Share News

సిల్వర్‌ షాక్‌..!

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:52 AM

ఆచంట నియోజకవర్గానికి చెందిన ఓ పెద్ద ఆసామి రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకు వడ్డీలు తగ్గడంతో వున్న సొమ్మును సిల్వర్‌పై పెట్టాడు. భారీగా కొనుగోలు చేశారు.

సిల్వర్‌ షాక్‌..!

కేజీ రూ.4.20 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు పతనం

బులియన్‌ మార్కెట్‌ చరిత్రలో తొలిసారి

కోట్లలో నష్టాలు.. కొనుగోలుదారుల గగ్గోలు

ఆచంట నియోజకవర్గానికి చెందిన ఓ పెద్ద ఆసామి రియల్‌ ఎస్టేట్‌, బ్యాంకు వడ్డీలు తగ్గడంతో వున్న సొమ్మును సిల్వర్‌పై పెట్టాడు. భారీగా కొనుగోలు చేశారు. లక్షల్లో లాభాలు వచ్చినా.. అమ్ముకోలేదు. ఇంకా పెరుగుతుందన్న ధీమాతో ఉంచేశాడు. ఈ నేప థ్యంలో శుక్రవారం రాత్రి మార్కెట్‌ భారీగా పతనం అవడంతో వచ్చిన లాభమంతా తుడిచి పెట్టుకుపోయిం ది. దీంతో అమ్ముకున్నా.. బాగుండేదని అయిన వారి దగ్గర గోడు వినిపిస్తున్నాడు.

నరసాపురానికి చెందిన ఓ వ్యక్తి సొమ్ములు లేకపోయినా.. వెండి కాసులు కురిస్తుందన్న ఆశతో ఉన్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి రుణం తీసుకుని పెద్ద మొత్తంలో సిల్వర్‌ కొనుగోలు చేశాడు. అది కూడా కేజీ రూ.3.50 లక్షలు దాటిన తర్వాత ధర రూ.4 లక్షలు దాటినా అమ్మలేదు. దీంతో పెట్టిన పెట్టుబడి తుడిచి పెట్టుకుపోయింది. ఇప్పుడు కొన్న వెండిని ఉంచాలా.. లేక అమ్మలా... తెలియక మదన పడుతున్నాడు. ఇదే పరిస్థితి జిల్లాలో వేల మంది ఎదుర్కొంటున్నారు. అత్యాశతో ఆయినకాడికి అప్పులు తెచ్చి మరీ వెండి, బంగారం కొనుగోలు చేశారు. ఊహించని విధంగా మార్కెట్‌ పతనం కావడంతో గగ్గోలు పెడుతున్నారు.

నరసాపురం, జనవరి 31(ఆంధ్రజ్యోతి):ట్రంప్‌ అమెరికా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత సిల్వర్‌, బంగారం ధరలు గురువారం రాత్రి వరకు బ్రేక్‌లు లేకుండా పరుగెత్తాయి. దీంతో చాలా మంది సామాన్య, మధ్య తరగతి ప్రజలు దృష్టి సిల్వర్‌, బంగారంపై పడింది. వీటిని కొనుగోలు చేస్తే కాసులు మూటగట్టుకోవచ్చునని ఆశ పడ్డారు. ప్రారంభంలో కొనుగోలు చేయలేదు. ధర రూ.3 లక్షలు దాటిన తర్వాత ఇంకా పెరుగుతుందన్న ఆశతో అయిన కాడికి అప్పులు తెచ్చి కొనుగోలు చేశారు. కొందరు ఐదు నుంచి పది కేజీల వరకు కొంటే.. మరికొందరు రెండు నుంచి మూడు కేజీల సిల్వర్‌ కొనుగోలు చేశారు. ఇక బంగారం కొనుగోలులో హద్దు లేకుండా పోయింది. భవిష్యత్‌లో పసిడి కొనలేమన్న భయంతో ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి ఆ సొమ్ముతో కొనుగోలు చేశారు. ఎక్కువ మంది గ్రాము రూ.16 వేలు దాటిన తర్వాతే కొన్నవారే ఉన్నారు. ఒక్కసారిగా ధర పడటంతో వీరంతా దిగాలైపోయారు.

అమ్మకాలు నిల్‌

శనివారం మార్కెట్‌లో నిశబ్ధం నెలకొంది. పేరుగాంచిన నరసాపురం బులియన్‌ మార్కెట్‌లో చాలా మంది వ్యాపారులు అమ్మకాలు జరపలేదు. దీనికి కారణం ధరలో నెలకొన్న సస్పెన్స్‌, మరోవైపు ఆదివారం కేంద్ర మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్‌తో బంగారం పెరుగుతుందన్న ఆశతో అమ్మకాలు జరపలేదు. ఒక్కసారిగా ధర తగ్గడంతో చాలా మంది కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. అయితే శనివారం రావడంతో ఎంసీఎక్స్‌ మార్కెట్‌ సెలవులంటూ దాటవేసే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం ధరలు ఇలా...

ఎంసీఎక్స్‌ ప్రకారం కేజీ వెండి రూ.2.95 లక్షలు ఉంది. దాదాపు రూ.1.35 లక్షలు తగ్గింది. గురువారం రాత్రి వెండి రూ.4.20 లక్షలకు వెళ్లింది. అయితే ఒక్కసారిగా అమ్మకాలు జరపడంతో ధర తగ్గింది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే ట్రెండ్‌ కొనసాగడంతో రూ.2.95 లక్షల వద్ద నిలిచింది. బంగారం విషయానికి వస్తే గ్రాము రూ.16,200లకు దిగింది. ఒక దశలో పసిడి రూ.18.900 వెళ్లింది. రూ20 వేలకు చేరుతుందని ఎదురుచూశారు. కానీ తగ్గుముఖం పట్టింది. గ్రాముకు రూ.2,640 తగ్గింది. బులియన్‌ చరిత్ర గ్రాము ఇంత పెద్ద మొత్తంలో తగ్గడం ఇదే తొలిసారి.

గతంలో ఎప్పుడూ లేదు

బులియన్‌ చరిత్రలో ఇంత భారీగా పడటం ఇదే తొలిసారి. ఎవరూ అంచనా వేయలేదు. దీనికి సరైన కారణం ఇంకా తెలియరాలేదు. రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారీగా పెరిగిన సిల్వర్‌, బంగారం ధరలు తగ్గుతాయని భావించాం. కానీ ఇంత భారీగా పడతాయని ఊహించలేదు.

– అజిత్‌కుమార్‌జైన్‌, జిల్లా మాజీ

బులియన్‌ అఽధ్యక్షులు

పెరుగుడు విరుగుడుకే..

గతంలో బంగారం, వెండి పెరిగినా ఏదో నామమాత్రం గా ఉండేవి. ఇంత భారీగా పెరుగుతాయని ఊహించలేదు. పెరుగుడు విరుగుడుకేనన్న సామెత రుజువైంది. ఇంకా తగ్గుతాయన్న ఊహా గానాలు వినిపిస్తున్నాయి. పాత ధరలకు వస్తే.. చాలా మంది కొనాలన్న ఆలోచనలో ఉన్నారు.

– ఆకుల కృష్ణకుమారి, గృహిణి, నరసాపురం

Updated Date - Feb 01 , 2026 | 12:52 AM