర్‌)కు యంత్రాంగం సన్నద్ధం అవుతోంది.

సర్‌కు సన్నద్ధం

జిల్లాలో ఓటర్లు 16,44,002

రేపు రాజకీయ పక్షాలతో సమీక్ష

జూన్‌ 5 నుంచి క్షే త్రస్థాయిలో పర్యవేక్షణ

15న ఇంటింటా ఓటర్ల పరిశీలన కార్యక్రమం

తుది జాబితాలు సెప్టెంబరు 22న ప్రదర్శన

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు నాలుగు నెలలు ప్రణాళికను ఎన్నికల కమిషన్‌ రూపొందించింది. ఇందులో భాగంగా స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఫొటో ఎలక్ర్టోల్‌ రోల్స్‌(సర్‌)కు యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు ఇటీవలే ఎన్నికల కమిషనర్‌ కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వ హించి సర్‌ ప్రక్రియకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 23న గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్‌ వెట్రిసెల్వి సమావేశం నిర్వహించి వారి నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తారు. జూన్‌ ఐదు నుంచి సర్‌ కార్యక్రమం ప్రారంభించనున్నారు. కాగా జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం పోలింగ్‌కేంద్రాలు 1744 ఉండగా, జిల్లా ఓటర్లు 16 లక్షల 44 వేల 2 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 8,01,873 మంది, మహిళలు 8,42,001 మంది ఉండగా,ట్రాన్స్‌ జెండర్లు 128 మంది ఉన్నారు. ఎన్నికల సంఘం 18 ఏళ్లు నిండిన ఓటర్ల నమోదుకు నిరం తరాయంగా అవకాశం కల్పించడంతో కొత్త ఓటర్ల చేరిక సులభతరం అయ్యింది. జనవరి 1, ఏప్రిల్‌ 1, ఆగస్టు 1, డిసెంబరు 1న నాలుగునెలకొకమారు కటాఫ్‌ డేట్‌ తీసుకుని ఆయా తేదీల నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. రెండు నెలలు క్రితమే పోలింగ్‌ కేంద్రాల పునర్విభజన చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను తప్పించి కొత్తవాటిల్లోకి మార్పు చేశారు.

షెడ్యూల్‌ ఇలా..

ఓటర్ల జాబితాల పరిశీలనకు క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు, ఇఆర్వోలు సన్నద్ధం కానున్నారు. దీనికి శిక్షణలు, జాబితాల ప్రింటింగ్‌కు జూన్‌ 5 నుంచి 14 వరకు చర్యలు తీసుకుంటారు. జూన్‌ 15 నుంచి ఇంటింటా బూత్‌ లెవెల్‌ అధికారులు(బీఎల్‌వో) ఓటర్ల పరిశీలన ప్రారంభించి సర్వే చేపట్టి జూలై 14న పూర్తి చేస్తారు. దాదాపుగా నెలరోజుల పాటు వెరిఫికేషన్‌ చేయనున్నారు. అటు తర్వాత 14 నుంచి పోలింగ్‌ స్టేషన్ల రేషనైలైజేషన్‌ చేస్తారు. జూలై 21 పరిశీలన పూర్తి చేసిన జాబితాలను జిల్లా వ్యాప్తంగా ఉన్న 1744 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల పరిశీలనార్థం ఉంచుతారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాలు, సూచనలు, సలహాలను అవకాశం కల్పించారు. వీటిని సెప్టెంబర్‌ 18వ తేదీలోగా పరిష్కరించి, ఎన్నికల సంఘానికి నియోజకవర్గాల వారీగా నివేదిస్తారు. అక్కడ అధికారులు అనుమతితో జిల్లాలోని తుది ఓటర్ల జాబితాలను సెప్టెంబర్‌ 22ను ప్రచురించనున్నారు.

స్ధానిక సంస్థల ఎన్నికలకు ఉపయుక్తం :

ఓటర్ల జాబితాల పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాబోయే కాలంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు తప్పుల్లేని ఓటర్ల జాబితాలు ఉపకరించనున్నాయి. నాలుగు నెలలు సుదీర్ఘకాలంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు ఇంటింటా సర్వే చేయడం వలన మృతి చెందిన, నకిలీ ఓటర్లను తొలగింపునకు ఆస్కారం ఉండనుంది.

Updated Date - May 22 , 2026 | 12:32 AM